డిజిటల్ అరెస్టుతో 10 కోట్లు దోపిడీ
ABN , Publish Date - Sep 30 , 2026 | 03:44 AM
విజయవాడకు చెందిన 80 ఏళ్ల ఓ రిటైర్డ్ ఇంజనీర్ నుంచి డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్లు రూ. 10 కోట్లు లాగేశారు. సకాలంలో పోలీసులను ఆశ్రయించడంతో రూ. 7 కోట్లు రికవరీ చేయగలిగారు.
విశ్రాంత ఇంజనీర్ నుంచి కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
విజయవాడలో వెలుగు చూసిన భారీ మోసం
విజయవాడ, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): విజయవాడకు చెందిన 80 ఏళ్ల ఓ రిటైర్డ్ ఇంజనీర్ నుంచి డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్లు రూ. 10 కోట్లు లాగేశారు. సకాలంలో పోలీసులను ఆశ్రయించడంతో రూ. 7 కోట్లు రికవరీ చేయగలిగారు. కృష్ణలంక ప్రాంతానికి చెందిన బాధితుడు విదేశాల్లో ఆటోమొబైల్ ఇంజనీర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. ఆయనకు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఈ నెల 20వ తేదీన సైబర్ నేరగాళ్లు ఆయనకు వాట్సప్‌లో వీడియో కాల్ చేశారు. తాము ముంబై క్రైం బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నామని, ఆయన పేరు మీద ముంబైలో ఉన్న బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు ఉగ్రవాద సంస్థలకు వెళ్లాయని, దీనిపై కేసు నమోదు చేశామని బెదిరించారు.
మాట్లాడిన వాళ్లంతా పోలీసు దుస్తుల్లో ఉండడంతో వారి చెప్పినది నిజమేమోనని బాధితుడు నమ్మారు. కేసు నుంచి విముక్తి కలగాలంటే తమకు రూ. 5 కోట్లు ఇవ్వాలని నేరగాళ్లు డిమాండ్ చేశారు. పీఎన్‌బీలో ఉన్న డిపాజిట్‌ను రద్దు చేసి ఆర్టీజీఎస్ ద్వారా రూ. 5.25 కోట్లను సైబర్ నేరగాళ్లు చెప్పిన ఖాతాకు బదిలీ చేశారు. తర్వాత మంగళవారం మళ్లీ ఫోన్ చేసి మరో రూ. 5 కోట్లు ఇవ్వాలని నేరగాళ్లు డిమాండ్ చేశారు. మళ్లీ ఆ మొత్తాన్ని వారి ఖాతాకు బాధితుడు పంపారు. కాసేపటికి మళ్లీ ఫోన్ చేసి మరింత డబ్బు కావాలని డిమాండ్ చేశారు. దీంతో ఆయన తన కుమారుడికి విషయం చెప్పారు. అతను వెంటనే సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు క్షణాల్లో సాంకేతికంగా విశ్లేషించి ఆ డబ్బులు జమ అయిన ఖాతాలను స్తంభింప జేయాలని బ్యాంక్ అధికారులకు సూచించారు. దీంతో రూ. 7 కోట్లను పోలీసులు, బ్యాంక్ సిబ్బంది కలిసి రికవరీ చేశారు.
ఈ వార్తలనూ చదవండి..
హై బీమ్ ఎల్‌ఈడీ లైట్లతో అగచాట్లు
వేర్వేరు ఘటనల్లో ఐదుగురి బలవన్మరణం