Share News

నా భర్త ఏడుస్తున్నారు.. ఆయనను విడిపించండి..: కెప్టెన్ అజయ్ పంత్ భార్య ఆవేదన..

ABN , Publish Date - Aug 22 , 2026 | 09:31 AM

రష్యా ఘోస్ట్ ఫ్లీట్‌కు చెందిన చమురు రవాణా నౌక కెప్టెన్‌ అజయ్‌ పంత్‌ అరెస్టు వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ ఏడాది జూన్‌ 14న ఇంగ్లిష్‌ ఛానల్‌లో ప్రయాణిస్తున్న ‘స్మిర్టోస్‌’ నౌకను బ్రిటన్‌ కమాండోలు స్వాధీనం చేసుకున్నారు. అయితే, తన భర్త కెప్టెన్‌ అజయ్‌ పంత్‌‌ను కేంద్ర ప్రభుత్వం విడిపించాలని భార్య రీతూ పంత్‌ కోరారు.

నా భర్త ఏడుస్తున్నారు.. ఆయనను విడిపించండి..: కెప్టెన్ అజయ్ పంత్ భార్య ఆవేదన..
Ajay Pant Arrest Case

న్యూఢిల్లీ: రష్యా ఘోస్ట్ ఫ్లీట్‌కు చెందిన చమురు రవాణా నౌక కెప్టెన్‌ అజయ్‌ పంత్‌ అరెస్టు వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ ఏడాది జూన్‌ 14న ఇంగ్లిష్‌ ఛానల్‌లో ప్రయాణిస్తున్న ‘స్మిర్టోస్‌’ నౌకను బ్రిటన్‌ కమాండోలు స్వాధీనం చేసుకున్నారు. భారతీయుడైన అజయ్‌ పంత్‌తో పాటు 24 మంది నౌక సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయన అక్కడి జైలులోనే ఉన్నారు. ఈ ఘటనపై కెప్టెన్‌ అజయ్‌ పంత్‌ భార్య రీతూ పంత్‌ తొలిసారి స్పందించారు. ఈ వ్యవహారంలో తన భర్తను బలి పశువును చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన సమయంలో సరైన చోట ఆయన లేకపోవడంతోనే చిక్కుకున్నారని చెప్పుకొచ్చారు.


కాగా, అజయ్‌ పంత్‌ స్మిర్టోస్‌ అనే చమురు నౌకకు కెప్టెన్‌గా ఉన్నారు. జూన్‌ 14న దాదాపు 98 వేల టన్నుల చమురుతో వెళ్తున్న ఆ నౌకను బ్రిటన్‌ కమాండోలు స్వాధీనం చేసుకున్నారు. రష్యా చమురు ఆంక్షలను తప్పించుకునేందుకు ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్న ‘షాడో ఫ్లీట్‌’లో ఈ నౌక కూడా భాగమని బ్రిటన్‌ ఆరోపిస్తోంది. అరెస్టు తర్వాత తొలిసారి ఫోన్‌లో మాట్లాడినప్పుడు తన భర్త తీవ్రంగా కలత చెందారని రీతూ పంత్ తెలిపారు. ‘నేను జైలులో ఉన్నాను.. నన్ను బయటకు తీసుకురండి’ అంటూ ఆయన ఏడ్చారని ఆమె చెప్పారు. అజయ్‌ పంత్‌ కేవలం నౌక యజమాని ఆదేశాలను పాటిస్తూ విధులు నిర్వహించారని, కెప్టెన్‌గా తన బాధ్యత సరకును సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడమేనని రీతూ పంత్ పేర్కొన్నారు. అయితే, బ్రిటన్‌ ప్రాసిక్యూషన్‌ మాత్రం నౌకకు అజయ్‌ కెప్టెన్‌ కావడంతో సరకు గురించి ఆయనకు పూర్తి అవగాహన ఉందని పేర్కొంటోంది.


మరోవైపు, నౌకలోని మిగిలిన 24 మంది సిబ్బందిలో అజయ్‌పై ఒక్కరిపైనే కేసు నమోదైంది. మిగిలిన వారిలో ఎక్కువ మందిని స్వదేశాలకు పంపించారు. నౌకను ఇంగ్లండ్‌ దక్షిణ తీరానికి సమీపంలో నిలిపి ఉంచారు. అజయ్‌ పంత్‌పై ఆరోపణలు రుజువైతే గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కాగా, డిసెంబరు 15న విచారణ ప్రారంభం కానుంది. దీనిపై భారత విదేశాంగ శాఖ కూడా స్పందించింది. బ్రిటన్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులు ఆయనను కలిసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అయితే, అజయ్ కుటుంబ సభ్యులు మాత్రం కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని అతడిని స్వదేశానికి తీసుకురావాలని కోరుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

సర్కారు బడి తనిఖీకి వెళ్లిన సీజేపీ బృందంపై దాడి

అవి అలాగే ఉన్నాయి, అలాగే ఉంటాయి.. పాకిస్థాన్‌ ఆగ్రహంపై భారత్ స్పందన..

Updated Date - Aug 22 , 2026 | 09:50 AM