Share News

ఆదమరిస్తే అన్నీ కష్టాలే

ABN , Publish Date - Aug 23 , 2026 | 05:19 AM

నిర్మాణంలో ఉన్న ఇళ్లు కొనుగోలు కోసం గృహ రుణం తీసుకోవాలనుకుంటున్నారా..? అయితే మరింత జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇలాంటి సందర్భాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో తెలుసుకుందాం..

ఆదమరిస్తే అన్నీ కష్టాలే

నిర్మాణంలో ఉన్న ఇంటిని కొంటున్నారా?

నిర్మాణంలో ఉన్న ఇళ్లు కొనుగోలు కోసం గృహ రుణం తీసుకోవాలనుకుంటున్నారా..? అయితే మరింత జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇలాంటి సందర్భాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో తెలుసుకుందాం..

గుడ్డిగా నమ్మొద్దు..

నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లోని ఇళ్లను అమ్ముకునేందుకు బిల్డర్లు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటారు. వారి ప్రకటనలను గుడ్డిగా నమ్మి హోమ్‌లోన్‌తో ఇళ్లు కొంటే చిక్కుల్లో పడే అవకాశాలున్నాయి. ముఖ్యంగా, ఊరు పేరు లేని బిల్డర్ల వెంచర్ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. హోమ్‌ లోన్‌ తీసుకునే ముందే బిల్డర్‌ విశ్వసనీయత, మీరు ఫ్లాట్‌ లేదా ఇళ్లు కొనుగోలు చేస్తున్న ప్రాజెక్టు రెరా చట్టం కింద నమోదై అన్ని అనుమతులు పొంది ఉందా..?, నిర్మాణ పురోగతి ఆధారంగా గృహ రుణ సొమ్మును విడతల వారీగా విడుదల చేసే అవకాశం ఉందా? అనే విషయాలతో పాటు హోమ్‌ లోన్‌ తిరిగి చెల్లింపు షెడ్యూల్‌, పన్నుల చట్టాలు, బిల్డర్‌ సకాలంలో నిర్మాణం పూర్తి చేసి ఇంటిని అప్పగించకపోతే మన ముందు ఉండే ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలు వంటి అన్ని విషయాలు సమగ్రంగా తెలుసుకోవాలి.

ప్రాజెక్టు నాణ్యత

సొంతిల్లు జీవితకాల పెట్టుబడి. అప్పు చేసి కొనే ఇంటి నిర్మాణ నాణ్యత కూడా జీవితకాలం పాటు పదిలంగా ఉండాలి. కాబట్టి బిల్డర్‌ ఆ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఎలాంటి సిమెంట్‌, ఇటుకలు, స్టీలు వంటి నిర్మాణ సామాగ్రి వాడుతున్నారో తెలుసుకోవాలి. దాదాపు అందరు బిల్డర్లు తమ బ్రోచర్లలోనే ప్రాజెక్టు నిర్మాణానికి ఏయే కంపెనీల సిమెంట్‌, స్టీలు వాడుతున్న విషయాలను ప్రకటిస్తున్నారు. లేదంటే, మీరే స్వయంగా అడిగి తెలుసుకోవాలి. అంతేకాదు, నిర్మాణ సమయంలో వీలైనప్పుడల్లా ప్రాజెక్టును సందర్శించడంతోపాటు ఎలాంటి మెటీరియల్‌ ఉపయోగిస్తున్నారో జాగ్రత్తగా గమనించాలి.


రుణం విడుదల

నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో కొనే ఇళ్లకు ఇచ్చే గృహ రుణాలను బ్యాంకులు, హోమ్‌లోన్‌ కంపెనీలు ఒకేసారి విడుదల చేయవు. ఆ ప్రాజెక్టు నిర్మాణ పురోగతి ఆధారంగా దశల వారీగా విడుదల చేస్తుంటాయి. ప్రాజెక్టు నిర్మాణంలో బిల్డర్‌ ఏ మాత్రం జాప్యం చేసినా రుణం మలి విడత సొమ్ము విడుదలకు అంగీకరించవు. అదే జరిగితే ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగిపోవడంతోపాటు ప్రాజెక్టు నిర్మాణమూ ఆలస్యమవుతుంది. గృహ రుణం తీసుకునే ముందే ఈ విషయం తెలుసుకోవాలి.

సకాలంలో పూర్తి

ప్రతి బిల్డర్‌ సకాలంలో తమ ప్రాజెక్టు పూర్తి చేసి కొనుగోలుదారుడికి అప్పగించాలి. మధ్యలో ప్రాజెక్టు ప్లాన్‌ లేదా స్పెసిఫికేషన్లు మారుస్తుంటే మాత్రం కొనుగోలుదారులు ఆ ప్రాజెక్ట్‌కు స్వస్తి పలికి, బిల్డర్‌ నుంచి తమ డబ్బులు వెనక్కి తీసుకోవడం ఉత్తమం. రెరా చట్టం కింద నమోదైన ప్రాజెక్టుల్లో ఇళ్లు కొనే వారికి ఈ సౌలభ్యం ఉంది.

మొత్తం ధరపై అంచనా

నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో ఇల్లు కొనే ముందే మొత్తం ఖర్చుపై కొనుగోలుదారులకు స్పష్టమైన అవగాహన ఉండాలి. ప్రస్తుతం ఇంటికి నెలవారీ అద్దెతోపాటు గృహ రుణ ఈఎంఐలు చెల్లించే ఆర్థిక స్థోమత ఉందా? లేదా? అనే విషయాలపై సమగ్ర అవగాహన ఉండాలి.

బిల్డర్‌ ట్రాక్‌ రికార్డ్‌

నిర్మాణంలో ఉన్న వెంచర్లలో, హోమ్‌ లోన్‌తో ఇల్లు కొనే ముందే బిల్డర్‌ ఆర్థిక స్థితిగతులు, అతడి ట్రాక్‌ రికార్డు తెలుసుకుంటే సమస్యలు రావు. వీలైనంత వరకు చిన్న బిల్డర్లు చేపట్టే ప్రాజెక్టుల జోలికి పోకపోవడమే ఉత్తమం.

ఇవి కూడా చదవండి

ఆ అవమానకర వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించాలి: కొండా సురేఖ

డీఎస్సీపై జగన్‌కు మరోసారి సవాల్ విసిరిన మంత్రి లోకేశ్

Updated Date - Aug 23 , 2026 | 05:19 AM