Share News

అనిరుధ్‌-కావ్య మారన్‌ వివాహం.. గ్రీస్‌కు రజనీకాంత్‌, స్టాలిన్‌!

ABN , Publish Date - Nov 09 , 2026 | 12:11 PM

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సహ యజమాని కావ్య మారన్‌ వివాహం గ్రీస్‌లో జరగనుంది. ఈ వేడుకకు సినీ నటుడు రజనీకాంత్‌, తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్‌ సహా ప్రముఖులు బయల్దేరి వెళ్లినట్టు తెలుస్తోంది.

అనిరుధ్‌-కావ్య మారన్‌ వివాహం.. గ్రీస్‌కు రజనీకాంత్‌, స్టాలిన్‌!
Rajinikanth, MK Stalin Head To Greece to Anirudh-Kavya Maran Wedding

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సహ యజమాని కావ్య మారన్‌ పెళ్లికి రంగం సిద్ధమైంది. ఈ నెల 10, 11న గ్రీస్‌లో వీరిరువురూ వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు తరలివెళ్తుండటంతో సందడి నెలకొంది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి గ్రీస్‌ బయలుదేరినట్లు ఎయిర్‌పోర్ట్‌లో తీసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్‌ కూడా పెళ్లికి హాజరయ్యేందుకు బయల్దేరినట్లు తెలుస్తోంది.


చెన్నైలో రిసెప్షన్‌

గ్రీస్‌(యూరప్)లో సన్నిహితుల సమక్షంలో వివాహ వేడుకలు నిర్వహించుకోనున్న ఈ జంట.. నవంబర్ 21న చెన్నైలో ఘనంగా రిసెప్షన్‌ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కూడా ఆహ్వానించారు. కావ్య మారన్‌ తల్లిదండ్రులు కళానిధి మారన్‌, కావేరి మారన్‌ స్వయంగా సీఎంను కలిసి ఆహ్వాన పత్రిక అందించిన విషయం తెలిసిందే. వీరితో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ సహా పలువురు ప్రముఖ సినీ ప్రముఖులను ఆహ్వానించినట్లు సమాచారం.


సన్‌ గ్రూప్‌ అధినేత కళానిధి మారన్‌ కుమార్తె అయిన కావ్య మారన్.. సన్‌ టీవీ నెట్‌వర్క్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా, ఐపీఎల్లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సీఈఓగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు అనిరుధ్‌ తన సంగీతంతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందారు.


ఇవీ చదవండి:

ఎవరీ ఆలిస్ హువాంగ్? ఎన్విడియా సీఈఓతో సంబంధాలేంటి.?

ఇరాన్‌పై మళ్లీ యుద్ధం.. అత్యంత అసంభవం: ట్రంప్

Updated Date - Nov 09 , 2026 | 12:28 PM