నడక, శ్వాస.. కలగలిసి...
ABN , Publish Date - Aug 23 , 2026 | 09:36 AM
నడక, శ్వాస.. కలగలిసి...సోషల్ మీడియాలో ఈమధ్య ‘తాయ్ చి వాకింగ్’ రీల్సూ, వీడియోలూ బాగా ట్రెండ్ అవుతున్నాయి.
నడక, శ్వాస.. కలగలిసి...సోషల్ మీడియాలో ఈమధ్య ‘తాయ్ చి వాకింగ్’ రీల్సూ, వీడియోలూ బాగా ట్రెండ్ అవుతున్నాయి. సులభమైన, తక్కువ శ్రమతో కూడిన ఈ వ్యాయామం శరీరానికీ, మనసుకూ మేలు చేస్తుందంటున్నారు.
‘తాయ్ చి’ అనేది చైనీస్ యుద్ధ కళ. దీని సూత్రాల ఆధారంగా చేసే మైండ్‌ఫుల్ నడక ‘తాయ్ చి వాకింగ్’. చాలా నెమ్మదిగా, ప్రతీ అడుగునూ గమనిస్తూ నడవడం దీని ప్రత్యేకత. ఇందులో శ్వాస, సమతుల్యత, శరీరంపై పూర్తి స్పృహ ముఖ్యం. ఎక్కడైనా, ఎవరైనా వయసుతో సంబంధం లేకుండా దీనిని సాధన చేయొచ్చు. సరళంగా ఉంటూనే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తోందని, ఒత్తిడితో బాధపడేవారు దీనికి ఆకర్షితులవుతున్నారు. సాధన చేస్తున్నారు.
ఒత్తిడికి గురైనప్పుడు కాసేపు వాకింగ్ చేయాలని పెద్దలు సూచిస్తుంటారు. ఇంటి చుట్టూ చిన్న నడక కావొచ్చు, దగ్గర్లోని పార్కుకు వెళ్లి ప్రశాంతంగా వాకింగ్ చేయడం కావొచ్చు. మొత్తమ్మీద నడక వల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయని తాయ్ చి ట్రెండ్ చాటుతోంది. ‘‘రోజంతా స్ర్కీన్ ముందే ఉండటం వల్ల విపరీతమైన మెడ, నడుము నొప్పులుండేవి. దీంతో తాయ్ చి నడక ట్రై చేశా. రోజూ సాయంత్రం 15-20 నిమిషాలు శ్వాసపై దృష్టిపెడుతూ చేసే ఈ నడక నా మైండ్‌ను రిఫ్రెష్ చేస్తోంది. రాత్రివేళల్లో నిద్ర కూడా బాగా పడుతోంది’’ అంటూ ఐటీ ఉద్యోగులు తమ అనుభవాలను సోషల్‌మీడియాలో పంచుకుంటున్నారు.
ఇదీ నడిచే విధానం...
‘తాయ్ చి వాకింగ్’ సాధారణ నడకలాంటిది కాదు... దీనికి కొన్ని పద్ధతులున్నాయి. అడుగు వేసేటప్పుడు ముందుగా మడమను (హీల్) నేలపై మోపి, తర్వాత నెమ్మదిగా పాదాన్ని నేలకు ఆన్చాలి. ఇక కాలుపై శరీరపు బరువును పూర్తిగా మోపాకే మరో కాలును ముందుకు వేయాలి. వెన్నెముక తిన్నగా ఉంచి, చేతులను స్వేచ్ఛగా ఊపుతూ శ్వాసపై దృష్టి పెట్టాలి. ఈ విధానంలో నెమ్మదిగా, ఉద్దేశపూర్వకంగా కదులుతూ బరువును పూర్తిగా ఒక కాలు నుంచి మరో కాలుకు ఎలా బదిలీ చేయాలో నేర్చుకుంటారు. అంటే ‘బరువైన పాదం, తేలికైన పాదం’ అవగాహన దీనిలో ముఖ్యం.
‘‘మీ బరువును మోసే బరువైన పాదానికీ, స్వేచ్ఛగా కదలగలిగే తేలికైన పాదానికీ మధ్య ఉన్న స్పష్టమైన వ్యత్యాసాన్ని గమనిస్తూ నెమ్మదిగా నడక కొనసాగించాలి’’ అంటారు తాయ్ చి మాస్టర్, ‘ద ఫైవ్ సీజన్స్ మెథడ్’ రచయిత్రీ లెడా ఇలియట్. ‘‘మనం ప్రతీ అడుగునూ అవగాహనతో, ఉద్దేశపూర్వకంగా వేసినప్పుడు అర్థవంతమైన మార్గాన్ని సృష్టించుకుంటాం. ఈ విధంగా తాయ్ చి నడక మన జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది సురక్షితమైనదే. అయితే ప్రారంభ దశలో ఉన్నవారు ఒకేసారి ఎక్కువగా చేయకుండా జాగ్రత్త తీసుకోవాలి’’ అని సూచిస్తారామె.
ప్రయోజనాలివి...
కాళ్లపై ఒత్తిడి పడకుండా నడుస్తారు కాబట్టి మోకాళ్ల నొప్పులు, కీళ్ల వాతం ఉన్నవారికి ఉపశమనంగా ఉంటుంది.
ఈ నడకతో కండరాల బలం పెరగడం వల్ల.. వయసు మళ్లినవారు అదుపు తప్పి కిందపడిపోయే ప్రమాదం తగ్గుతుంది.
నడకకు ధ్యానం జత చేరడం వల్ల మానసిక ఒత్తిడీ, ఆందోళన తగ్గి నాడీ వ్యవస్థ మెరుగవుతుంది.
వెన్నెముకను నిటారుగా ఉంచి నడవడం వల్ల శరీర భంగిమ మెరుగుపడి, నడుము నొప్పులు తగ్గుతాయి.
తక్కువ శ్రమతో శరీరమంతటా రక్తప్రసరణ సరిగ్గా జరుగుతుంది.
వీడియోలు శోధిస్తున్నారు...
గూగుల్, సోషల్‌మీడియా వేదికల్లో ఇటీవల ‘స్లో ఫిట్‌నెస్’, ‘తాయ్‌చి వాకింగ్ ఫర్ సీనియర్స్’ అనే సమాచారం కోసం వెదుకుతున్న వారి సంఖ్య 40 శాతానికి పైగా పెరిగింది. రోజూ 20 నిమిషాల ధ్యానపూర్వక నడక వల్ల శరీరంలో ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ స్థాయిలో 20-25 శాతం తగ్గుదల కనిపిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. భారతీయ ఆయుష్, వెల్‌నెస్ రంగాలు కూడా ఆక్యూప్రెజర్, యోగాలతో పాటు ‘జెంటిల్ మూవ్‌మెంట్ థెరపీ’ కింద తాయ్ చి సూత్రాలను చేరుస్తున్నాయి.
‘‘తాయ్ చిపై అఽధ్యయనాలు ఇంకా విస్తృతంగా జరగాల్సివుంది. అయితే ఇప్పటికే జరిగిన పరిశోధనల్లో... చాలామంది వయోధికుల్లో సమతుల్యత, క్రియాత్మక చలనశీలత, జీవన నాణ్యతలో మెరుగుదల కనిపిస్తోంది’’ అంటారు న్యూయార్క్ మౌంట్‌సినాయ్ ఇంటర్నల్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రిస్టఫర్ గోల్డ్. ఏదేమైనా నడకకు సంబంధించిన సురక్షితమైన మార్గం కాబట్టి... ఈ కొత్తరకం నడక పట్ల అందరికీ ఆసక్తి పెరుగుతోంది.
ఫిట్‌నెస్‌తోపాటు ఏకాగ్రత, ప్రశాంతతలపై కూడా దృష్టి పెట్టడం ‘తాయ్ చి’ నడక ప్రత్యేకత. ఇతర వ్యాయా మాల్లాగా వేగంగా కదలాల్సిన అవసరం ఉండదు. ఒక కదలిక నుంచి మరో కదలికకు మృదువుగా మారడం దీని లక్షణాల్లో ఒకటి.
ఈ వార్తలు కూడా చదవండి:
శ్రీశైలం జలాశయానికి 50,161 క్యూసెక్కులు రాక
Read Latest AP News And Telangana News And International News And Telugu News