AI Vs ARపై 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' డైరెక్టర్ ప్రత్యేక విశ్లేషణ
ABN , Publish Date - Mar 07 , 2026 | 02:33 PM
టెక్నాలజీ మనకు అపారమైన సమాచారం అందిస్తున్నప్పటికీ.. దానిని మనమెలా ఉపయోగిస్తున్నామనేదానిపై ప్రభావం ఉంటుంది. కృత్రిమ మేధకు తోడు మనిషి వివేచన, అనుభవంతో కూడిన ఆలోచన కలగలిసినప్పుడే సాంకేతికత సమాజానికి నిజమైన ప్రయోజనం చేకూరుతుందని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ వివరించారు.
డిజిటల్ టెక్నాలజీ మన జీవన విధానాన్ని మాత్రమే కాదు, ఆలోచనా విధానాన్నీ గణనీయంగా ప్రభావితం చేస్తోంది. కృత్రిమ మేధ, వాస్తవిక వృద్ధి వంటి సాధనాలు జ్ఞానాన్ని విస్తరించే శక్తిని కలిగినప్పటికీ.. అవి మన అనుభవాలనూ ఓ మాయాజాలంలా మార్చే అవకాశముంది. టెక్నాలజీ వినియోగం సమతుల్యంగా ఉంటే అది అభివృద్ధికి దోహదపడుతుంది. కానీ దానిని అతిగా వినియోగిస్తే.. మన స్వతంత్ర ఆలోచనా సామర్థ్యానికే ముప్పు వాటిల్లే ప్రమాదముంది.
టెక్నాలజీ మనకు అపారమైన సమాచారం అందిస్తున్నప్పటికీ.. దానిని మనమెలా ఉపయోగిస్తున్నామనేదానిపై ప్రభావం ఉంటుంది. కృత్రిమ మేధకు తోడు మనిషి వివేచన, అనుభవంతో కూడిన ఆలోచన కలగలిసినప్పుడే సాంకేతికత సమాజానికి నిజమైన ప్రయోజనం చేకూరుతుందని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ భాను ప్రకాష్ కోగంటి 'ఎక్స్' వేదికగా వివరించారు.
డిజిటల్ యుగం మన జీవితాన్ని శరవేగంగా మార్చేస్తోంది. ఒకప్పుడు మనిషి అనుభవం, ఆలోచనలే ప్రపంచాన్ని అర్థం చేసుకునే ప్రధాన సాధనాలుగా ఉండేవి. కానీ ఇప్పుడు విస్తృత టెక్నాలజీ మన ముందుకొచ్చింది. కృత్రిమ మేధ(AI), వాస్తవిక వృద్ధి(AR) వంటివి కేవలం సాంకేతిక పరిభాషలు మాత్రమే కాదు.. అవి మన ఆలోచనలను, మన విజ్ఞానంపైనా ప్రభావం చూపుతున్నాయి. దైవత్వమైనా, భయంకరమైన మత్తుపదార్థమైనా.. రెండింటిలోనూ ఓ సామాన్య లక్షణం ఉంది. అవి పరిమితిలో ఉంటే ఒక అనుభూతినిస్తాయి. హద్దుదాటితే మత్తు స్థితికి తీసుకెళ్తాయి. టెక్నాలజీ కూడా అచ్చం అలాగే పనిచేస్తుంది. అది మనకు జ్ఞానం ఇచ్చే సాధనమా? లేక మనల్ని మాయలో పడేసే మత్తా? అనేది దాన్ని ఉపయోగించే తీరుపైనే ఆధారపడి ఉంటుంది.

ఈ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో పాటు రియల్ ఇంటలిజెన్స్(ఆర్ఐ) అనే భావన కూడా కీలకపాత్ర పోషిస్తుంది. ఏఐ అనేది యంత్రాల ద్వారా రూపొందించిన తెలివైతే, ఆర్ఐ అనేది మనిషి అనుభవం, వివేచన, నైతికతలతో కూడిన నిజమైన జ్ఞానం. ఈ రెండూ కలిసి పనిచేసినప్పుడే సాంకేతికతకు సరైన దిశ, దశ లభిస్తుంది. లేదంటే టెక్నాలజీ అనేది ఓ సాధనంగా కాకుండా మాయాజాలంగా మారే ప్రమాదముంది. ప్రస్తుత సోషల్ మీడియా ప్రపంచమే దీనికి స్పష్టమైన ఉదాహరణ.
ఇంటెలిజెన్స్ లేనిదే టెక్నాలజీ మాటేంటి?
చిన్న వీడియోలు, రీల్స్, డిజిటల్ ఎఫెక్ట్స్‌తో రూపొందిన ఈ వర్చువల్ ప్రపంచం.. వాస్తవ, మాయల మధ్య గీతను మరింత మసకబారుస్తోంది. ఇక్కడే ఏఆర్ పాత్ర ప్రారంభమౌతుంది. ఏఆర్ ద్వారా వాస్తవానికి అదనపు డిజిటల్ హంగులు జోడించి ఓ కొత్త అనుభూతిని సృష్టిస్తున్నారు. అది వినోదం, విద్య కోసం ఉపయోగపడవచ్చు. లేదా నిజాన్ని వక్రీకరించేందుకూ అవకాశముంది. అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. ఏఐ, ఆర్ఐ లోని ‘ఐ’ అంటే ఇంటెలిజెన్స్.. అదే లేకపోతే టెక్నాలజీ ఏమవుతుంది? అది నిజాన్ని అర్థం చేసుకునే సాధనమా? లేక కేవలం ఒక మత్తు అనుభూతిని ఇచ్చే డిజిటల్ మాయాజాలమా?

మానవ మేధస్సే అంతిమం
డిజిటల్ యుగంలో మనిషి ఎదుర్కొంటున్న అసలైన సవాల్ ఇదే. టెక్నాలజీని అందంగా అనుసరించడమా లేక మన వివేచనతో దాన్ని నియంత్రించడమా అన్నది ప్రతి వ్యక్తి నిర్ణయించుకోవాల్సిన విషయం. ఎందుకంటే.. టెక్నాలజీ ఎంత ముందుకెళ్లినా, చివరకు దానికి దిశ చూపాల్సింది మానవ మేధస్సేనని మరవకూడదు. అందుకే ఈ రీల్స్ ప్రపంచంలో మనమెప్పుడూ ఓ విషయం గుర్తుంచుకోవాలి.. టెక్నాలజీ ఎప్పటికీ వాస్తవాన్ని సృష్టించదు. అది మనం చూడాలనుకునే ప్రపంచాన్ని మరింత పెద్దదిగా చేసి చూపుతుందంతే. నిజాన్ని గుర్తించే బాధ్యత మాత్రం ఎప్పటికీ మానవునిదే.
ఇవీ చదవండి:
బెంగాల్‌లో ఓటర్ల తొలగింపును నిరసిస్తూ సీఎం మమత ధర్నా
టీవీ న్యూస్ ఛానళ్ల టీఆర్పీ రిపోర్టింగ్‌పై కేంద్రం నిషేధం