Share News

ఢిల్లీ మద్యం స్కాం రౌజ్‌ ఎవెన్యూ కోర్టు వ్యాఖ్యలపై స్టే

ABN , Publish Date - Mar 10 , 2026 | 05:17 AM

ఢిల్లీ మద్యం కేసులో మొత్తం 23 మంది నిందితులను డిశ్చార్జి చేస్తూ సీబీఐ, దాని దర్యాప్తు అధికారిపై రౌజ్‌ అవెన్యూ కోర్టు చేసిన వ్యతిరేక వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. కింది కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా సీబీఐ దాఖలు చేసిన రివిజన్‌ పిటిషన్‌పై......

ఢిల్లీ మద్యం స్కాం రౌజ్‌ ఎవెన్యూ కోర్టు వ్యాఖ్యలపై స్టే

  • మనీలాండరింగ్‌ కేసు విచారణ వాయిదా వేయాలి

  • ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ స్వర్ణ ఆదేశాలు

  • సీబీఐ రివిజన్‌ పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని మొత్తం 23 మంది నిందితులకూ కోర్టు నోటీసులు

  • కేసు విచారణ వచ్చే వారానికి వాయిదా

  • న్యాయాధికారి తీర్పు అంతా తప్పుల తడకలే : సీబీఐ

న్యూఢిల్లీ, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కేసులో మొత్తం 23 మంది నిందితులను డిశ్చార్జి చేస్తూ సీబీఐ, దాని దర్యాప్తు అధికారిపై రౌజ్‌ అవెన్యూ కోర్టు చేసిన వ్యతిరేక వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. కింది కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా సీబీఐ దాఖలు చేసిన రివిజన్‌ పిటిషన్‌పై తాము నిర్ణయించే వరకూ ఈ అంశానికి సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసు విచారణను వాయిదా వేయాలని నిర్దేశించింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ స్వర్ణ కాంత శర్మ ప్రకటించారు. సీబీఐ రివిజన్‌ పిటిషన్‌కు సమాధానాలు పంపాల్సిందిగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితతోపాటు 23 మంది నిందితులకు ఆమె నోటీసులు జారీ చేశారు. కేసు విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు నుంచి కేజ్రీవాల్‌, మనీశ్‌ సిసోడియా, కవిత తదితరులను డిశ్చార్జి చేస్తూ ఫిబ్రవరి 27న రౌజ్‌ ఎవెన్యూ కోర్టు న్యాయాధికారి జితేందర్‌ సింగ్‌ 598 పేజీల తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీబీఐ దర్యాప్తుపైనా.. దర్యాప్తు అధికారిపైనా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దర్యాప్తు మొత్తం తప్పుల తడక, లోపాలమయమని, కనీసం ప్రాథమిక సాక్ష్యాధారాలనూ సీబీఐ చూపలేకపోయిందని కడిగి పారేసింది. ఇలాంటి కేసును అల్లినందుకు దర్యాప్తు అధికారిపై కేసు నమోదు చేయాలని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలోనే, తీర్పుపై సీబీఐ హైకోర్టులో రివిజన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ కేసు సోమవారం ఢిల్లీ హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా సీబీఐ తరఫున కోర్టుకు హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తన వాదనను వినిపించారు.


నిందితులందరినీ డిశ్చార్జి చేయడంపై ప్రస్తుతం స్టే కోరడం లేదని, కింది కోర్టు తీర్పు ప్రభావం ఈడీ విచారిస్తున్న మనీ లాండరింగ్‌ కేసుపై పడకుండా ఆదేశాలు జారీ చేయాలని న్యాయమూర్తిని కోరారు. ఈడీ కేసు సీబీఐ కేసుపై ఆధారపడి కొనసాగుతోందని గుర్తు చేశారు. ‘‘ఈ దేశ చరిత్రలోనే ఎక్సైజ్‌ విధాన కుంభకోణం అతి పెద్దది. దేశానికి సిగ్గుచేటులాంటిది. దర్యాప్తు చాలా శాస్త్రీయంగా సాగింది. కుట్రకు సంబంధించి ప్రతి అంశాన్ని నిర్ధారించారు. కుట్ర జరిగిందని సాక్షులు ప్రకటనలు చేశారు. అవి 164 సీఆర్‌పీసీ కింద చేసిన ప్రకటనలు. కుట్ర ఎలా జరిగింది? లంచం ఎలా చెల్లించారు!? ఎవరికి చెల్లించారు!? తదితర విషయాలను సాక్షులు వివరంగా వెల్లడించారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ కమ్యూనికేషన్‌ ఇన్‌చార్జి విజయ్‌ నాయర్‌ మొత్తం కుంభకోణాన్ని నిర్వహించారు. ప్రభుత్వం కట్టబెట్టిన ప్రయోజనాలకు బదులుగా రూ.100 కోట్ల ముడుపులు చెల్లించారు. అందులో రూ.44.50 కోట్లు హవాలా మార్గంలో గోవాకు పంపించారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ పార్టీకి ఎన్నికల నిధులు సమకూర్చేందుకు ఈ డబ్బు వెళ్లినట్లు శాస్త్రీయంగా జరిగిన దర్యాప్తు తేల్చింది’’ అని వివరించారు. ఎటువంటి విచారణ జరగకపోయినా కింది కోర్టు జారీ చేసిన డిశ్చార్జి ఆదేశాలు నిందితులను పూర్తిగా విముక్తులు చేసినట్లే ఉన్నాయని అభిప్రాయపడ్డారు. తన వృత్తి జీవితంలో ఇంత జాగ్రత్తగా, శాస్త్రీయంగా దర్యాప్తు చేసి.. సాక్ష్యాలు సేకరించిన దాఖలా చూడలేదని సీబీఐని ఆయన ప్రశంసించారు. కింది కోర్టు తీర్పు మొత్తం క్రిమినల్‌ లానే తిరగరాసినట్లు ఉందని తప్పుబట్టారు. ‘‘అప్రూవర్ల ప్రకటనలపై ఆధారపడి చార్జిషీటు దాఖలు చేసినప్పుడు ట్రయల్‌ దశలో అప్రూవర్లను క్రాస్‌ ఎగ్జామిన్‌ చేయవచ్చు. కానీ, ఇంతవరకూ అప్రూవర్లను కోర్టులో సాక్షుల బాక్స్‌లో ప్రవేశపెట్టనే లేదు. ఒత్తిళ్ల ద్వారానో, భయపెట్టో వారిని అప్రూవర్లుగా మార్చారని విచారించకుండా చెప్పలేం. ఫోరెన్సిక్‌ సాక్ష్యాలు, ఈ మెయిల్స్‌, వాట్సాప్‌ చాట్స్‌.. మొత్తం సేకరించారు. 164 మంది సాక్షులను పరిశీలించారు. ఎక్కడెక్కడ సమావేశాలు జరిగాయో, ఎలా లంచాలు చెల్లించారో తేల్చారు. అయినా.. సీబీఐ వాదనలు పూర్తయిన కేవలం 12 రోజుల్లో అతి వేగంగా స్పందించి 600 పేజీల తీర్పును కింది కోర్టు ఎలా ఇచ్చింది!?’’ అని ఆయన ప్రశ్నించారు.


వేగంగా న్యాయం అందడం మంచిదేనని, కానీ, అత్యంత కీలకమైన సాక్ష్యాలను తోసిపుచ్చడం న్యాయ సమ్మతం కాదని వ్యాఖ్యానించారు. ఈ కేసులో సాక్ష్యాలను పూర్తిగా ధ్వంసం చేశారని, 170 ఫోన్లను ధ్వంసం చేశారని చెప్పారు. ‘‘కొవిడ్‌ సమయంలో.. ప్రైవేటు విమానాలను అనుమతించని రోజుల్లో కూడా ముడుపులు ఇచ్చిన వారు ప్రత్యేక విమానాల్లో వచ్చారు. వాటిని ఎందుకు ఉపయోగిస్తారో అందరికీ తెలుసు. దినేశ్‌ అరోరా అనే వ్యక్తి చేసిన ప్రకటనను ముడుపులు చెల్లించిన వ్యక్తి పీఏ అయిన అశోక్‌ కౌశిక్‌ 164 సెక్షన్‌ కింద ఇచ్చిన ప్రకటన నిర్ధారించింది. ఈ సాక్ష్యాన్ని కూడా ట్రయల్‌ జడ్జి పక్కన పెట్టారు. నిందితుల ఫోన్ల నుంచి నేరుగా సేకరించిన అత్యంత కీలకమైన నోట్స్‌ను కూడా విస్మరించారు’’ అని తప్పుబట్టారు. రహస్యంగా జరిగే సమావేశాల్లో దర్యాప్తు ఏజెన్సీలు పాల్గొనడం సాధ్యం కాదని, అక్కడ ఏం జరిగిందో చెప్పేందుకు అప్రూవర్ల ప్రకటనలే కీలకమని స్పష్టం చేశారు.

తీర్పు అక్రమం..తప్పులమయం: సీబీఐ

ఢిల్లీ మద్యం స్కాంలో ఫిబ్రవరి 27న సీబీఐ న్యాయాధికారి ఇచ్చిన తీర్పు పూర్తిగా అక్రమమని, విపరీత వైఖరితో కూడుకుని ఉందని, అందులో తప్పుల తడకలు స్పష్టంగా కనిపిస్తున్నాయని సీబీఐ తన క్రిమినల్‌ రివిజన్‌ పిటిషన్‌లో వాదించింది. న్యాయాధికారి స్వయంగా చిన్నపాటి దర్యాప్తు నిర్వహించారని, కొన్ని ఎంపిక చేసిన వాక్యాలు చదివి నిర్ధారణకు వచ్చారని, నిందితుల నేరాన్ని నిరూపిస్తూ దాఖలు చేసిన డాక్యుమెంట్లను విస్మరించారని స్పష్టం చేసింది. దర్యాప్తు చేసిన సీబీఐ అధికారిపైనే శాఖాపరమైన చర్య చేపట్టాలని న్యాయాధికారి తన తీర్పులో పేర్కొనడం దిగ్ర్భాంతికరంగా ఉందని తెలిపింది. కేజ్రీవాల్‌, సిసోడియా పాత్రను విశ్లేషించడంలో ట్రయల్‌ కోర్టు తప్పు చేసిందని తప్పుబట్టింది. మొత్తం కుట్రను న్యాయాధికారి అర్థం చేసుకోలేదని, మొత్తం కేసును సమగ్రంగా అధ్యయనం చేయనందువల్లే అలాంటి ఆదేశాలు జారీ చేశారని పేర్కొంది. ఆ తీర్పును పక్కన పెట్టాలని కోరింది.

Updated Date - Mar 10 , 2026 | 05:55 AM