Share News

ఆరోగ్యం.. జర పైలం

ABN , Publish Date - Apr 03 , 2026 | 08:19 AM

ఎండలు పెరుగుతున్నాయి. రేకుల ఇళ్లలో ఉంటున్న వారు ఇబ్బంది పడుతున్నారు. నాలుగైదు రోజుల నుంచి నగరంలో వేడి వాతావరణంతో జనం ఇబ్బంది పడుతున్నారు.

ఆరోగ్యం.. జర పైలం

  • ఉదయం 10 గంటలకే పెరుగుతున్న వేడి

  • బయటకు వెళ్లాలంటే ఆలోచిస్తున్న ప్రజలు

హైదరాబాద్‌ సిటీ: ఎండలు పెరుగుతున్నాయి. రేకుల ఇళ్లలో ఉంటున్న వారు ఇబ్బంది పడుతున్నారు. నాలుగైదు రోజుల నుంచి నగరంలో వేడి వాతావరణంతో జనం ఇబ్బంది పడుతున్నారు. ఉదయం పది గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతుండడంతో బయటకు వెళ్లాలంటే ప్రజలు ఆలోచిస్తున్నారు.


city3.jpgఆస్పత్రులకు కేసులు

ఎండ పెరుగుతుండడంతో ఆస్పత్రులకు కేసులు వస్తున్నాయని, జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, డయేరియా, డీ హైడ్రేషన్‌, హై ఫీవర్‌, కండరాల నొప్పితో బాధపడుతూ వస్తున్న వారిని ఆస్పత్రుల్లో అడ్మిట్‌ చేసుకుని చికిత్స చేస్తున్నామని వైద్యులు తెలిపారు. చాలా మందికి నోరు ఎండిపోయినట్లు, ఒంట్లో సత్తువ సన్నగిల్లడం, అలసట, తలతిరడం, నీరసం, విరేచనాలు, వడదెబ్బ, శరీరం వేడెక్కడం, అతిసార, గొంతు తదితర సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వైద్యులు తెలిపారు. ఆస్పత్రులకు వచ్చే కేసులలో ఎక్కువగా డీ హైడ్రేషన్‌కు సంబంధించినవే ఉంటున్నట్లు వివరించారు. ఎండలు పెరుగుతుండడంతో అప్రమత్తంగా ఉండాలని, కొబ్బరి నీళ్లు తాగాలని సూచిస్తున్నారు.


ఎండబారిన పడితే హీట్‌ స్ట్రోక్‌

వేసవి కాలంలో ఐదు నుంచి ఎనిమిది గంటలు ఎండలో గడిపితే వృద్ధులకు హీట్‌స్ట్రోక్‌ వచ్చే ముప్పు ఉంది. దీని బారిన పడినప్పుడు వెంటనే ఫ్లూయిడ్స్‌ ఇవ్వాలి. హీట్‌ స్ట్రోక్‌తో మైగ్రేన్‌, హై ఫీవర్‌, ఒళ్లు నొప్పులు, కాళ్లు, చేతులు లాగినట్లు అనిపించడం, వాంతులు, విరేచనలు కావడం, తల తిరుగుతున్నట్లు అనిపించడం వంటి లక్షణాలు ఉంటాయి. నీళ్లు తాగిన వెంటనే వాంతులు కావడం వంటి సమస్యలు ఉత్నన్నమవుతాయని వైద్యులు తెలిపారు.


అప్రమత్తంగా ఉండాలి

ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో వృద్ధులు, గర్భిణులు అప్రమత్తంగా ఉండాలి. వేసవిలో శరీర ఉష్ణోగ్రత పెరగడం వల్ల డీహైడ్రేషన్‌ (నీటి శాతం తగ్గడం) సమస్య తలెత్తుతుంది. దీనివల్ల నీరసం, తల తిరగడం, కండరాల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎండాకాలంలో రోజుకు కనీసం 3 నుండి 4 లీటర్ల నీరు తాగాలి. మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, ఓఆర్‌ఎస్‌ వంటి ద్రవ పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. బయటకు వెళ్లేటప్పుడు కాటన్‌ దుస్తులు ధరించాలి. తలకు టోపీ పెట్టుకోవాలి లేదా గొడుగు వాడాలి. నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. వికారం, వాంతులు, విపరీతమైన తలనొప్పిగా ఉంటే సమీపంలోని వైద్యులను సంప్రదించాలి.

- డాక్టర్‌ జగదీష్‏కుమార్‌, సీనియర్‌ జనరల్‌ ఫిజీషియన్‌, మెడికవర్‌ ఆస్పత్రి, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్‌


ఈ వార్తలు కూడా చదవండి:

‘ఆంధ్రజ్యోతి’ చెప్పిందే... జరిగింది!

బ్లాక్‌లో వాణిజ్య సిలిండర్లు!

Read Latest Telangana News and National News

Updated Date - Apr 03 , 2026 | 09:00 AM