Share News

గంగా నదిపై చికెన్‌ తినడం నేరమా?

ABN , Publish Date - Jul 27 , 2026 | 06:44 AM

పవిత్ర గంగానదిపై చికెన్‌ తిన్న అంశంలో సుప్రీంకోర్టు జస్టిస్‌ ఉజ్వల్‌ భుయాన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, గాజా ఊచకోతలపై నిరసనల హక్కును హరించడాన్ని కూడా తప్పుబట్టారు...

గంగా నదిపై చికెన్‌ తినడం నేరమా?

  • అలా అని ఏ చట్టమూ చెప్పడం లేదే

  • సుప్రీంకోర్టు జస్టిస్‌ ఉజ్వల్‌ భుయాన్‌ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, జూలై 26: పవిత్ర గంగానదిపై చికెన్‌ తిన్న అంశంలో సుప్రీంకోర్టు జస్టిస్‌ ఉజ్వల్‌ భుయాన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, గాజా ఊచకోతలపై నిరసనల హక్కును హరించడాన్ని కూడా తప్పుబట్టారు. ‘‘గంగా నదిపై చికెన్‌ తినడం నేరం ఎలా అవుతుంది. దాన్ని ఏ చట్టమూ నిషేధించ లేదు. అయినప్పటికీ వారిని అరెస్ట్‌ చేసి, మూడు నెలల పాటు బెయిల్‌ నిరాకరించొచ్చా?అని నన్ను నేనే ప్రశ్నించుకుంటున్నా’’అని జస్టిస్‌ భుయాన్‌ పేర్కొన్నారు. వారణాసిలో గంగానదిపై బోటును నడిపించే సిబ్బంది, రంజాన్‌ ఉపవాసం ముగిసిన తర్వాత అందులోనే చికెన్‌ తిన్న ఘటనలో, యూపీ పోలీసులు 14 మందిని అరెస్ట్‌ చేశారు. శనివారం భోపాల్‌లోని నేషనల్‌ లా ఇనిస్టిట్యూట్‌ యూనివర్సిటీ (ఎన్‌ఎల్‌ఐయూ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా జస్టిస్‌ ఉజ్వల్‌ భుయాన్‌ దీనిపై స్పందించారు. ప్రాథమిక హక్కులను వినియోగించుకున్నా, నేరపూరిత చర్యలతో పౌరులను వేధిస్తున్న క్రమాన్ని ఈ ఘటన(చికెన్‌ తిన్న) తెలియజేస్తోందన్నారు. మానవ హక్కుల ఉల్లంఘనలపై నిరసనలు వ్యక్తం చేసే పౌరుల హక్కులనూ హరిస్తుండడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘గాజా ప్రజలకు సంఘీభావంగా ముంబైలోని శివాజీపార్క్‌లో ఓ వర్గం ప్రజలు నిరసనలు వ్యక్తం చేసేందుకు ప్రభుత్వం అనుమతివ్వలేదు. దీంతో వారు బాంబే హైకోర్టును ఆశ్రయించారు’’ అని గుర్తు చేశారు.

Updated Date - Jul 27 , 2026 | 06:44 AM