'ఆ సంస్థ పక్షపాతంతో కూడుకున్నది.. విశ్వసనీయత లేదు': భారత విదేశాంగ శాఖ
ABN , Publish Date - Aug 22 , 2026 | 10:14 AM
ఆర్ఎస్ఎస్‌పై ఆంక్షలు విధించాలన్న యూఎస్‌సీఐఆర్ఎఫ్ తీరును భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. ఆ సంస్థ పక్షపాతంతో కూడుకున్నదని, దానికి ఎలాంటి విశ్వసనీయతా లేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS)పై ఆంక్షలు విధించాలన్న అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్(USCIRF)ను భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. ఆ సంస్థ పక్షపాతంతో కూడుకున్నదని, దానికి ఎలాంటి విశ్వసనీయతా లేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ(MEA) స్పష్టం చేసింది. అది నిర్దిష్ట ఎజెండాతో ప్రచారం చేసే సంస్థ అని, దాని వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరంలేదని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.
'యూఎస్‌సీఐఆర్ఎఫ్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోంది. ఇలాంటి సంస్థలకు మనం దూరంగా ఉండాలి. వీటికి విశ్వసనీయత ఉండదు, సొంత ఎజెండాలు మాత్రమే ఉంటాయి. ఆ సంస్థ భారత బహుళ వ్యవస్థ వాస్తవికతను స్వీకరిస్తుందని గానీ, దాని విభిన్న వర్గాల సామరస్య సహజీవనాన్ని గుర్తిస్తుందని గానీ మేం ఆశించడం లేదు' అని జైస్వాల్ పేర్కొన్నారు.
యూఎస్‌సీఐఆర్ఎఫ్ ప్యానెల్ ఛైర్మన్ ఆసిఫ్ మహమూద్ ఇటీవల ఆర్ఎస్ఎస్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ సభ్యులపై ఆంక్షలు విధించాలని, అందులోని నాయకులకు ఎలాంటి దౌత్యపరమైన మర్యాదలు, హై-లెవెల్ సమావేశాలకు అనుమతి ఇవ్వకూడదని వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఈ నెల 29న అమెరికాలో పర్యటించాల్సి ఉండగా.. దానిని తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీ ఆర్‌ఎస్‌ఎస్ సభ్యుడని, ఆ సంస్థ ఓ గొడుగు కింద పనిచేస్తోందని విమర్శించారు. దాని అనుబంధ సంస్థలు మైనారిటీలపై దాడి చేస్తున్నాయని కూడా ఆయన ఆరోపించారు.
అయితే ఈ వ్యాఖ్యల్ని భారత విదేశాంగ శాఖ తిప్పికొట్టింది. మోహన్ భాగవత్ విదేశీ పర్యటనల నేపథ్యంలో ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదంది. భారత్‌లో మత స్వేచ్ఛపై తప్పుడు నివేదికలు ఇవ్వడానికి బదులుగా, అమెరికాలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు, ప్రవాస భారతీయుల భద్రతపై దృష్టి సారించాలని మరోసారి హితవు పలికింది. కాగా.. యూఎస్‌సీఐఆర్ఎఫ్ అనేది ఓ స్వతంత్ర, ఉభయపక్ష అమెరికా సమాఖ్య ప్రభుత్వ సంస్థ. ఇది ఆ దేశ అధ్యక్షుడు, విదేశాంగ కార్యదర్శి, కాంగ్రెస్‌కు విధానపరమైన సిఫార్సులు చేయడం సహా వాటి అమలును పర్యవేక్షిస్తుంది.
ఇవీ చదవండి:
ఐఫోన్ ఈఎంఐ కోసం గొడవ.. చివరకు కుమారుడితో పాటు తల్లిదండ్రుల మృతి
అవి అలాగే ఉన్నాయి, అలాగే ఉంటాయి.. పాకిస్థాన్ ఆగ్రహంపై భారత్ స్పందన