ఏఐ విషయంలో చైనాతో కలిసి పనిచేయం... తేల్చి చెప్పిన ట్రంప్
ABN , Publish Date - Sep 30 , 2026 | 03:07 PM
‘ప్రస్తుతం సాంకేతికతలో చైనా కంటే అమెరికా ముందుంది. ఈ ఆధిపత్యాన్ని నేను ఇంకా కొనసాగించాలని అనుకుంటున్నాను’ అని ట్రంప్ పేర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) భవిష్యత్తు ప్రమాదాలపై అధ్యయనం చేయడానికి అమెరికా, చైనాలు కలిసి పనిచేయాలనే ఆలోచనను డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. తమ సాంకేతిక నైపుణ్యాలను మరో దేశంతో పంచుకుంటే టెక్ రంగంలో అమెరికా ఆధిపత్యాన్ని కోల్పోతుందని ఆయన చెప్పారు. ఏఐపై వైట్‌హౌస్‌లో మంగళవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాలతో చేతులు కలపకుండానే ఏఐపై అమెరికా పరిశోధనలు చేస్తుందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
‘ప్రస్తుతం ఏఐ విషయంలో చైనా సహా అన్ని దేశాల కంటే ముందున్నాం. ఈ ఆధిపత్యాన్ని నేను ఇంకా కొనసాగించాలని అనుకుంటున్నాను. అందుకే మన సాంకేతికను, ఏఐ రహస్యాలను మరో దేశంతో పంచుకోవడం నాకు కొంచెం కూడా ఇష్టం లేదు’ అని ట్రంప్ పేర్కొన్నారు. కొన్ని రోజులుగా ఏఐ ప్రమాదాలు నివారించేందుకు అమెరికా-చైనా కలిసి పని చేస్తాయని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వాటిని ట్రంప్ తిరస్కరించారు.
ఆరు టెక్ దిగ్గజాలతో కృత్రిమ మేధ భద్రతా ఒప్పందం
మరోవైపు అమెరికాతో ఆరు టెక్ దిగ్గజాలు కుదుర్చుకున్న కృత్రిమ మేధ భద్రతా ఒప్పందాన్ని ట్రంప్ విడుదల చేశారు. ఏఐ కట్టు తప్పుతున్న నేపథ్యంలో గూగుల్, ఎన్విడియా, ఆంథ్రోపిక్, ఓపెన్ఏఐ, స్పేస్ఎక్స్ఏఐ, మెటా సంస్థలు స్వచ్ఛందంగా ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీనికి సంబంధించిన డాక్యుంమెట్‌ను ట్రంప్ ‘ట్రూత్ సోషల్’లో పోస్ట్ చేశారు.
ఈ వార్తలూ చదవండి
సూపర్ ఇంటెలిజెన్స్.. ఏఐకి కొత్త పేరును ప్రకటించిన ట్రంప్