ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా మొజ్తాబా ఖమేనీ.. ప్రస్థానమిదే..
ABN , Publish Date - Mar 09 , 2026 | 01:41 PM
ఇరాన్‌లో సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ సుప్రీం నేతగా నియమితులైనట్టు సమాచారం. ఈ నియామకాన్ని ఐఆర్‌జీసీ ప్రేరేపిస్తూ.. మొజ్తబాకు కీలక బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌లో పరిస్థితులు అగ్నిగుండంలా మారిన నేపథ్యంలో అధికార మార్పిడి పర్వం ముగిసినట్టు తెలుస్తోంది. పలు మీడియా కథనాల ప్రకారం.. ఆ దేశ రాజకీయాల్లో కీలకపరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో.. అగ్రపీఠంపై వారసుడు కొలువుదీరారు. ఇరాన్ అత్యున్నత నేతగా మొజ్తబా ఖమేనీ బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చర్చంతా ఆయన గురించే. ఇజ్రాయెల్ దాడుల దెబ్బకు అల్లాడుతున్న ఇరాన్.. ఇప్పుడు ఖమేనీ తనయుడి నీడలో సరికొత్త యుద్ధ వ్యూహాలకు పదునుపెట్టే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఎవరీ మొజ్తబా ఖమేనీ? ఆయన ప్రస్థానమేంటి? ఆ వివరాలను పరిశీలిస్తే...
37 ఏళ్ల అనంతరం..
దివంగత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ రెండో కుమారుడే 56 ఏళ్ల మొజ్తబా ఖమేనీ. 88 మంది సభ్యులతో కూడిన 'అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్' వర్చువల్ సమావేశంలో మొజ్తాబాను ఎన్నుకున్నట్టు తెలుస్తోంది. మొజ్తబా ఖమేనీ గతంలో ఏ ప్రభుత్వ పదవి చేపట్టకపోయినప్పటికీ.. తెర వెనుక నుంచే ఇరాన్ అధికార యంత్రాంగాన్ని శాసిస్తున్నారనే ప్రచారం ఉంది. 2019లోనే ఆయనపై ఆంక్షలు విధించింది అమెరికా. అయితే.. ఆయన మధ్యస్థ స్థాయి మతాధికారి మాత్రమే అయినప్పటికీ ఐఆర్‌జీసీ, ఇంటెలిజెన్స్ వంటి విభాగాలపై పూర్తి స్థాయిలో పట్టుంది. 1989లో అయతుల్లా అలీ ఖమేనీ బాధ్యతలు చేపట్టాక.. అంటే 37 ఏళ్ల తర్వాత ఇరాన్ నాయకత్వంలో జరిగిన రెండో మార్పు ఇది.
ఇరాన్‌లోని శక్తిమంతమైన సైనిక విభాగం 'ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్‌జీసీ)' ఒత్తిడి మేరకే ఈ నియామకం జరిగినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో దేశాన్ని నడిపించడానికి భద్రతా వ్యవస్థలతో సన్నిహిత సంబంధాలున్న మొజ్తబాయే సరైన వ్యక్తని ఐఆర్‌జీసీ బలంగా నమ్ముతోంది. వాస్తవానికి గతంలో ఇరాన్ నాయకత్వం.. వారసత్వ పాలనను తీవ్రంగా వ్యతిరేకించేది. కానీ అసాధారణ పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో పాత సిద్ధాంతాలను పక్కనపెట్టి ఖమేనీ కుమారుడికే పగ్గాలు అప్పగించినట్టు తెలుస్తోంది.
అసంతృప్తి ఉన్నప్పటికీ..
ఓవైపు ఇజ్రాయెల్, అమెరికా దాడులు.. మరోవైపు కుటుంబ సభ్యుల(తల్లిదండ్రులు, భార్య, కుమార్తె)ను కోల్పోయిన మొజ్తబా ప్రస్తుతం తీవ్రంగా కుంగిపోతున్నారు. ఆయన నియామకం పట్ల ఇరాన్‌లోని కొన్ని మతపరమైన వర్గాల్లో కొంతమేర అసంతృప్తి ఉన్నట్టు తెలుస్తోంది. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో కరుడుగట్టిన సిద్ధాంతకర్త అవసరమని ఐఆర్‌జీసీ భావించిందని సమాచారం. అందుకే మొజ్తబాను ఇరాన్ సుప్రీంగా నియమించినట్టు పలు అంతర్జాతీయ మీడియా కథనాల ద్వారా స్పష్టమవుతోంది.
ఇవీ చదవండి:
భారత్‌లో 4 వేల కోట్ల లీటర్ల చమురు నిల్వలు.. ఎన్ని రోజులకు సరిపోతాయి..
క్రూడ్ ఆయిల్ పరిస్థితిపై భారత ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది: జై శంకర్
లిక్కర్ పాలసీ కేసు.. సీబీఐ ప్రత్యేక కోర్టు వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు స్టే