సీబీఐ, ఈడీ పేరు చెప్పి రూ.కోట్లు దోచేశారు.. డిజిటల్ అరెస్ట్ కేసులో దారుణ నిజాలు
ABN , Publish Date - Sep 30 , 2026 | 04:43 PM
‘మరో 30 నిమిషాల్లో నిన్ను అరెస్ట్ చేస్తారు. ఓ విషయం తెలుసా..? ఇది దేశద్రోహం కేసు. ఒక్కసారి లోపలికెళ్తే బెయిల్ కూడా రాదు’ అంటూ ఆమెను బెదిరించారు.
ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది. ఇటీవల డిజిటల్ అరెస్ట్‌ల పేరుతో మోసగాళ్లు కోట్ల రూపాయలు దోచేస్తున్నారు. ఢిల్లీకి చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు ఇలాంటి సైబర్ మోసానికే గురయ్యారు. ఆమె ఏకంగా రూ.2 కోట్లు విలువ చేసే ఇంటిని, తన బంగారాన్ని, నగదును పోగొట్టుకున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించిన వివరాలు పోలీసులను విస్తుపోయేలా చేశాయి.
క్యాన్సర్ చికిత్స పొందుతున్న ఆ వృద్ధురాలికి గత ఏప్రిల్‌లో ఓ కాల్ వచ్చింది. అది ఎత్తగానే కొందరు సైబర్ కేటుగాళ్లు తమని సీబీఐ, ఈడీ ఆఫీసర్లుగా పరిచయం చేసుకున్నారు. ఫోన్ చేసింది నకిలీ ఆఫీసర్స్ అని తెలియని ఆమె.. వారు చెప్పేది నమ్మడం మొదలుపెట్టారు. ‘మీ మొబైల్ నంబర్‌కు ఓ మనీలాండరింగ్ కేసుతో లింకుంది. అందుకే కాల్ చేశాం’ అని మోసగాళ్లు వృద్ధురాలికి చెప్పారు. ఆ తరువాత ఆమెను భయపెట్టడం ప్రారంభించారు.
ఈ బెదిరింపులు ఆన్‌లైన్‌కే పరిమితం కాలేదు. పోలీసుల దుస్తులతో వృద్ధురాలి ఇంటికి నకిలీ అధికారులు వెళ్లి వేధించేవారు. ‘మరో 30 నిమిషాల్లో నిన్ను అరెస్ట్ చేస్తారు. నీ పిల్లలను కూడా అదుపులోకి తీసుకుంటారు. ఇంకో విషయం తెలుసా..? ఇది దేశద్రోహం కేసు. ఒక్కసారి లోపలికెళితే బెయిల్ కూడా రాదు’ అంటూ ఆమెను బెదిరించేవారు. అయితే ఓ రోజు ఈ గ్రూప్‌లో ఒక సభ్యుడు వృద్ధురాలిపై జాలి పడుతున్నట్టు నటించాడు. ఆమెను పక్కకి తీసుకెళ్లి అధికారులు చెప్పినట్టు చేస్తే వదిలేస్తారని భరోసా ఇచ్చాడు.
మొదట మూడు కోట్ల రూపాయలు తమ ఖాతాకు బదిలీ చేయాలని నకిలీ అధికారులు అడిగారు. వారు చెప్పినట్టు ఆమె ఏప్రిల్ 7న ఆ నగదును బ్యాంకు ఖాతాకు పంపించారు. తరువాత ఇంట్లో బంగారం మొత్తం తాకట్టు పెట్టి లోన్ తీసుకురావాలని వారు సూచించారు. అలా బంగారం తాకట్టు పెట్టి.. దాదాపు 5 లక్షల రూపాయలను నేరగాళ్ల బ్యాంక్ ఖాతాకు వృద్ధురాలు బదిలీ చేశారు. ఇంత దోచుకున్నా ఆ నకిలీ అధికారులు ఆగలేదు. ఆమె ఇంటి పత్రాలను కూడా తీసుకున్నారు.
ఏప్రిల్ 27న నెదర్లాండ్స్‌లో నివసిస్తున్న వృద్ధురాలి కుమార్తె రాధికకు ఈ మోసం గురించి తెలిసింది. వెంటనే ఆమె భారత్‌కు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై ఢిల్లీ హైకోర్టు విచారణ జరుపుతోంది.
ఈ వార్తలూ చదవండి
డిజిటల్ అరెస్టుతో 10 కోట్లు దోపిడీ
అక్టోబర్ 2 నుంచి 'సేవ్ డెమోక్రసీ' మార్చ్.. సీఈసీపై ఇండియా కూటమి నిరసనలు..