రాష్ట్రపతిని అవమానించింది మీరే
ABN , Publish Date - Mar 09 , 2026 | 04:56 AM
పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా తలెత్తిన ప్రొటోకాల్ ఉల్లంఘన రాజకీయ వివాదానికి దారి తీసింది.
ఆమె నిల్చుంటే మీరు కుర్చీలో కూర్చొన్నారు.. అడ్వాణీకి భారతరత్న ప్రదానం నాడు జరిగింది ఇదే
ప్రధాని మోదీపై మమత ఘాటు విమర్శలు
న్యూఢిల్లీ, కోల్‌కతా, మార్చి 8: పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా తలెత్తిన ప్రొటోకాల్ ఉల్లంఘన రాజకీయ వివాదానికి దారి తీసింది. దీనిపై ప్రధాని మోదీ ఆదివారం మరోసారి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. రాష్ట్రపతికి తగిన రీతిలో స్వాగతం పలకకుండా అవమానించిందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సహా పలువురు నేతలు మమత సర్కారును తప్పుపట్టారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఇందుకు ఘాటుగా సమాధానం ఇచ్చారు. రాష్ట్రపతిని అవమానిస్తోంది బీజేపీయేనని, తాము కాదని చెప్పారు. ఓటర్ల తొలగింపు సమస్యపై కోల్‌కతాలో రెండో రోజు ఆదివారం ధర్నాలో పాల్గొన్న మమత ఈ అంశంపై మాట్లాడారు. ద్రౌపది ముర్మును ప్రధాని మోదీ తగిన రీతిలో గౌరవించడం లేదని ఆరోపిస్తూ పాత ఫొటోను పెద్దదిగా చేసి సాక్ష్యంగా చూపారు. 2024 మార్చిలో బీజేపీ వ్యవస్థాపక నేత అడ్వాణీకి భారత రత్న పురస్కారాన్ని బహూకరించిన సందర్భంగా తీసిన ఫొటోను చూపించారు. ఆ ఫొటోలో ఆడ్వాణీ, ప్రధాని మోదీ కుర్చీల్లో కూర్చొని ఉండగా, రాష్ట్రపతి మాత్రం నిల్చొని ఉన్నారు. ‘‘ఈ ఫొటో మీ కోసం. ప్రత్యేకంగా ప్రధాని కోసం. మీరు గిరిజన నాయకురాలిని, రాష్ట్రపతిని ఎప్పుడూ గౌరవించలేదు. రాష్ట్రపతి నిల్చొని ఉంటే ప్రధాని కూర్చొని ఉన్నారు. మేం గౌరవిస్తాం. వారు గౌరవించరని చెప్పడానికే ఈ ఫొటో చూపిస్తున్నా’’ అని అన్నారు. రాష్ట్రపతిని కించపరిచే సంస్కృతి బీజేపీదే తప్ప తమది కాదని అన్నారు. రాజకీయ అవసరాల కోసం బీజేపీ దేశంలోని అత్యున్నత స్థానమైన రాష్ట్రపతిని అగౌరవించిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎక్కడా ప్రొటోకాల్ ఉల్లంఘన జరగలేదని మమత అన్నారు. ఏవైనా లోపాలు ఉంటే అందుకు కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రయివేటు సంస్థ, స్థలం ఇచ్చిన ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి ఆ ప్రయివేటు నిర్వాహకులు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి వివరాలు ఇవ్వలేదని స్పష్టంచేశారు. సమావేశ స్థలాన్ని తాము ఎంపిక చేయలేదని, వారే చూసుకున్నారని చెప్పారు. బగ్దోగ్రా విమానాశ్రయంలో రాష్ట్రపతికి సిలిగుడి మేయర్ గౌతమ్ దేబ్ ప్రొటోకాల్ ప్రకారం స్వాగతం పలికారని చెప్పారు. ‘‘నేను ఎలా వెళ్లగలను? అందరి కోసం పోరాడుతూ ధర్నాలో కూర్చొన్నా. దాన్ని విడిచిపెట్టి ఎలా వెళ్లగల’’నని అన్నారు. మరోవైపు ప్రొటోకాల్ ఉల్లంఘనపై సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఆదేశించారు.
విజ్ఞులైన బెంగాలీలు మమతను క్షమించరు: ప్రధాని మోదీ
మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యమ్రంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ గిరిజన మహిళా రాష్ట్రపతిని తృణమూల్ ప్రభుత్వం అవమానించిందని, విజ్ఞులైన బెంగాలీ ప్రజలు దీనిని క్షమించరని అన్నారు. అంతర్జాతీయ సంతాల్ సమ్మేళనానికి వెళ్లిన తనను సీఎం మమత ఆహ్వానించలేదని శనివారం రాష్ట్రపతి అసంతృప్తి వ్యక్తం చేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని మోదీ ఖండించారు. ఆదివారం మరోసారి ఆ విషయాన్ని ప్రస్తావించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం గిరిజనుల కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించలేదని విమర్శించారు. దీనిని గిరిజనులు, దేశ ప్రజలు క్షమించరని అన్నారు. ప్రొటోకాల్ ఉల్లంఘనను ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మణిపూర్ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, మోహన్ చరణ్ మాఝి, వై.ఖేమ్‌చంద్ సింగ్‌లు ఖండించారు.