Share News

బెంగాల్‌లో ఓటర్ల తొలగింపును నిరసిస్తూ సీఎం మమత ధర్నా

ABN , Publish Date - Mar 07 , 2026 | 07:47 AM

ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగిస్తున్నారంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ శనివారం ధర్నాకు దిగారు. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో అర్హులైన ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారని ఆరోపిస్తూ ఆమె నిరసన బాటపట్టారు.

బెంగాల్‌లో ఓటర్ల తొలగింపును నిరసిస్తూ సీఎం మమత ధర్నా
Mamata Banerjee

ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమ్ బెంగాల్లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(సర్) పేరిట పెద్దఎత్తున ఓటర్లను తొలగించడాన్ని నిరసిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధర్నాకు దిగారు. ఈ మేరకు కోల్‌కతాలోని ప్రముఖ ఎస్‌ప్లానెడ్ ప్రాంతంలోని మెట్రో ఛానల్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం ఆమె నిరసన బాటపట్టారు. ఏప్రిల్ నెలలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో సీఎం ఇలా ధర్నాకు పూనుకోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.


ధర్నాలో దీదీ మాట్లాడుతూ.. బీజేపీ, ఎలక్షన్ కమిషన్(ఈసీ)లు కలిసి బెంగాలీ ఓటర్ల పేర్లను తొలగించేందుకు కుట్ర పన్నాయన్నారు. 'ఈ కుట్రను త్వరలోనే బయటపెడతాను. సవరించిన జాబితాలో చాలా మంది చనిపోయినట్టు తప్పుగా ప్రకటించారు. కానీ వారంతా బతికే ఉన్నారు. వారందరినీ వేదికపైకి తీసుకువచ్చి.. ఆ అవకతవకలన్నింటీ బహిర్గతం చేస్తాను' అని మమత చెప్పుకొచ్చారు. ఓటరు సవరణ ప్రక్రియలో బీజేపీ, ఈసీ సహా అందులోని ఏజెంట్లంతా పరిమితులు దాటారని సీఎం ఆరోపించారు. ఈ ధర్నా ఇలాగే కొనసాగిస్తామని ఈ విషయాలపై శనివారం మరింత వివరంగా మాట్లాడతానని చెప్పారు. అయితే.. ధర్నాను ఎన్నిరోజులు కొనసాగిస్తారనే దానిపై ఆమె స్పష్టతనివ్వలేదు. దీంతో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా వివాదాన్ని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ప్రచారంలో ప్రధాన రాజకీయాస్త్రంగా మార్చుకోనున్నట్టు ఆమె సంకేతాలిచ్చారని తెలుస్తోంది.


కాగా.. ఈసీ ఫిబ్రవరి 22న విడుదల చేసిన తుది ఓటరు జాబితాలో 63.66 లక్షల పేర్లను తొలగించింది. ఇది ఆ రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో 8.3 శాతం ఓట్లకు సమానం. దీంతో ఓటర్ల సంఖ్య సుమారు 7.66 కోట్ల నుంచి 7.04 కోట్లకు తగ్గింది. ఈ జాబితాలో మరో 60.06 లక్షల పేర్లను న్యాయపరమైన పరిశీలన కోసం ఉంచారు. త్వరలో న్యాయాధికారులు వీటిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే.. ఈ ప్రక్రియ రాజకీయ ప్రేరేపితమని, 1.2 కోట్లకు పైగా ఓటర్లను ప్రభావితం చేస్తుందని టీఎంసీ ఆరోపించింది. ఈ ఆరోపణలను ఈసీ తోసిపుచ్చింది.


ఇవీ చదవండి:

ట్రంప్‌నకు ఊరట.. యుద్ధ చర్యల నియంత్రణపై డెమోక్రాట్ల ప్రయత్నం విఫలం

కువైట్ సమీపంలో ఆయిల్ ట్యాంకర్‌లో భారీ పేలుడు.. చమురు లీక్‌పై ఆందోళన

Updated Date - Mar 07 , 2026 | 07:56 AM