Share News

హై బీమ్‌ ఎల్‌ఈడీ లైట్లతో అగచాట్లు

ABN , Publish Date - Sep 30 , 2026 | 12:57 AM

నగరంలో చాలా వాహనాలు నిబంధనలకు విరుద్ధంగా హైబీమ్‌ ఎల్‌ఈడీ లైట్లతో రాకపోకలు సాగిస్తున్నాయి.

హై బీమ్‌ ఎల్‌ఈడీ లైట్లతో అగచాట్లు

ఇష్టారాజ్యంగా వాహనాలకు హెడ్‌లైట్ల మార్పిడి

కంపెనీ ఇచ్చే లైట్లకు అదనంగా అధిక కాంతినిచ్చేవి ఏర్పాటు

ప్రమాదాలకు గురవుతున్న ఎదుటి వాహనాలు

పట్టించుకోని పోలీస్‌, రవాణా శాఖ అధికారులు

(విశాఖపట్నం-ఆంద్రజ్యోతి)

నగరంలో చాలా వాహనాలు నిబంధనలకు విరుద్ధంగా హైబీమ్‌ ఎల్‌ఈడీ లైట్లతో రాకపోకలు సాగిస్తున్నాయి. వాహన యజమానులు కంపెనీ ఇచ్చిన హెడ్‌లైట్లకు అదనంగా ఎక్కువ కాంతినిచ్చే డార్జిలింగ్‌ హెడ్‌ లైట్స్‌ (హైబీమ్‌ ఎల్‌ఈడీ) అమర్చుతున్నారు. దీనివల్ల ఎదురుగా వచ్చే వాహనాల వారికి కళ్లు కనిపించక ప్రమాదాలకు గురవుతున్నారు. దీనిపై ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నా అధికారుల నుంచి ఆశించిన చర్యలు కనిపించడం లేదు.

ద్విచక్ర వాహనం, కారు, లారీ, బస్సు, ఆటో ...ఇలా ఏ వాహనానికైనా సంబంధిత కంపెనీ రోడ్డు భద్రత, మోటారు వాహనాల చట్టంలో పేర్కొన్న నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా విడి భాగాలను తయారుచేసి అమర్చుతాయి. కంపెనీ ఇచ్చిన పరికరాలతో వాహనాన్ని రోడ్లపై నడపడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ ఇటీవల కాలంలో కొందరు వాహనాలకు అదనపు హంగులను సమకూర్చడానికి ఆసక్తి చూపుతున్నారు. కంపెనీ అమర్చిన హెడ్‌లైట్‌లకు అదనంగా అదనపు కాంతిని ఇచ్చే లైట్‌లను వినియోగిస్తున్నారు. హైబీమ్‌ ఎల్‌ఈడీ హెడ్‌లైట్‌ ఆన్‌ చేస్తే రహదారితో పాటు ఎదురుగా వచ్చే వాహనంపై అధికకాంతి పడుతోంది. దీంతో ఎదురుగా వచ్చేవారికి కళ్లు కనిపించక గందరగోళానికి గురైపోతున్నారు. ఆ సమయంలో వాహనం వేగాన్ని నియంత్రించలేక ప్రమాదాలకు గురవుతున్నారు. నగరంలో ఆటోలు, కార్లతోపాటు ట్రావెల్స్‌ బస్సులు ఎక్కువగా ఈ తరహా ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయి. గతంలో వాహనాల హెడ్‌లైట్‌లకు సగం వరకు నలుపు రంగు స్టిక్కర్లను అతికించేవారు. దీనివల్ల వాహనం లైటింగ్‌ ఎదుటి వాహనంపై పడేదికాదు. తర్వాత వాహన చోదకుడు హెడ్‌లైట్‌ను హైబీమ్‌, లోబీమ్‌కు మార్చుకునే వెసులుబాటు వచ్చింది. వాహనానికి ఎదురుగా మరొక వాహనం వస్తున్నప్పుడు లైటింగ్‌ను లోబీమ్‌లోకి మార్చుకుంటారు. దీనివల్ల ఎదురుగా వచ్చే వాహన డ్రైవర్‌కు కంటిచూపునకు ఇబ్బంది కలగదు కాబట్టి, స్పష్టంగా దారిని చూసుకుని ముందుకు వెళతారు. అదే పెద్దగా ట్రాఫిక్‌ ఉండని శివారు ప్రాంతాల్లో అయితే హైబీమ్‌లో పెట్టుకుని దూరం నుంచే రోడ్డును స్పష్టంగా చూసుకుని వెళతారు. అయితే వాహన చోదకులకు హైబీమ్‌ వినియోగంపై పెద్దగా అవగాహన లేక ఎక్కువ కాంతి కోసం కొందరు, ఫ్యాషన్‌గా కొందరు హైబీమ్‌ లైట్లు వినియోగిస్తున్నారు.

పోలీస్‌, రవాణా శాఖల చర్యలు అంతంతమాత్రమే:

కంపెనీ ఇచ్చిన హెడ్‌లైట్‌లకు అదనంగా హైబీమ్‌ ఎల్‌ఈడీ లైట్‌లను అమర్చుకుంటూ తిరిగే వాహనాలపై కొరడా ఝులిపించాల్సిన పోలీస్‌, రవాణా శాఖ అధికారులు మొక్కుబడిగా కేసులు నమోదుచేసి చేతులు దులిపేసుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాహనాల హెడ్‌లైట్‌ల విషయంలో ఎలాంటి నిబంధనలు పాటించాలనే దానిపై ఆటోమోటివ్‌ ఇండస్ట్రీ స్టాండర్డ్స్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. ద్విచక్ర వాహనాలకు 65 ఓల్టులు, ఆటో, కారు వంటి వాహనాలకు 75 వోల్టుల బల్బులను మాత్రమే వాడాలి. భారీ వాహనాల కాంతి మూడు వేల ల్యుమెన్స్‌ మించకూడదు. వాహన కాంతి రోడ్డు నుంచి ఒకటిన్నర మీటర్లు కంటే ఎత్తుకు ప్రసరించకూడదు. లైటింగ్‌ రోడ్డుపై పడేలా ఉండాలే తప్ప, ఎదురుగా వచ్చే వాహనంపై పడకూడదు. అయితే పోలీస్‌, రవాణా శాఖ అధికారులు అప్పుడప్పుడు స్పెషల్‌డ్రైవ్‌ చేపట్టి హైబీమ్‌ లైట్‌లను తొలగించి నామమాత్రపు జరిమానా విధించి విడిచిపెట్టేస్తున్నారు. అలాకాకుండా వాహనాలకు భారీ జరిమానా విధించి, కేసులు నమోదుచేయడంతోపాటు హైబీమ్‌ హెడ్‌లైట్లను వాడడం వల్ల ఎదురయ్యే ఇబ్బందులు, ప్రమాదాలపై వాహనచోదకులకు అవగాహన కల్పించాలని నగరవాసులు కోరుతున్నారు.

Updated Date - Sep 30 , 2026 | 12:57 AM