IRCTC రైలు టికెట్ బుకింగ్‌లో ఈ చిన్న బీమా బాక్స్‌ను మిస్ కాకండి.. రూ.10 లక్షల వరకు కవరేజ్
ABN , Publish Date - Oct 03 , 2026 | 05:38 PM
రైలు టికెట్ బుక్ చేసేటప్పుడు చివర్లో ఓ చిన్న చెక్‌బాక్స్ కనిపిస్తుంది. 'రూపాయి కంటే తక్కువ చెల్లించి ప్రయాణ బీమా పొందండి' అని. దీనివల్ల రూ.10 లక్షల వరకు కవరేజ్ లభిస్తుందని మీకు తెలుసా?
IRCTC Train Insurance: మనం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా యాప్‌లో రైలు టికెట్ బుక్ చేసేటప్పుడు, ప్యాసింజర్ వివరాలు నమోదు చేసిన తర్వాత చివర్లో ఓ చిన్న చెక్‌బాక్స్ కనిపిస్తుంది. 'రూపాయి కంటే తక్కువ చెల్లించి ప్రయాణ బీమా పొందండి' అనే ఆప్షన్‌ను చాలామంది పెద్దగా పట్టించుకోకుండా వదిలేస్తుంటారు. లేదా రూపాయి కంటే తక్కువే కదా అని టిక్ కొట్టేస్తుంటారు.
దసరా, దీపావళి, ఛత్ పూజ వంటి పండుగల రద్దీ సమయంలో కన్ఫర్మ్ టికెట్ దొరికితే చాలు అనుకునే ప్రయాణికులు ఈ రూపాయి బీమా గురించి అసలు ఆలోచించరు. కానీ, రూపాయి కంటే తక్కువకే రూ. 10 లక్షల వరకు కవరేజ్ లభిస్తుందని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే! అసలు ఈ చిన్న బీమా ఏం కవర్ చేస్తుంది? అనారోగ్యానికి గురైతే డబ్బులు వస్తాయా? అనే విషయాలను స్పష్టంగా తెలుసుకుందాం.
రూపాయి బీమాతో లభించే ప్రయోజనాలు ఏమిటి?
ఈ ఆప్షనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ద్వారా పొందే ప్రయోజనాలు చాలా స్పష్టంగా ఉంటాయి. ప్రమాదవశాత్తూ మరణం లేదా శాశ్వత వైకల్యం రూ.10 లక్షల వరకు కవరేజ్. పాక్షిక శాశ్వత వైకల్యానికి వైకల్యం శాతం ఆధారంగా రూ. 7.5 లక్షల వరకు కవరేజ్ ఉంటుంది. ఆసుపత్రి ఖర్చులు.. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చేరితే రూ. 2 లక్షల వరకు రక్షణ ఉంటుంది. ప్రమాదంలో మరణిస్తే రూ.10,000 మృతదేహ రవాణా ఖర్చుల కింద ఇస్తారు.
ఇంత తక్కువ ధరకు రూ. 10 లక్షల కవరేజ్ ఎలా సాధ్యం?
ఇది సాధారణ హెల్త్ ఇన్సూరెన్స్ లేదా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కాదు. దీనిని 'గ్రూప్ ఆక్సిడెంట్ కవర్' అంటారు. ఈ ఇన్సూరెన్స్ ప్రయాణం మొదలైనప్పటి నుంచి ముగిసే వరకు (లేదా స్టేషన్ ప్రాంగణం దాటే వరకు) మాత్రమే వర్తిస్తుంది. ప్రతిరోజు లక్షలాది మంది ఈ బీమాను తీసుకుంటారు. అందులో చాలా తక్కువ మంది మాత్రమే ప్రమాదాల బారిన పడతారు. కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీలు రిస్క్‌ను తక్కువ ప్రీమియంతో పంచుకోగలుగుతాయి.
ఏ సందర్భాల్లో ఈ బీమా వర్తిస్తుంది?
ట్రైన్ ఎక్కేటప్పుడు/దిగేటప్పుడు: రైలు ప్రమాదాలు, బోగీలు పట్టాలు తప్పడం వంటి పెద్ద ప్రమాదాలే కాకుండా.. రైలు ఎక్కుతున్నప్పుడు లేదా దిగుతున్నప్పుడు ప్రమాదవశాత్తూ కిందపడి గాయపడినా ఈ బీమా వర్తిస్తుంది.
రైలు ప్రమాదాలు: ప్రయాణంలో జరిగే అధికారిక రైల్వే ప్రమాదాలన్నింటికీ ఇది కవరేజ్ ఇస్తుంది.
ఏ సందర్భాల్లో బీమా వర్తించదు? .. చాలామంది ప్రయాణికులు పొరబడే అంశాలు ఇవే:
సాధారణ అనారోగ్యం: ప్రయాణంలో జ్వరం రావడం, గుండెపోటు లేదా ఇతర అనారోగ్య సమస్యలకు ఈ బీమా నుంచి ఆసుపత్రి ఖర్చులు రావు. ఇది కేవలం 'ప్రమాదాల'కు మాత్రమే వర్తిస్తుంది.
ట్రైన్ మిస్ అవ్వడం: ప్రయాణికుడు రైలు మిస్ అయితే ఈ ఇన్సూరెన్స్ ఎలాంటి పరిహారం చెల్లించదు.
నిబంధనల ఉల్లంఘన: ఫుట్‌ఓవర్ బ్రిడ్జి ఉపయోగించకుండా రైల్వే ట్రాక్‌లు దాటే సమయంలో ప్రమాదం జరిగితే రూపాయి కూడా రాదు.
ఆత్మహత్యలు / స్వయంగా చేసుకున్న గాయాలు: వీటిని పాలసీ పూర్తిగా మినహాయిస్తుంది.
క్లెయిమ్ చేయడం ఎలా?
ఒకవేళ ప్రమాదం జరిగితే, నేరుగా IRCTC పరిహారం ఇవ్వదు. ఆ టికెట్‌కు సంబంధించిన ఇన్సూరెన్స్ కంపెనీని సంప్రదించాలి. క్లెయిమ్ ఫారమ్, రైల్వే అథారిటీ ప్రమాద నివేదిక, ఆసుపత్రి డిశ్చార్జ్ సమ్మరీ, ఒరిజినల్ బిల్లులు, KYC పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
నామినీ వివరాలు: టికెట్ బుక్ చేసిన తర్వాత ప్రయాణికుడికి నామినీ వివరాలు నమోదు చేయమని ఒక మెసేజ్ లేదా లింక్ వస్తుంది. ఆ వివరాలను తప్పకుండా పూర్తి చేయడం మంచిది. మరణం సంభవించినప్పుడు నామినీకి పరిహారం అందడం సులువవుతుంది.
ఇప్పటికే ఇతర బీమాలు ఉంటే ఇది అవసరమా?
మీకు ఇప్పటికే వ్యక్తిగత ప్రమాద బీమా లేదా హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ, ఈ రైల్వే బీమాను తీసుకోవడం మంచిదేనని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దీని ధర పైసల్లోనే ఉంటుంది కాబట్టి, కుటుంబానికి ఒక అదనపు భద్రతలా పనిచేస్తుంది.
రైలు టికెట్ బుక్ చేసేటప్పుడు ఆ చిన్న ఇన్సూరెన్స్ బాక్స్‌ను నిర్లక్ష్యం చేయకండి. రూపాయి కంటే తక్కువ ధరకు లభించే ఈ బీమా, సాధారణ హెల్త్ ఇన్సూరెన్స్ కాకపోయినప్పటికీ.. ప్రయాణంలో ఊహించని ప్రమాదం జరిగితే కుటుంబానికి పెద్ద ఆర్థిక కొండంత అండగా నిలుస్తుంది.
ఇవి కూడా చదవండి..
శ్రీసిటీలో ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
శ్రీసిటీ బాయిలర్ పేలుడు.. సేఫ్టీ ఆడిట్‌కు పవన్ కల్యాణ్ ఆదేశాలు
Read Latest AP News And Telugu News