మమతా ప్రభుత్వాన్ని దేశం క్షమించదు: ప్రధాని మోదీ
ABN , Publish Date - Mar 08 , 2026 | 05:22 PM
పశ్చిమ బెంగాల్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా మమతా బెనర్జీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ప్రధాని మోదీ మండిపడ్డారు. రాష్ట్రపతి ముర్ముని మమతా ప్రభుత్వం అవమానించిందన్నారు.
న్యూఢిల్లీ, మార్చి 08: పశ్చిమ బెంగాల్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా మమతా బెనర్జీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ప్రధాని మోదీ మండిపడ్డారు. రాష్ట్రపతి ముర్ముని మమతా ప్రభుత్వం అవమానించిందన్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని దేశంతోపాటు నారీ శక్తి క్షమించదని ఆయన స్పష్టం చేశారు. దేశంలో అత్యున్నతమైన రాజ్యాంగ పదవిలో ఉన్న ఆమెను ఈ విధంగా అవమానించిందంటూ ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. పశ్చిమ బెంగాల్‌లో శనివారం తన పర్యటన సందర్భంగా మమతా ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై రాష్ట్రపతి ముర్ము అసంతృప్తి వ్యక్తం చేశారన్నారు.
శనివారం పశ్చిమ బెంగాల్‌లో తన పర్యటన సందర్భంగా రాష్ట్రప్రభుత్వం వ్యవహరించిన తీరుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పెదవి విరిచారు. తన పర్యటన వేళ.. రాష్ట్రప్రభుత్వం సరైన చర్యలు చేపట్టలేదని ముర్ము వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ముర్ము వ్యాఖ్యలపై సీఎం మమతా బెనర్జీ తనదైన శైలిలో స్పందించారు. ఇవి బీజేపీ ఆదేశాలతో.. రాజకీయపరమైనవని ముర్ము వ్యాఖ్యలను సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్ వేదికగా 9వ అంతర్జాతీయ సంతాలి సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. దేశ రాష్ట్రపతి హోదాగా అత్యున్నత పదవిలో ఉన్న ముర్ము శనివారం పశ్చిమ బెంగాల్ విచ్చేశారు. ఈ సందర్భంగా సీఎం మమతా బెనర్జీ, ఆమె కేబినెట్ సహచరులు ఎవ్వరూ ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. ఇక ప్రోటోకాల్ ప్రకారం ఎయిర్ పోర్టులో ముర్ముకు వారెవ్వరూ స్వాగతం పలకలేదు.
అలాగే ఈ అంతర్జాతీయ సమావేశానికి భారీగా ప్రజలు హాజరుకారని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. దాంతో ఈ సదస్సు వేదికను మరో ప్రాంతానికి మార్చింది. మొత్తం ఈ వ్యవహారంతో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీపై బీజేపీ ఆరోపణలు గుప్పించింది. ఈ ఆరోపణలను సీఎం మమతా బెనర్జీతోపాటు ఆ పార్టీ నేతలు తిప్పికొట్టారు. మరో రెండు నెలల్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని.. అలాంటి వేళ మోదీ నేతృత్వంలోని బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోందంటూ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది.
ఈ వార్తలు కూడా చదవండి..
జేడీయూలో చేరిన నితీశ్ కుమార్ తనయుడు నిశాంత్ కుమార్
కమల్ స్టైల్లో అమిత్.. రజనీలా మోదీ
For More National News And Telugu News