పేపర్ లీక్‌లపై కఠిన చర్యలు.. 'యాంటీ పేపర్ లీక్ బిల్లు'లో మార్పులివే..
ABN , Publish Date - Jul 27 , 2026 | 03:34 PM
దేశవ్యాప్తంగా నీట్-యూజీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో కేంద్రం మరింత అప్రమత్తమైంది. పరీక్షల్లో పారదర్శకతను పెంచడం సహా భద్రతను కట్టుదిట్టం చేసే దిశగా కీలక ముందడుగు వేసింది.
ఇంటర్నెట్ డెస్క్: నీట్-యూజీ సహా పలు పోటీ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీలు, అక్రమాలపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమైన వేళ పరీక్షల భద్రతను మరింత పటిష్ఠం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగేసింది. ఇప్పటికే అమల్లో ఉన్న 2024 చట్టాన్ని మరింత కఠినతరం చేస్తూ యాంటీ పేపర్ లీక్(సవరణ) బిల్లును సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. దీనిని ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సభ ముందుంచారు. ఈ సవరణల ద్వారా నిందితులకు కఠిన శిక్ష విధించడం సహా వేగవంతమైన దర్యాప్తు, నిర్దిష్ట కాలవ్యవధిలో విచారణ పూర్తయ్యేలా నిబంధనలను రూపొందించారు. ఇకపై ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి, రోజువారీ విచారణలతో కేసులను 90 రోజుల్లో పూర్తిచేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.
2024 చట్టంతో పోలిస్తే కొత్త మార్పులివే..
ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ప్రకారం మూడు నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. కొత్త బిల్లులో దానిని గరిష్ఠంగా పదేళ్లకు పెంచారు. దీంతో పాటు ఇప్పటివరకు గరిష్ఠంగా రూ.10 లక్షలుగా ఉన్న జరిమానా.. నూతన చట్టంలో రూ.10 కోట్లకు పెరగనుంది.
ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై ఇప్పటివరకు కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టేవి. కానీ ఇకపై ఇలాంటి అక్రమాలపై స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్‌టీఎఫ్) ప్రత్యేక దర్యాప్తు చేపట్టనుంది.
ఇప్పటివరకు దర్యాప్తు పూర్తి చేసేందుకు నిర్దిష్ట గడువు ఉండేది కాదు. కొత్త బిల్లు ప్రకారం.. రెండు నెలల్లోనే విచారణ పూర్తిచేయడం తప్పనిసరి కానుంది.
పేపర్ లీక్ కేసుల విచారణ కోసం ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు కానున్నాయి. రోజువారీ విచారణలో భాగంగా కేసులను మరింత వేగంగా పరిష్కరించనున్నారు.
కొత్త బిల్లు ప్రకారం.. కేసు నమోదయ్యాక మూడు నెలల్లో తీర్పును వెలువరించాలి.
హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసుకునేందుకు 30 రోజుల గడువు నిర్ణయించారు. అప్పీల్‌పై కూడా 90 రోజుల్లోనే తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది.
పరీక్షల్లో పారదర్శకతను పెంచడం సహా ప్రశ్నపత్రాల లీకేజీలను పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల పలుమార్లు చెప్పారు. నయా టెక్నాలజీ ద్వారా పరీక్షల భద్రతను మరింత పటిష్ఠం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఈ మేరకు పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచడం సహా సాంకేతిక సంస్కరణలు, దీర్ఘకాలిక నిర్మాణాత్మక మార్పులపై సిఫార్సులు చేసేందుకు నందన్ నీలేకణి ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యులతో ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేసింది కేంద్రం. దీంతో పాటు కేంద్ర విద్యాశాఖలోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. నూతన విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి.. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, బాధ్యతాయుత వ్యవస్థను బలోపేతం చేస్తామని చెప్పారు.
కాగా.. పరీక్షల అక్రమాలపై కేంద్రం ఇప్పటికే పాలనాపరమైన చర్యలు ప్రారంభించింది. జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ)లో 47 మంది అధికారులను తొలగించినట్లు సమాచారం. అలాగే పరీక్షల నిర్వహణ విధానంలో మార్పులు, ఔట్‌సోర్సింగ్ వ్యవస్థలో సంస్కరణలు, సాంకేతిక భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇవీ చదవండి:
విద్యార్థులపై ఏకే-47తో కాల్పులు.. కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు
విద్యార్థులపై దాడులు.. ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాల్సిందే: ఎంపీ రాహుల్ గాంధీ