సర్కారు బడి తనిఖీకి వెళ్లిన సీజేపీ బృందంపై దాడి
ABN , Publish Date - Aug 22 , 2026 | 06:12 AM
రాజస్థాన్‌లోని జైపూర్‌లో సర్కార్ బడి తనిఖీ చేయడానికి వెళ్లిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) బృందంపై శుక్రవారం తీవ్రస్థాయిలో దాడి జరిగింది.
రాజస్థాన్‌లోని రాంపురా కన్వార్‌పురాలో ఘటన
రాళ్లు, కర్రలతో విరుచుకుపడ్డ స్థానికులు
వాహనాలు ధ్వంసం.. పలువురికి గాయాలు
ఇది బీజేపీ గుండాల పనే: దీప్కే
జైపూర్, ఆగస్టు 21: రాజస్థాన్‌లోని జైపూర్‌లో సర్కార్ బడి తనిఖీ చేయడానికి వెళ్లిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) బృందంపై శుక్రవారం తీవ్రస్థాయిలో దాడి జరిగింది. ‘స్కూల్ ఠీక్ కరో’ కార్యక్రమంలో భాగంగా సీజేపీ కో-కన్వీనర్ అశుతోష్ రంకా నేతృత్వంలోని ప్రతినిధుల బృందం.. రాంపురా కన్వార్‌పురా గ్రామంలో బడుల స్థితిగతులను పరిశీలించేందుకు వెళ్లింది. సీజేపీ ప్రతినిధులు గ్రామానికి చేరుకోగానే.. స్థానికులు, బీజేపీ కార్యకర్తలు చుట్టుముట్టి రాళ్లతో, కర్రలతో విరుచుకు పడ్డారని అశుతోష్ ఆరోపించారు. పాఠశాల భవనం ప్రమాదకరంగా ఉందనే కారణంతో, గత కొన్నేళ్లుగా విద్యార్థులకు సమీపంలోని ఓ పశువుల కొట్టంలో తరగతులు నిర్వహిస్తున్నారని.. దీనిని ప్రశ్నించినందుకు తమపై దాడి చేయించారని ధ్వజమెత్తారు. తమ సభ్యులపై దాడి చేసి చొక్కాలు చింపేశారని, వాహనాల అద్దాలు, మొబైల్ ఫోన్లు ధ్వంసం చేశారని.. మహిళా ప్రతినిధులపై బురద చల్లి దుర్భాషలాడారని వాపోయారు. ఈ ఘర్షణల్లో పలువురు సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయని, ఒకరి చెయ్యి కూడా విరిగిందని పేర్కొన్నారు. రాజస్థాన్ విద్యాశాఖమంత్రి మదన్ దిలావర్ ఆదేశాల మేరకే.. బీజేపీ గుండాలు తమపై దాడి చేశారని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆగ్రహం వ్యక్తం చేశారు. పశువుల పాకలో నడుస్తున్న బడిని బాగుచేయాలని కోరడమే తమ ప్రతినిధులు చేసిన నేరమా? అని నిలదీశారు. బాధ్యులైన వారిని 48గంటల్లో అరెస్ట్ చేయాలని లేదంటే తమ నిరసనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.