Ram Mohan: రామ్మోహన్ చొరవతో మయన్మార్ నుంచి సురక్షితంగా స్వదేశానికి తెలుగువారు..
ABN , Publish Date - Jan 11 , 2026 | 11:44 AM
మయన్మార్‌లో ఇరుక్కుపోయిన భారతీయులను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తిరిగి మనదేశానికి రప్పించారు. మయన్మార్‌లో చిక్కుకుపోయిన భారతీయులను రక్షించి, స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌కి రామ్మోహన్ లేఖ రాశారు..
ఢిల్లీ, జనవరి11(ఆంధ్రజ్యోతి): విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసపోయి, మయన్మార్ సరిహద్దుల్లో సైబర్ మాఫియా చేతిలో చిక్కుకున్న భారతీయుల కథ సుఖాంతమైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Kinjarapu Ram Mohan Naidu) తీసుకున్న వేగవంతమైన చర్యల వల్ల బాధితులు సురక్షితంగా ఢిల్లీ చేరుకున్నారు.
అసలేం జరిగిందంటే..
మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి కొంతమందిని ఏజెంట్లు విదేశాలకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి వారిని అక్రమంగా మయన్మార్ సరిహద్దుల్లోని సైబర్ క్రైమ్ కేంద్రాలకు తరలించారు. అక్కడ వారిని గదుల్లో బంధించి, శారీరకంగా హింసించడమే కాకుండా.. బలవంతంగా సైబర్ నేరాలకు పాల్పడేలా ఒత్తిడి తెచ్చారు. బాధితుల పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే రామ్మోహన్ నాయుడు రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు. రామ్మోహన్ విన్నపంతో తెలుగువాళ్లను భారత్‌కు తీసుకొచ్చింది విదేశాంగశాఖ.
రంగంలోకి కేంద్రమంత్రి..
బాధితుల గోడు విన్న వెంటనే రామ్మోహన్ నాయుడు.. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జయశంకర్‌కు (S. Jaishankar) లేఖ రాశారు. విదేశాంగ శాఖ ద్వారా మయన్మార్‌లోని యాంగాన్ భారత దౌత్య కార్యాలయాన్ని అప్రమత్తం చేశారు. బాధితుల విముక్తి కోసం స్థానిక అధికారులను సమన్వయం చేస్తూ, వారిని క్షేమంగా రప్పించే వరకు మంత్రి పర్యవేక్షించారు. కేంద్ర ప్రభుత్వం చేసిన నిరంతర ప్రయత్నాల ఫలితంగా భారతీయులు మాఫియా చెర నుంచి విడుదలయ్యారు.
స్వస్థలాలకు చేరిక..
ఢిల్లీ చేరుకున్న బాధితులకు కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ నుంచి వారిని వారి స్వస్థలాలకు పంపించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఏపీ అధికారులు పూర్తి చేశారు. ఈ సందర్భంగా బాధితులు, వారి కుటుంబ సభ్యులు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విదేశాల్లో ఉన్న భారతీయుల భద్రత, సంక్షేమం పట్ల మా ప్రభుత్వం అంకితభావంతో ఉందని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. ఎక్కడ మన తెలుగువారు ఇబ్బందుల్లో ఉన్నా ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు భరోసా కల్పించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నెల్లూరు ఓఆర్ఆర్‌పై మంత్రి నారాయణ క్లారిటీ..
స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకుని లక్ష్యాలు సాధించాలి: మంత్రి సత్యకుమార్
Read Latest AP News And Telugu News