స్పీకర్‌పై అవిశ్వాసం.. సభలో ఎవరి బలం ఎంత?
ABN , Publish Date - Mar 09 , 2026 | 07:48 AM
నేటి నుంచి పార్లమెంట్ రెండో దశ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజే స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ తీర్మానం ఆమోదం పొందుతుందా? లేక వీగిపోతుందా? సభలో అధికార, విపక్ష పార్టీల బలాబలాలెలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం...
ఇంటర్నెట్ డెస్క్: పార్లమెంట్ రెండో దశ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానంపై తొలి చర్చ జరగనుంది. బడ్జెట్ సమావేశాల మొదటి దశలో సభాపతి పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ 118 మంది విపక్ష ఎంపీల సంతకాలతో కూడిన నోటీసు నేటి సభలో చర్చకు దారితీయనుంది. ఆ సమయంలో తృణమూల్ కాంగ్రెస్(TMC) ఎంపీలు నోటీసుపై సంతకాలు చేయలేదు. కానీ ఇప్పుడు మద్దతిస్తామని టీఎంసీ చెబుతోంది.
నిబంధనలు ఏం చెబుతున్నాయ్?
రాజ్యాంగంలోని 94(సి) అధికరణ ప్రకారం.. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సభలో కనీసం 50 మంది సభ్యులు నిల్చుని మద్దతు తెలపాలి. దీనికి అనుగుణంగా అవిశ్వాస తీర్మానంపై చర్చ, ఓటింగ్ జరుగుతుంది. ఆ సమయంలో స్పీకర్ చర్చలో పాల్గొని ఓటు వేయవచ్చు. కానీ అధ్యక్షత వహించలేరు. ఆ చర్చకు ప్యానెల్ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. సభాపతిపై అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందాలంటే సభలో హాజరైన, ఓటువేసిన సభ్యులలో సగానికంటే ఎక్కువ సాధారణ మెజారిటీ అంటే 273 మంది ఎంపీల మద్దతు తప్పనిసరి. ప్రస్తుతం.. ఇండియా బ్లాక్ మొత్తం బలం సుమారు 234 సీట్లు. విపక్షాలన్నీ కలిసి ఓటేసినా ఎన్డీఏ మెజారిటీని దాటలేవు. దీంతో తీర్మానం వీగిపోయే అవకాశాలే ఎక్కువ. అధికార ఎన్డీఏ బలం సుమారు 293 స్థానాలతో పటిష్ఠంగా ఉంది. ఎన్డీఏ కూటమిలో లేని వైసీపీ, శిరోమణి అకాలీదళ్, స్వతంత్ర ఎంపీల మద్దతు కలిస్తే ఈ బలం 300 దాటుతుంది. ఇలా ఎన్డీఏకు స్పష్టమైన సంఖ్యాబలం ఉండటంతో స్పీకర్‌గా ఓం బిర్లాయే కొనసాగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఇక.. ఇటీవల రాజస్థాన్‌లో కోటా ఎయిర్‌పోర్ట్ శంకుస్థాపన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ స్పీకర్ ఓం బిర్లాను అత్యంత నిష్పక్షపాతంగా, గౌరవప్రదంగా, సభను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని ప్రశంసిస్తూ సంకేతాలిచ్చారు.
గతంలోనూ..
ఇప్పటివరకు మూడుసార్లు అవిశ్వాస తీర్మానం ప్రేవేశపెట్టినా.. రెండుసార్లు ఓటింగ్ దాకా వచ్చి వీగిపోయాయి. ఓటింగ్‌కు హాజరైన ఎంపీలలో సగానికంటే ఎక్కువ ఓట్లు అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఉండటం వల్ల తీర్మానం వీగిపోయింది. గతంలో స్పీకర్లు.. 1954లో జీవీ.మౌలాంకర్, 1966లో హుకుం సింగ్, 1987లో బలరాం జాఖడ్‌లపై విపక్షాలు అవిశ్వాస తీర్మానాలు ఇవ్వగా అవన్నీ వీగిపోయాయి.
నేటి నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగే పార్లమెంట్ రెండో విడత సమావేశాల్లో తొలిరోజే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానంపై చర్చ, ఓటింగ్ జరగనుంది. విపక్ష సభ్యులు ఇచ్చిన నోటీసు ప్రకారం.. కాంగ్రెస్ ఎంపీలు మహమ్మద్ జావేద్, కె.సురేశ్, ఎం.రవిలు ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. సభాపతి పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్నారని విపక్ష ఎంపీలు ఆరోపిస్తున్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సహా విపక్ష నేతలెవరకీ మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదనీ, విపక్ష మహిళా ఎంపీలపై అనుచిత ఆరోపణలు చేశారంటున్నారు. ప్రజా సమస్యలు లేవనెత్తినందుకు 8 మంది విపక్ష ఎంపీలను పూర్తి సమావేశానికే హాజరుకాకుండా సస్పెన్షన్ వేటు వేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే.. అధికార బీజేపీ, ఎన్‌డీఏ సభ్యులు మాజీ ప్రధానులపై అనుచిత వ్యాఖ్యలు చేసినా ఎలాంటి చర్య తీసుకోలేదని వివాదాస్పద విషయాల్లో బహిరంగంగా అధికార పార్టీకి మద్దతిచ్చారని విపక్షాలు మండిపడుతున్నాయి. స్పీకర్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం లేదని 118 మంది విపక్ష ఎంపీలు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు ఫిబ్రవరి 10న అవిశ్వాస తీర్మానం అందజేశారు.
ఇవీ చదవండి:
రాష్ట్రపతిని అవమానించింది మీరే
ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకుంటాం