జపాన్‌లో మరోసారి భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు..
ABN , Publish Date - Aug 23 , 2026 | 07:47 AM
జపాన్ దేశాన్ని భూకంపం మరోసారి వణికించింది. ఆదివారం టోక్యో ప్రాంతంతో సహా తూర్పు జపాన్‌ను భూప్రకంపనలు కుదిపేశాయి. తెల్లవారుజామున 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది.
టోక్యో: జపాన్ దేశాన్ని భూకంపం మరోసారి వణికించింది. ఇవాళ (ఆదివారం) టోక్యో ప్రాంతంతో సహా తూర్పు జపాన్‌ను భూప్రకంపనలు కుదిపేశాయి. తెల్లవారుజామున 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. భవనాలు పెద్దఎత్తున ఊగిపోవడంతో తూర్పు జపాన్ వాసులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. జపాన్‌లో తరచుగా భూకంపాలు సంభవించే ప్రాంతమైన దక్షిణ ఇబరాకి ప్రిఫెక్చర్‌లో ఈ భూకంపం ఏర్పడింది. దీని కేంద్రం భూమికి 70 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది.
జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) ఈ భూకంప తీవ్రతను 5.8గా నమోదు చేసింది. అలాగే హోన్షు తూర్పు తీరానికి సమీపంలో 78 కిలోమీటర్ల లోతులో సంభవించిందని వెల్లడించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే కూడా దీని తీవ్రతను 5.8గా నమోదు చేసింది. భూప్రకంపనల కారణంగా టోక్యోకు ఈశాన్యంగా ఉన్న ఇబరాకి, చిబా, సైతామా ప్రిఫెక్చర్‌లలో ఐదుగురు గాయపడ్డారని జపాన్ అగ్ని, విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు, విద్యుత్ సరఫరా నిలిచిపోగా.. రైళ్ల సేవలకు అంతరాయం ఏర్పడింది. టోక్యో, నరిటా విమానాశ్రయానికి వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు, ఈశాన్య ప్రాంతాలకు వెళ్లే ఇతర లోకల్ రైళ్లూ ఆలస్యం అయ్యాయి. కాగా, అధికారులు ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు.
ఈ ఘటనపై ప్రధాన మంత్రి సనాయ్ తకైచి స్పందించారు. నష్టాన్ని అంచనా వేసేందుకు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలెవరూ భయపడవద్దని, ధైర్యంగా ఉండాలని కోరారు. కాగా, క్యుషులోని కుమామోటో ప్రాంతంలో నెల కిందట 7.1 తీవ్రతతో వచ్చిన భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ విపత్తులో 38 మంది మృతిచెందగా.. మరో 364 మంది గాయపడ్డారు. వేల కొద్దీ ఇళ్లు ధ్వంసమవగా.. లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఇరాన్ ఒప్పందానికి సిద్ధంగా ఉంది.. కానీ..: ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
అమెరికా దాడులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం: ఇరాన్