Share News

ప్రొటోకాల్ ఉల్లంఘన ఉత్తమాట... బీజేపీపై మమత ఫైర్

ABN , Publish Date - Mar 08 , 2026 | 07:49 PM

పశ్చిమబెంగాల్‌లోని సిలిగురిలో అంతర్జాతీయ సంతాల్ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యేందుకు జరిపిన పర్యటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తిప్పికొట్టారు. ఎలాంటి ప్రోటోకాల్ ఉల్లంఘన జరగలేదని స్పష్టంచేశారు.

ప్రొటోకాల్ ఉల్లంఘన ఉత్తమాట... బీజేపీపై మమత ఫైర్
Mamata Banerjee

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని సిలిగురిలో అంతర్జాతీయ సంతాల్ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యేందుకు జరిపిన పర్యటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) తిప్పికొట్టారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఎలాంటి ప్రోటోకాల్ ఉల్లంఘన జరగలేదని స్పష్టంచేశారు. ఈనెల 7న రాష్ట్రపతి పర్యటన సందర్భంగా చిన్న వేదిక ఏర్పాటు చేయడం, తక్కువ మంది హాజరు కావడం, మమతాబెనర్జీతో సహా రాష్ట్ర మంత్రులు గైర్హాజరు కావడంపై రాష్ట్రపతి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ చర్యను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు బీజేపీ నేతలు ఖండించారు.


రాజకీయ ప్రయోజనాల కోసమే..

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాష్ట్రపతి వ్యాఖ్యలను బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. రాష్ట్రపతి ఈవెంట్‌ను పశ్చిమబెంగాల్ ప్రభుత్వం సరిగా నిర్వహించలేకపోయిందంటూ బీజేపీ విమర్శించడాన్ని తప్పుపట్టారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇదే తరహా ఘటనలు జరిగినప్పుడు ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు.


రాష్ట్రం పాత్ర ఏమిటంటే..

నిర్వహణా లోపం జరిగి ఉంటే అది ప్రైవేటు నిర్వాహకులు, ఎయిర్ ఫోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా వల్లేనని, పశ్చిమబెంగాల్ ప్రభుత్వం వల్ల కాదని మమత వివరణ ఇచ్చారు. రాష్ట్రపతి కార్యాలయం పట్ల రాష్ట్రానికి సంపూర్ణమైన గౌరవం ఉందని, ఎలాంటి ప్రోటోకాల్ ఉల్లంఘన జరలేదని చెప్పారు. జిల్లా యంత్రాంగం ఎలాంటి ప్రోటాకాల్ ఉల్లంఘనలకు పాల్పడలేదని చెప్పారు. బీజేపీనే సొంత పార్టీ ఎజెండాతో రాష్ట్రపతి హోదాను అగౌరవపరుస్తూ, దుర్వినియోగం చేస్తోందని తప్పుపట్టారు. ప్రోగ్రాం వివరాల గురించి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ముందస్తు సమాచారం లేదని సీఎం తెలిపారు.


రాష్ట్రపతిపై విసుర్లు

'గిరిజనులపై దౌర్జన్యాలు జరుగుతుంటే మీరెందుకు నిరసన చెప్పలేదు? ఎంపీ, సీజీలో ఇవి జరిగినప్పుడు ఎందుకు నిరసన చెప్పలేకపోయారు? వాళ్ల కోసం మీరు ఎందుకు ఏమీ చేయలేకపోయారు. బీజేపీ కోసం రాజకీయాలు చేయవద్దు, చెయిర్‌ను దిగజార్చకండి' అని మమతాబెనర్జీ అన్నారు. ఏడాదికి ఒకసారి వస్తే ఆహ్వానించగలనని, ఎన్నికల సమయంలో వస్తే అది తనకు సాధ్యం కాదని రాష్ట్రపతి పర్యటనను ఉద్దేశించి అన్నారు.


ఇవి కూడా చదవండి..

మమతా ప్రభుత్వాన్ని దేశం క్షమించదు: ప్రధాని మోదీ

జేడీయూలో చేరిన నితీశ్ కుమార్ తనయుడు నిశాంత్ కుమార్

Updated Date - Mar 08 , 2026 | 09:02 PM