విద్యార్థులపై దాడులు.. ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాల్సిందే: ఎంపీ రాహుల్ గాంధీ
ABN , Publish Date - Jul 27 , 2026 | 12:40 PM
విద్యార్థులపై కాల్పులు, లాఠీఛార్జీలు, కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్న విద్యార్థులపై అణచివేత ధోరణి సరికాదని హితవుపలికారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెడుతూ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్న విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు అణచివేత ధోరణిని అవలంబిస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు. విద్యార్థులపై కాల్పులు, లాఠీఛార్జీలు, కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన ఆగ్రహించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెడుతూ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు.
బిహార్‌లో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ఏకే-47తో కాల్పులు జరిపారని, వందలాది మంది విద్యార్థులను అరెస్టు చేసి వారిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారనే వార్తలు వస్తున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. విద్యార్థులపై ఎలాంటి ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయబోమని, వారిని విడుదల చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. హామీకి విరుద్ధంగా వారిపై క్రూరమైన దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఢిల్లీలో విద్యార్థులపై పెల్లెట్ గన్‌లు ప్రయోగించారని, బిహార్‌లో ఏకే-47తో కాల్పులు జరిగాయని రాహుల్ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బిహార్, ఢిల్లీ.. రాష్ట్రం ఏదైనా విద్యార్థుల గొంతు నొక్కివేయాలనే ధోరణే కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం నిజాయతీ లేనిదని తాను గతంలోనే చెప్పానని, నిజమైన సంస్కరణలు తీసుకురావడం ఈ ప్రభుత్వానికి సాధ్యం కాదని రాహుల్ విమర్శించారు. ఇచ్చిన హామీల నుంచి వెనక్కి తగ్గడంతో పాటు, విద్యార్థుల గొంతు అణచివేసేందుకు అన్ని మార్గాలను ఉపయోగిస్తోందని చెప్పుకొచ్చారు. దేశంలోని విద్యార్థులందరికీ ప్రధాని మోదీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలన్నారు. విద్యార్థులపై కేసులు పెట్టడం కాకుండా, వారిపై దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కాగా, జులై 25న బిహార్ బంద్ సందర్భంగా సివాన్ జిల్లాలో పోలీసులు ఏకే-47తో కాల్పులు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓ పోలీసు అధికారిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
కార్గిల్ యుద్ధం.. 27 ఏళ్ల తర్వాత బయటపడిన రహస్యం..
ఆ పార్టీ బిల్లు చెల్లించిందెవరు?.. సుప్రీంకోర్టు న్యాయవాది ఫైర్..