ఢిల్లీలో సీజేపీ నిరసనలు.. 20కి పైగా కేసులు నమోదు
ABN , Publish Date - Oct 11 , 2026 | 01:11 PM
'సర్'లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సీజేపీ చేపట్టిన నిరసనల నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. నిరసనలకు సంబంధించి పోలీసులు 20కి పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిరసనలకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు 20కి పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడం, పోలీసులపై దాడులు సహా పలు ఆరోపణలపై ఈ కేసులు నమోదయ్యాయి. మరోవైపు.. సీఈసీ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం కూడా జంతర్‌మంతర్ వద్ద నిరసనలు చేపడతామని సీజేపీ ప్రకటించింది. దీంతో ఆదివారం కూడా ఢిల్లీ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు.
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ.. శనివారం ఆందోళనకు పిలుపునిచ్చింది సీజేపీ. అయితే.. ఈ నిరసనకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. నిరసనకారులు జంతర్‌మంతర్‌కు చేరేలోపే విస్తృత తనిఖీలు చేపట్టి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఆదివారంనాడూ ఇదే పరిస్థితులు నెలకొనే అవకాశముండటంతో.. 30 వేల మందికి పైగా పోలీసులు, పారామిలటరీ సిబ్బంది మోహరించాయి. కేంద్ర సాయుధ పోలీస్ బలగాలకు చెందిన 120కి పైగా కంపెనీలు భద్రతా విధుల్లో పాల్గొంటున్నాయి. న్యూఢిల్లీ జిల్లాను 20 జోన్లుగా విభజించి పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఉన్నతాధికారులు.
ట్రాఫిక్ ఆంక్షలు!
న్యూఢిల్లీ, సెంట్రల్ ఢిల్లీ ప్రాంతాల్లో ఆదివారం ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేసే అవకాశం ఉందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. పరిస్థితులను బట్టి ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యలో రైల్వే స్టేషన్లు, అంతర్రాష్ట్ర బస్ టెర్మినళ్లు, ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేవారు అప్రమత్తం కావాలని సూచించారు. ప్రజలు శాంతిని పాటిస్తూ పోలీసులకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
తమ డిమాండ్లు నెరవేరే వరకు ఎన్నికల పారదర్శకత కోసం పలు రాష్ట్రాల్లో తమ ప్రచారం కొనసాగుతుందని సీజేపీ పేర్కొంది. ఇదిలా ఉండగా.. పరిస్థితి తీవ్రమవుతున్న కొలదీ అనధికార సమావేశాలను నివారించడానికి, శాంతిభద్రతలను కాపాడటానికి ఢిల్లీ పోలీసులు ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు.
ఇవీ చదవండి:
డిగ్రీ లేకున్నా గూగుల్‌లో ఉద్యోగం.. ఏడాదికి రూ.10.6 కోట్ల వరకు జీతం.!
బీసీసీఐకి గంభీర్ హెచ్చరిక.. పిచ్‌లు మారకపోతే భారత క్రికెట్‌కు నష్టమే!