కుంగిన లఖ్‌నవూ-కాన్పూర్ ఎక్స్‌ప్రెస్‌వే.. ప్రారంభించిన 12 రోజులకే..
ABN , Publish Date - Jul 27 , 2026 | 08:30 AM
కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన లఖ్‌నవూ-కాన్పూర్ గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభించిన 12 రోజులకే కుంగిపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.
ఉత్తర్ ప్రదేశ్: కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన లఖ్‌నవూ-కాన్పూర్ గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభించిన 12 రోజులకే కుంగిపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఉన్నావ్ జిల్లాలోని కొరారీ సమీపంలో కాన్పూర్-లఖ్‌నవూ క్యారేజ్‌వేపై సుమారు 5 నుంచి 7 మీటర్ల మేర రహదారి కుంగిపోయింది. ఇటీవలే కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించారు. అయితే, కొన్ని రోజులకే రహదారి దెబ్బతినడంతో నిర్మాణ నాణ్యతపై ప్రజలు, ప్రతిపక్షాల నుంచి పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా రహదారి కింద ఉన్న మట్టి కొట్టుకుపోవడంతో రహదారి కుంగిపోయినట్లు అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. సమాజ్‌వాదీ పార్టీ నేత మధుసూదన్ యాదవ్ దెబ్బతిన్న రహదారి వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దీంతో ఈ విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. కొరారీ సమీపంలో తాను ప్రయాణిస్తున్న సమయంలో ఈ దృశ్యాలను చిత్రీకరించినట్లు మధుసూదన్ యాదవ్ తెలిపారు. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణ నాణ్యతపై గొప్పలు చెప్పిందని, కానీ కొద్ది రోజుల్లోనే రహదారి కుంగిపోవడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. నిర్మాణ సంస్థలు, సంబంధిత అధికారుల పనితీరుపైనా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. మరోవైపు, అధికారులు మరమ్మతులు చేపట్టి రహదారిని తాత్కాలికంగా పునరుద్ధరించారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభానికి ముందు కూడా ఒకసారి దెబ్బతినడం అప్పట్లో వివాదాస్పదమైంది.
కాగా, 63 కిలోమీటర్ల పొడవుతో ఆరు లేన్లుగా నిర్మించిన లఖ్‌నవూ-కాన్పూర్ ఎక్స్‌ప్రెస్‌వే దేశంలో రెండో అతిపెద్ద ఎలివేటెడ్ కారిడార్ ఉంది. ఆటోమేటెడ్, ఇంటెలిజెంట్ మెషిన్-గైడెడ్ నిర్మాణ సాంకేతికతతో నిర్మించిన దేశంలోని తొలి ఎక్స్‌ప్రెస్‌వేగా ఈ రహదారిని పేర్కొంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
పంజాబ్ విద్యామంత్రి కూడా రాజీనామా చేయాలి
గంగా నదిపై చికెన్ తినడం నేరమా?