మోదీజీ.. రాష్ట్రపతికి మీరిచ్చే గౌరవం ఇదేనా.. ఫొటో షేర్ చేసిన మమత
ABN , Publish Date - Mar 08 , 2026 | 08:47 PM
పశ్చిమబెంగాల్‌లో పర్యటన సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అవమానించారంటూ తృణమూల్ కాంగ్రెస్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమర్శించడంతో కేంద్రం, మమతా సర్కార్ మధ్య రాజకీయ వివాదం తీవ్రమైంది. తాజాగా మమతా బెనర్జీ 2024 నాటి ఒక ఫొటోను షేర్ చేశారు.
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో పర్యటన సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అవమానించారంటూ తృణమూల్ కాంగ్రెస్‌పై ప్రధాన మంత్రి విమర్శించడంతో కేంద్రం, మమతా సర్కార్ మధ్య రాజకీయ వివాదం తీవ్రమైంది. తాజాగా మమతా బెనర్జీ 2024 నాటి ఒక ఫొటోను షేర్ చేశారు. ఇందులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిలుచుని ఉండగా.. మోదీ కూర్చుని ఉండటం కనిపిస్తోంది. 'రాష్ట్రపతిని గౌరవించడమంటేనా ఇదేనా' అని మమత ఈ సందర్భంగా మోదీని నిలదీశారు.
మమతా బెనర్జీ షేర్ చేసిన ఫొటో 2024 మార్చి నాటిది. బీజీపీ అగ్రనేత ఎల్‌కే అడ్వాణీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న'ను రాష్ట్రపతి అందజేసినప్పటి ఫొటో ఇది. ఆ సమయంలో అడ్వాణీ పక్కనే మోదీ కూర్చుని ఉన్నారు. తాజాగా పశ్చిమబెంగాల్‌లో రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఆమెను మమత ప్రభుత్వం అవమానించిందంటూ ఓ ట్వీట్‌లో మోదీ తప్పుపట్టారు. దీనిపై మమతా బెనర్జీ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో కౌంటర్ ఇచ్చారు.
'ఇది మీ కోసమే, ముఖ్యంగా ప్రధానమంత్రి కోసం. మీరు గిరిజన నేత, భారత రాష్ట్రపతిని గౌరవించలేదు. రాష్ట్రపతి నిలబడి ఉంటే ప్రధాని కూర్చుని ఉన్నారు' అని బెనర్జీ అన్నారు. తమకు రాష్ట్రపతి అంటే గౌరవం ఉందని, వారికి మాత్రం ఆ గౌరవం లేదని చెప్పడానికే ఈ ఫొటోను షేర్ చేస్తున్నానని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
ప్రొటోకాల్ ఉల్లంఘన ఉత్తమాట... బీజేపీపై మమత ఫైర్
మమతా ప్రభుత్వాన్ని దేశం క్షమించదు: ప్రధాని మోదీ