Share News

శ్రీసిటీ బాయిలర్ పేలుడు.. సేఫ్టీ ఆడిట్‌కు పవన్ కల్యాణ్ ఆదేశాలు

ABN , Publish Date - Oct 03 , 2026 | 12:37 PM

తిరుపతి జిల్లా శ్రీసిటీలో జరిగిన ప్రమాద ఘటనపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని దిశానిర్దేశం చేశారు.

శ్రీసిటీ బాయిలర్ పేలుడు.. సేఫ్టీ ఆడిట్‌కు పవన్ కల్యాణ్ ఆదేశాలు
Deputy CM Pawan Kalyan

అమరావతి, అక్టోబర్ 3: తిరుపతి జిల్లా శ్రీసిటీలో జరిగిన ప్రమాద ఘటనపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని దిశానిర్దేశం చేశారు. పరిశ్రమలో బాయిలర్ పేలి నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై పవన్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఔషధాలు తయారు చేసే ఈ పరిశ్రమలో బాయిలర్ పేలడంతో విధుల్లో ఉన్న నలుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు గాయపడినట్లు డిప్యూటీ సీఎంకు అధికారులు వివరించారు.


గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన పరిశ్రమలో ప్రస్తుత పరిస్థితిపై డిప్యూటీ సీఎం ఆరా తీశారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే శ్రీ సిటీ పరిధిలోని అన్ని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల అమలుపై సమీక్ష నిర్వహించి, ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ ఘటనపై తక్షణమే సమగ్ర సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు.


ఇవి కూడా చదవండి..

విజయవాడలో పాన్‌ ఐఐటీ ఏపీ సమ్మిట్‌ 2026 ప్రారంభం.. కీలక రంగాలపై చర్చలు

శ్రీసిటీలో ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 03 , 2026 | 12:41 PM