50 గజాలు.. 7 అంతస్తులు..పేకమేడలా కూలిన భవనం
ABN , Publish Date - Aug 23 , 2026 | 05:36 AM
కేవలం 50 గజాల స్థలంలో.. అదీ నాలాను ఆనుకుని ఉన్న స్థలంలో.. అక్రమంగా నిర్మిస్తున్న ఏడంతస్తుల భవనం నిట్టనిలువునా కుప్పకూలింది! ఆ సమయంలో భవనంలో..
టైల్స్ వేస్తున్న ఇద్దరు కార్మికుల దుర్మరణం
గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో విషాదం
శిథిలాలు పడి దెబ్బతిన్న పక్కన అపార్ట్‌మెంట్
దాంట్లోనివారిని ఖాళీ చేయించిన పోలీసులు
మరికొన్ని భవనాలూ దెబ్బతిన్నట్టు గుర్తింపు
కుంగిందని ముందే హెచ్చరించిన బస్తీజనం
యజమాని, బిల్డర్ల కోసం పోలీసుల గాలింపు
రాయదుర్గం, హైదరాబాద్ సిటీ, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): కేవలం 50 గజాల స్థలంలో.. అదీ నాలాను ఆనుకుని ఉన్న స్థలంలో.. అక్రమంగా నిర్మిస్తున్న ఏడంతస్తుల భవనం నిట్టనిలువునా కుప్పకూలింది! ఆ సమయంలో భవనంలో టైల్స్ పనులు చేస్తున్న ఇద్దరు బిహారీ కార్మికులు శిథిలాల కింద పడి దుర్మరణం పాలయ్యారు. ఐటీ కారిడార్ గచ్చిబౌలి పరిధిలోని అంజయ్యనగర్‌లో శనివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో జరిగిందీ విషా దం. ఆ కాలనీలోని సర్వే నంబర్ 135, ప్లాట్ నంబర్ 113లో నిర్మాణంలో ఉన్న భవనం.. శనివారం ఉదయమే ఒక అడుగుమేర కుంగిపోయింది. దీంతో.. పైన రెండు అంతస్తులను తక్షణమే కూల్చివేయాలని లేకుంటే భవనం మొత్తం కులిపోయి పక్క భనాలపై పడుతుందని బస్తీవాసులు హెచ్చరించారు. ఆ భవనం పక్కనే నాలుగు అడుగుల వెడల్పు, ఐదు అడుగుల లోతులో నాలా ప్రవహిస్తోందని.. దాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఏడంతస్తుల భవనం, అదీ నాసిరకంగా నిర్మించడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందే హెచ్చరించినప్పటికీ భవన యజమాని పట్టించుకోకపోవడంపై మండిపడుతున్నారు. కాగా.. ఈ భవనం కూలే సమయంలో దాని శిథిలాలు పడి పక్కనే ఉన్న జనదర్శిని రెసిడెన్షియల్ అపార్టుమెంట్ తీవ్రంగా దెబ్బతింది. దీంతో, అందులో నివాసం ఉంటున్న ఐదు కుటుంబాలను పోలీసులు ఖాళీ చేయించారు. చుట్టుపక్కల ఉన్న మరో రెండు భవనాల్లో ఒకటి బాగా దెబ్బతినగా.. మరొకటి స్వల్పంగా దెబ్బతిన్నట్లు తెలిసింది.
ఈ భవనాల పరిస్థితిని ప్రస్తుతం అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక.. ప్రమా ద సమాచారం అందుకున్న వెంటనే రాయదుర్గం పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది, మాదాపూర్ ఫైర్‌స్టేషన్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని శిథిలాల్లో చిక్కుకున్న కార్మికులు ఉమేష్ కారే(34), మోపత్(42) మృతదేహాలను వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భవన యజమాని పేరు సాధిక్‌గా పోలీసులు గుర్తించారు. ఆ ప్రాంతంలోనే ఆయనకు2-3 భవనాలు ఉన్నాయని, వాటినే కూడా ఇలాగే కట్టి హాస్టళ్లకు అద్దెకిచ్చారని సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా ఈ భవనాన్ని నిర్మించిన యజమానితోపాటు.. నిర్మాణ పనులు చేపడుతున్న బిల్డర్ ఖాజా మొయినుద్దీన్‌ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా.. కూలిన భవనం ఉన్న ప్రాంతం రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండగా.. దాని శిథిలాలు పడి తీవ్రంగా దెబ్బతిన్నపక్కభవనం మాధాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండడం గమనార్హం. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం.రమేశ్ పరిశీలించారు. సహాయక చర్యల గురించి, ప్రమాదానికి దారితీసిన పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే.. సీఎంసీ కమిషనర్ సృజన, హైడ్రా కమిషనర్ రంగనాథ్, జోనల్ కమిషనర్ మయాంక్‌సింగ్, డీసీపీ రీతిరాజ్, తహశీల్దార్ మహిపాల్‌రెడ్డి, సీసీపీ వెంకన్న, టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారులతో కలిసి పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ కూడా అక్కడికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలించారు. అంజయ్యనగర్‌లో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి అక్రమ నిర్మాణాలన్నింటినీ కూల్చేస్తామని రంగనాథ్ హెచ్చరించారు.
అన్నీ అక్రమ నిర్మాణాలే..
గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, ఐటీజోన్ ప్రాంతాల్లో అద్దెలు బాగా వస్తుండడంతో.. చాలామంది తక్కువ స్థలంలో ఆరు, ఏడు అంతస్తులు నిర్మించి పీజీహాస్టళ్లకు అద్దెలకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. అక్కడ ఎలాంటి సెట్‌బ్యాక్‌లూ లేకుండా 15 అడుగుల రోడ్డును సైతం ఆక్రమించి నిర్మాణాలు చేశారు. దీంతో ప్రమాదం జరిగిన ప్రాంతానికి కనీసం అంబులెన్స్ కూడా చేరలేని పరిస్థితి. ఇరుకిరుగ్గా ఉండే ఆ అపార్ట్‌మెంట్లలో చిన్నపాటి అగ్నిప్రమాదం జరిగినా భారీ నష్టం వాటిలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలాంటి అక్రమ నిర్మాణాలను అ డ్డుకోవాల్సిన అధికారులు ఆయా భవనాల యజమానులు ఇచ్చే మామూళ్లకు అలవాటుపడి వారి జేబు లు నింపుకొంటూ చూసిచూడనట్లు వదిలేస్తున్నార ని.. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రం నాలుగురోజులు హడావిడి చేసి అనంతరం మిన్నకుండిపోతున్నారు తప్ప ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని.. దీంతో యజమానాలు యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని మండిపడుతున్నారు.
మా బెడ్ రూమ్ ధ్వంసమైంది
అదృష్టం కొద్ది ప్రాణాలతో బయటపడ్డాం!
కూలిన భవనం పక్కనున్న అపార్ట్‌మెంట్ వాసి
అంజయ్యనగర్‌లో కుప్పకూలిన ఏడంతస్తుల భవనం శిథిలాల కారణంగా.. తమ ఫ్లాట్లు దెబ్బతిన్నాయని పక్కనున్న జనదర్శిని అపార్ట్‌మెంట్‌వాసులు వాపోయారు. భవనం కూలే సమయంలో.. పెద్ద శబ్దం రావడంతో తాము కిందకు వెళ్లామని, అప్పటికే భవనం పూర్తి కూలిపోయిందని.. పైకి తిరిగి వెళ్లేసరికి తమ బెడ్‌రూమ్ ధ్వంసమై ఉందని జనదర్శిని అపార్టుమెంటు నివాసితుడు ఉమామహేశ్ తెలిపారు. అదృష్టం బాగుండి తామంతా ప్రాణాలతో బయపడ్డామని.. అయితే, తమ అపార్టుమెంట్‌లో ఇద్దరు గాయపడ్డారని వెల్లడించారు. శిథిలాలు తమ అపార్ట్‌మెంట్‌పై పడ్డవెపు ఉన్న సెట్‌బ్యాక్ స్థలంలో రోజూ సాయంత్రంపూట పిల్లలు క్రికెట్ ఆడుకుంటూ ఉంటారని.. ప్రమాదం మధ్యాహ్నం జరగడంతో అక్కడ పిల్లలెవరూ లేరని, దీంతో పెను ప్రమాదం తప్పిందని జనదర్శిని అపార్ట్‌మెంట్‌వాసులు తెలిపారు.