నోబెల్ దక్కలేదని ట్రంప్ అసహనం.. విజేత పిళ్లైపై విమర్శలు.!
ABN , Publish Date - Oct 09 , 2026 | 08:30 PM
2026 నోబెల్ శాంతి బహుమతి విజేత నవి పిళ్లైపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పించారు. తనకు ఆ పురస్కారం దక్కకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఈ ఏడాదీ తనకు నోబెల్ శాంతి బహుమతి దక్కకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన నోబెల్ విజేత నవి పిళ్లైపై విమర్శలు గుప్పించారు. పిళ్లైకి పురస్కారం దక్కడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. 'ఆమె అమెరికా, ఇజ్రాయెల్ వ్యతిరేకి' అంటూ విమర్శించిన ఓ పోస్ట్‌ను తన ట్రూత్ సోషల్ వేదికగా రీపోస్ట్ చేశారు ట్రంప్. నోబెల్ కమిటీ తన ప్రతిష్ఠను దెబ్బతీసిందని, ఈ పురస్కారానికి పిళ్లై అర్హురాలు కాదని అందులో పేర్కొన్నారు.
అయితే.. తనకు లభించిన పురస్కారాన్ని ట్రంప్‌తో పంచుకుంటానంటూ చమత్కరించారు పిళ్లై. 'ఇంకాస్త గట్టిగా చప్పట్లు కొడితే ఈ బహుమతిని ట్రంప్‌తో పంచుకోవచ్చు' అని తనకు అభినందనలు తెలుపుతూ ప్రశంసిస్తున్న వారితో ఆమె వ్యాఖ్యానించారు.
దక్షిణాఫ్రికాకు చెందిన భారత సంతతి వ్యక్తి అయిన నవి పిళ్లైకి 2026 నోబెల్ శాంతి బహుమతి లభించింది. అంతర్జాతీయ చట్టాల పరిరక్షణ, శాంతి స్థాపనకు గానూ ఆమె చేసిన కృషికి ఈ పురస్కారం వరించింది. యుద్ధ నేరాలు, మానవత్వ వ్యతిరేక నేరాలు, మారణహోమాలకు పాల్పడినవారిని న్యాయస్థానం ఎదుట నిలబెట్టడంలో ఆమె కీలక పాత్ర పోషించినందుకు గానూ ఈ గౌరవం దక్కిందని నోబెల్ కమిటీ పేర్కొంది. కాగా.. గతంలో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్‌గా పనిచేసిన పిళ్లై.. వర్ణవివక్షకు వ్యతిరేకంగా పోరాడిన నెల్సన్ మండేలా సహా పలువురికి న్యాయపరమైన సాయం అందించారు.
ఇవీ చదవండి:
‘ఢిల్లీని స్తంభింపజేయడం సమంజసమేనా?’.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
కేరళ మాజీ సీఎం విజయన్‌కు షాక్.. ఎఫ్‌ఐఆర్ నమోదుకు హైకోర్టు ఆదేశం