ఆ పార్టీ బిల్లు చెల్లించిందెవరు?.. సుప్రీంకోర్టు న్యాయవాది ఫైర్..
ABN , Publish Date - Jul 27 , 2026 | 11:46 AM
కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలు, కార్యకర్తల సంబరాలు అంబరాన్ని అంటాయి. సీజేపీ అధికార ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోశ్ రాంకాతో పాటు కార్యకర్తలు ఓ హోటల్‌లో పార్టీ చేసుకున్నారు. దీనిపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ విమర్శలు గుప్పించారు.
ఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలు, కార్యకర్తల సంబరాలు అంబరాన్ని అంటాయి. సోషల్ మీడియా మొత్తం వారి వీడియోలతోనే నిండిపోయింది. కేంద్ర మంత్రి రాజీనామా అనంతరం సీజేపీ అధికార ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోశ్ రాంకాతో పాటు కార్యకర్తలు కూడా పెద్దఎత్తున పార్టీ చేసుకున్నారు. ఓ హోటల్‌లో వారంతా సంబరాలు చేసుకున్న వీడియోలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. బాలీవుడ్ పాటలకు సౌరవ్ దాస్, అశుతోశ్ రాంకా డ్యాన్సులు చేస్తున్న వీడియోలు వైరల్‌గా మారాయి.
సీజేపీ నేతల పార్టీపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ స్పందించారు. సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్టు పెట్టి పలు విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా సౌరవ్ దాస్, అశుతోశ్ రాంకా వేడుకల తీరును న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ విమర్శించారు. హోటల్‌లో పార్టీ చేసుకోవడానికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయని ఆయన ప్రశ్నించారు. 'నిజంగానా?.. సీజేపీ నాయకత్వం హోటల్‌లో విజయోత్సవం జరుపుకుంటోందా..!, ఢిల్లీలో రోజుల తరబడి హింసాకాండ జరిగిన తర్వాత ఈ యువ కార్యకర్తలమని చెప్పుకునే వారు డ్యాన్సులు చేస్తున్నారు' అని ఆయన మండిపడ్డారు.
అలాగే ఢిల్లీలో సీజేపీ చేపట్టిన ఆందోళనల వెనుక ఉన్న ఆర్థిక వనరులపైనా జెఠ్మలానీ ప్రశ్నలు లేవనెత్తారు. ఢిల్లీ ఆందోళనల సమయంలో సీజేపీ నేతలు, కార్యకర్తల ప్రయాణం, ఆహారం, వసతి, లాజిస్టిక్స్ వంటి వాటికి నిధులు ఎక్కడ నుంచి వచ్చాయని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీని అట్టుడికించిన వారికి ఆర్థిక సహాయం ఎవరు చేశారంటూ ప్రశ్నలు సంధించారు. కాగా, నీట్ పేపర్ లీక్ ఘటనకు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన కొద్దిసేపటికే ఈ పార్టీ జరిగినట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి
కుంగిన లఖ్‌నవూ-కాన్పూర్ ఎక్స్‌ప్రెస్‌వే.. ప్రారంభించిన 12 రోజులకే..
కార్గిల్ యుద్ధం.. 27 ఏళ్ల తర్వాత బయటపడిన రహస్యం..