Share News

వికారాబాద్‌లో ప్రమాదం.. బస్సు బోల్తా పడి నలుగురి మృతి

ABN , Publish Date - Oct 03 , 2026 | 12:10 PM

వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి ఘాట్‌ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. ఈరోజు(శనివారం) ఉదయం ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

వికారాబాద్‌లో ప్రమాదం.. బస్సు బోల్తా పడి నలుగురి మృతి
Ananthagiri Bus Accident

వికారాబాద్, అక్టోబర్ 3: జిల్లాలోని అనంతగిరి ఘాట్‌ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. ఈరోజు(శనివారం) ఉదయం ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు హుటాహుటిన అక్కడకు చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. అయితే తీవ్రంగా గాయపడిన ప్రయాణికుల్లో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.


వీరంతా శంకర్‌పల్లి కేసారం నుంచి ధారూర్ మండలం చింతకుంటకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. నారాయణ రెడ్డి అనే వ్యక్తి అంత్యక్రియలకు వెళ్తుండగా విషాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 52 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను వెంటనే వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు ప్రమీల (52), యాదమ్మ (52), మాల పద్మ(50), పద్మమ్మ(55) లుగా గుర్తించారు. జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద కారణాలను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని వైద్యులకు ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాలు జారీ చేశారు.


ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

revanth-future.jpg

అనంతగిరి ఘాట్‌ రోడ్డులో ప్రైవేటు బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు ప్రగాఢ సానుభూతిని తెలియ‌జేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.


ఇవి కూడా చదవండి..

‘మీ ధైర్యసాహసాలకు వందనాలు’.. కెప్టెన్ స్మిత్ మచ్చార్‌‌పై చిరంజీవి ప్రశంసలు

అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టురట్టు.. 3.3 కిలోల గంజాయి స్వాధీనం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 03 , 2026 | 12:47 PM