అమెరికా దాడులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం: ఇరాన్
ABN , Publish Date - Aug 22 , 2026 | 11:06 AM
ఇరాన్‌పై ఒత్తిడి తెచ్చి మునుపెన్నడూలేని విధంగా ఆంక్షలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతుంటే.. వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ స్పష్టం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌పై ఒత్తిడి తెచ్చి మునుపెన్నడూలేని విధంగా ఆంక్షలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతుంటే.. వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ స్పష్టం చేసింది. ఆ ఆంక్షలు తమను ఇబ్బంది పెట్టినా.. వాటిని అధిగమిస్తామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ గాలీబఫ్ ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు.. ఇరాన్‌పై విధించే ఆంక్షలను త్వరలోనే వెల్లడిస్తామని యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ తెలిపారు. ఆ దేశానికి సాయమందించే ఏ దేశమైనా ఈ ఆర్థిక ఆంక్షలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు.
కాగా.. ఆరు నెలలుగా అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బతీసేందుకు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాయి. భూతల, వాయు, సముద్ర మార్గాలు, డ్రోన్‌లతో ఎలా దాడులు చేసినా ఎదుర్కొంటామని ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్ జనరల్ ఆలీ అబ్దొల్లాహీ తెలిపారు. యుద్ధం వల్ల ఇరాన్ ఆర్థికంగా, సైనికంగా నష్టపోయినప్పటికీ.. హోర్ముజ్‌లో నౌకల రవాణాను అడ్డుకోవడానికి డ్రోన్లు, క్షిపణులను వినియోగిస్తూనే ఉంది. ఈ యుద్ధం వల్ల హోర్ముజ్‌లో నౌకా ప్రయాణాలకు అంతరాయం కలిగి, ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం.. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 94.39 డాలర్లకు చేరింది.
సముచితమైన ఒప్పందానికి ఇరాన్ సిద్ధంగాలేదు : ట్రంప్
అమెరికా ప్రతిపాదను అంగీకరించేందుకు ఇరాన్ సుముఖత చూపడంలేదని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ చర్యలను అమెరికా నిత్యం గమనిస్తోందని చెప్పారు. అణ్వాయుధాలను ఇరాన్ సమకూర్చుకోవడానికి వీల్లేదని పునరుద్ఘాటించారు. దీనికి భిన్నంగా వ్యవహరిస్తే తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోక తప్పదని ఆయన హెచ్చరించారు. హోర్ముజ్ అమెరికా ఆధీనంలోనే ఉందన్న ట్రంప్.. ఇకపై అది తమ భూభాగమని వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి:
ఐఫోన్ ఈఎంఐ కోసం గొడవ.. చివరకు కుమారుడితో పాటు తల్లిదండ్రుల మృతి
అవి అలాగే ఉన్నాయి, అలాగే ఉంటాయి.. పాకిస్థాన్ ఆగ్రహంపై భారత్ స్పందన