Share News

కార్గిల్ యుద్ధం.. 27 ఏళ్ల తర్వాత బయటపడిన రహస్యం..

ABN , Publish Date - Jul 27 , 2026 | 10:56 AM

కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం సాధించిన విజయానికి సంబంధించిన మరో కీలక అధ్యాయం 27 ఏళ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది. 1999లో పాకిస్థాన్ చొరబాటుదారులను కార్గిల్‌లోని ఎత్తైన ప్రాంతాల నుంచి తరిమికొట్టేందుకు ఇజ్రాయెల్ సహకరించినట్లు తెలిసింది.

కార్గిల్ యుద్ధం.. 27 ఏళ్ల తర్వాత బయటపడిన రహస్యం..
Kargil War

న్యూఢిల్లీ: కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం సాధించిన విజయానికి సంబంధించిన మరో కీలక అధ్యాయం 27 ఏళ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది. 1999లో పాకిస్థాన్ చొరబాటుదారులను కార్గిల్‌లోని ఎత్తైన ప్రాంతాల నుంచి తరిమికొట్టేందుకు ఇజ్రాయెల్ సహకరించినట్లు తెలిసింది. యుద్ధ సమయంలో భారత వైమానిక దళానికి ఇజ్రాయెల్ అందించిన రహస్య సాంకేతిక సహకారంపై ఇద్దరు మాజీ ఇజ్రాయెల్ వైమానిక దళ అధికారులు తొలిసారిగా భారత టెలివిజన్‌లో వెల్లడించారు.


కార్గిల్ యుద్ధ సమయంలో జరిగిన పరిణామాలను ఇజ్రాయెల్ మాజీ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలట్, మిరాజ్ స్క్వాడ్రన్ కమాండర్ ష్లోమో, రాఫెల్ అడ్వాన్స్‌డ్ డిఫెన్స్ సిస్టమ్స్ మాజీ సివిలియన్ ప్రోగ్రామ్ మేనేజర్ అమీ వివరించారు. సాధారణ రక్షణ ఒప్పందంగా ప్రారంభమైన ప్రాజెక్టు.. యుద్ధం మొదలైన తర్వాత అత్యవసర మిషన్‌గా మారి భారత వైమానిక దళానికి కీలకంగా ఉపయోగపడిందని తెలిపారు. ఈ మేరకు ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక అంశాలను వారు వెల్లడించారు.


1996లోనే ఒప్పందం..

1996 నవంబర్‌లో భారతదేశం-రాఫెల్ మధ్య మిరాజ్-2000 యుద్ధ విమానాలకు లైటెనింగ్ టార్గెటింగ్ పోడ్ అమర్చేందుకు ఒప్పందం కుదిరింది. ఈ వ్యవస్థ ద్వారా పైలట్లు లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో గుర్తించి దాడులు నిర్వహించే అవకాశం లభించింది. ఈ మేరకు 1996 డిసెంబర్ నుంచి 1999 మార్చి వరకు భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO), హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) అధికారులతో కలిసి విస్తృత స్థాయిలో పరీక్షలు నిర్వహించినట్లు అమీ తెలిపారు.

అత్యవసర ఫోన్ కాల్‌తో..

1999లో కార్గిల్ యుద్ధం ప్రారంభమైన సమయంలో భారత రక్షణ అటాషేగా పనిచేసిన అప్పటి గ్రూప్ కెప్టెన్ ఎన్.ఎ.కె.బ్రౌన్ నుంచి ఇజ్రాయెల్‌కు అత్యవసర ఫోన్ కాల్ వెళ్లిందని అమీ వెల్లడించారు. యూదుల పవిత్ర విశ్రాంతి దినమైన షబాత్ ప్రారంభమైన శుక్రవారం రాత్రే ఆ కాల్ రావడంతో మరుసటి రోజే ఇంజినీర్లు, నిపుణులు అత్యవసరంగా పరికరాలు సిద్ధం చేసి భారత్‌కు బయలుదేరారని చెప్పారు. భారత్ చేరుకున్న తర్వాత పరిస్థితి ఊహించిన దానికంటే క్లిష్టంగా ఉందని ఎయిర్‌బేస్ కమాండింగ్ అధికారి చెప్పారని, అనంతరం అనేక రోజుల పాటు రాత్రింబవళ్లు పనిచేసి వ్యవస్థలను యుద్ధానికి సిద్ధం చేశామని వివరించారు.

మూడు దేశాల సాంకేతికతతో..

ఇజ్రాయెల్ తయారు చేసిన లైటెనింగ్ టార్గెటింగ్ పోడ్‌ను ఫ్రాన్స్‌కు చెందిన మిరాజ్-2000 యుద్ధ విమానంపై అమర్చి, అమెరికా తయారీ లేజర్ గైడెడ్ బాంబులతో సమర్థవంతంగా పనిచేసేలా చేయడం అతిపెద్ద సవాలుగా మారిందని ష్లోమో తెలిపారు. మూడు వేర్వేరు దేశాల సాంకేతిక వ్యవస్థలను ఒకే వేదికపై సమన్వయం చేసేందుకు ఎన్నోసార్లు భారత్‌కు వచ్చి సాంకేతిక సమస్యలను పరిష్కరించినట్లు చెప్పారు.

భారత అధికారుల పాత్ర ప్రశంసనీయం..

ఈ ప్రాజెక్టులో భారత వైమానిక దళ అధికారులైన స్క్వాడ్రన్ లీడర్ గర్షన్ అరోరా, అప్పటి యువ అధికారి రాజీవ్ కుమార్ దాస్ కీలక పాత్ర పోషించారని ష్లోమో, అమీ కొనియాడారు. అలాగే ఎయిర్ మార్షల్ రఘునాథ్ నంబియార్, ఎయిర్ మార్షల్ నర్మదేశ్వర్ తివారీ.. టైగర్ హిల్ ప్రాంతంలో నిర్వహించిన అత్యంత కచ్చితమైన వైమానిక దాడులు యుద్ధాన్ని కీలక మలుపు తిప్పాయని ష్లోమో పేర్కొన్నారు.

భారత్‌తో అనుబంధం కొనసాగుతోంది..

1996 నుంచి 2004 మధ్య వందసార్లకు పైగా భారత్‌కు వచ్చినట్లు అమీ తెలిపారు. ఈ సహకారం కేవలం వాణిజ్య సంబంధం మాత్రమే కాకుండా, భారత అధికారులతో సోదరభావాన్ని పెంపొందించిందని ఆయన అన్నారు. దీంతో భారత్‌పై తమకు ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడిందని చెప్పారు. తన కుమారుడు ప్రస్తుతం ఇజ్రాయెల్‌కు చెందిన రక్షణ సంస్థ ఎల్బిట్ సిస్టమ్స్‌లో పనిచేస్తున్నాడని.. ప్రతి నెలా భారత్‌కు వస్తూ ఇరు దేశాల రక్షణ సహకారాన్ని కొనసాగిస్తున్నాడని ష్లోమో వెల్లడించారు.

కార్గిల్ సందర్శనకు వస్తున్నాం..

కార్గిల్ యుద్ధం జరిగిన ప్రాంతాన్ని ఇప్పటివరకు ప్రత్యక్షంగా చూడలేదని, వచ్చే నెలలో తొలిసారిగా కార్గిల్ వార్ మెమోరియల్‌ను సందర్శించనున్నట్లు ష్లోమో తెలిపారు. వేల కిలోమీటర్ల దూరంలో రూపుదిద్దుకున్న ఒక సాంకేతిక మిషన్ కార్గిల్ యుద్ధ ఫలితాన్ని ప్రభావితం చేయడం తన జీవితంలో మరపురాని అనుభవమని ఆయన వ్యాఖ్యానించారు.


ఈ వార్తలు కూడా చదవండి

కుంగిన లఖ్‌నవూ-కాన్పూర్ ఎక్స్‌ప్రెస్‌వే.. ప్రారంభించిన 12 రోజులకే..

గంగా నదిపై చికెన్‌ తినడం నేరమా?

Updated Date - Jul 27 , 2026 | 11:28 AM