Share News

అవి అలాగే ఉన్నాయి, అలాగే ఉంటాయి.. పాకిస్థాన్‌ ఆగ్రహంపై భారత్ స్పందన..

ABN , Publish Date - Aug 22 , 2026 | 09:05 AM

జమ్మూకశ్మీర్‌ను భారత్‌లో ఒక ముఖ్యమైన భాగంగా అమెరికా రాయబారి సెర్గియో గోర్ అభివర్ణించడంపై పాకిస్థాన్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలపై ఇస్లామాబాద్‌లోని అమెరికా దౌత్యవేత్తను పిలిపించి పాకిస్థాన్‌ అధికారికంగా నిరసన తెలిపింది.

అవి అలాగే ఉన్నాయి, అలాగే ఉంటాయి.. పాకిస్థాన్‌ ఆగ్రహంపై భారత్ స్పందన..
Pakistan protest On US

ఇంటర్నెట్ డెస్క్: జమ్మూకశ్మీర్‌ను భారత్‌లో ఒక ముఖ్యమైన భాగంగా అమెరికా రాయబారి సెర్గియో గోర్ అభివర్ణించడంపై పాకిస్థాన్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలపై ఇస్లామాబాద్‌లోని అమెరికా దౌత్యవేత్తను పిలిపించి పాకిస్థాన్‌ అధికారికంగా నిరసన తెలిపింది. పాకిస్థాన్‌ చర్యపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది (Sergio J&K India).


పాకిస్థాన్ అసహనం వ్యక్తం చేయడంపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడారు. జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌ రెండూ భారతదేశంలో అంతర్భాగాలని, విడదీయరాని ప్రాంతాలు అని స్పష్టం చేశారు. 'అవి అలాగే ఉన్నాయి, అలాగే ఉంటాయి' అని ఆయన తేల్చిచెప్పారు. పాకిస్థాన్‌ అసహనంపై మరింత వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదని జైస్వాల్ అన్నారు. 'పాకిస్థాన్‌ అసహనంపై వ్యాఖ్యానించాల్సిన అవసరం నాకు కనిపించడం లేదు' అని ఆయన స్పష్టం చేశారు (Pakistan protest).


ఇటీవల జమ్మూకశ్మీర్‌ పర్యటన సందర్భంగా సెర్గియో గోర్ పాక్‌ వాదనకు వ్యతిరేకంగా కీలక వ్యాఖ్యలు చేశారు (US Ambassador Sergio Gor). జమ్మూ,కశ్మీర్‌లో భద్రతా పరిస్థితులు మెరుగుపడుతున్నాయని, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రశంసనీయంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌ను భారత్‌లో ఒక ముఖ్యమైన భాగంగా అభివర్ణించారు. జమ్మూకశ్మీర్‌ను భారతదేశంలోని ముఖ్యమైన ప్రాంతంగా పేర్కొనడం పాకిస్థాన్‌కు అసంతృప్తిని కలిగించింది. అందుకే అమెరికా దౌత్య ప్రతినిధిని పిలిపించి నిరసన తెలిపింది.


ఇవి కూడా చదవండి..

మనిషితో బాక్సింగ్ చేసిన చైనా రోబో.. కానీ ఆ చిన్న పని మాత్రం చేయలేకపోయింది..


మరింత పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Aug 22 , 2026 | 09:05 AM