ఏసు జీవితం ఒక పాఠం
ABN , Publish Date - Apr 03 , 2026 | 03:01 AM
ఏసు క్రీస్తు జీవితం ఒక ప్రజా నాయకుడు ఎలా ఉండాలో తెలియజేసే గొప్ప పాఠం. దేవునిగా కాకుండా... ఒక మానవమాత్రుడిగా ఆయనను పరిగణించినా... రోగులను అక్కున చేర్చుకోవడం, మహిళలపై...
నేడు గుడ్‌ఫ్రైడే
ఏసు క్రీస్తు జీవితం ఒక ప్రజా నాయకుడు ఎలా ఉండాలో తెలియజేసే గొప్ప పాఠం. దేవునిగా కాకుండా... ఒక మానవమాత్రుడిగా ఆయనను పరిగణించినా... రోగులను అక్కున చేర్చుకోవడం, మహిళలపై సాగే అత్యాచారాలను రెండువేల ఏళ్ళ క్రితమే ప్రశ్నించడం, వెలివేతకు గురైనవారికి ఆలంబనగా ఉండడం అసాధారణమైన లక్షణాలు. ‘ఏసు పుట్టుక, మరణం అసత్యాలు కావు’ అని చరిత్రకారులు చెబుతున్నారు. నజరేయుడైన ఏసు గలలియా తీర ప్రాంతాల్లో... నజరేతు, జెరూసలేం తదితర ప్రదేశాల్లో సంచరించినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆయన కథను గుర్తుచేసుకుందాం.
ఏసు క్రీస్తు మరణించి రెండు వేల ఏళ్ళు గడచినట్టు చరిత్ర చెబుతున్నా... ఆయన జీవితం, మరణాల కథలు నేటికీ కోట్లాది ప్రజల నోళ్ళలో నానుతూనే ఉన్నాయి. ప్రస్తుత పాలస్తీనాలోని బెత్లేహేం అనే ఊరిలో ఏసు క్రీస్తు జన్మించాడు. గలలియాలోని నజరేతులో నివసిస్తున్న అతని తల్లిదండ్రులు... జనాభా లెక్కల కోసం ఊరుకాని ఊరుకు వచ్చారు. అక్కడ కనీసమైన చోటు దొరక్కపోవడంతో... పశువుల పాకలోనే ఏసు పుట్టుక సంభవించింది. రోడ్ల పక్కన, ఎలాంటి సౌకర్యాలు లేని పూరి గుడిసెల్లో అనామకంగా పుట్టే ఎందరో పేద బిడ్డల్లాగానే... దేవుని కుమారుడిగా చెప్పుకున్న ఆయన కూడా జన్మించాడు. తదనంతర కాలంలో గలిలయా పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక, సామాజిక ఆలోచనా విధానాన్ని ఆయన బోధించడం మొదలుపెట్టాడు. తనకంటూ ఇల్లు, వాకిలి, కుటుంబం అంటూ ఏదీ కోరుకోలేదు. సామాన్య ప్రజలతో మమేకమయ్యాడు. వారిలో నైతిక విలువలను పెంపొందించే బోధ చేస్తూ వారిని ఆకర్షించారు. ‘బోధకుడా!’ అంటూ ఆయన ఎక్కడ ఉంటే అక్కడకు ప్రజలు తండోపతండాలుగా కదలి వచ్చేవారని బైబిల్‌లోని సువార్తలు చెబుతున్నాయి. ప్రజలకు నైతికతను బోధిస్తూనే... ఆనాటి రోమా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీసే సామాజికవేత్తగా ఆయన ఎదిగాడు. హేరోదు దుష్ట పాలనలో మహిళల పట్ల, దిగువ స్థాయి బలహీన సమూహాల పట్లా హింస చెలరేగుతూ, మోషే ధర్మ శాస్త్రం పేరిట వ్యభిచారంలో పట్టుబడిన మహిళలను పట్టపగలే రాళ్ళతో కొడుతూ, వెంటాడి అమానుషంగా చంపుతున్న రోజులలో... వాటికి పాల్పడుతున్న వారి నైతికతను ఏసు క్రీస్తు ప్రశ్నించాడు. ‘‘మీలో తప్పు చేయనివారు ఆమెపై రాయి వేయండి’’ అంటూ... తమ కంటిలో దూలాన్ని ఉంచుకొని, ఎదుటివారి కళ్ళలో నలుసుల్ని ఎత్తిచూపేవారిని బహిరంగంగా నిలదీశాడు. కుష్టురోగులు, వితంతువులు, అనాథ పిల్లల పట్ల ఎనలేని ఆదరణ చూపాడు. చేపలు పట్టుకొని పొట్టపోసుకొనే నిరుపేద యువకులనే అనుచరులుగా ఎంచుకున్నాడు. జంతుబలుల ద్వారా హింసను ప్రోత్సహిస్తున్న పీఠాధిపతులను ‘వేషధారుల్లారా’ అని దుయ్యబట్టాడు.
ప్రతి మాటా ఆణిముత్యమే...
అధికార బలంతో సామాన్యుల జీవితాలపై జులుం ప్రదర్శిస్తూ, కఠినమైన పన్నులు విధిస్తూ, ఎదురు ప్రశ్నిస్తే ఉసురు తీస్తూ... పాలకులే అనైతిక కార్యకలాపాలలో మునిగి తేలుతున్న పరిస్థితుల్లో ఏసు క్రీస్తు తన బోధలతో ప్రజల్లో ఆశ పుట్టించాడు. గలలియా తీర ప్రాంతపు కొండపై చేసిన ‘కొండ మీద ప్రసంగం’లో... ఆయన చెప్పిన ప్రతి మాటా ఒక ఆణిముత్యమే. పేదరికాన్ని శాపంగా భావించే సమాజంలో ‘‘బీదలారా! మీరు ధన్యులు, దుఃఖపడువారు ధన్యులు, నీతికోసం హింసకు గురయ్యేవారు ధన్యులు’’ అంటూ కనీవినీ ఎరుగని బోధ చేశాడు. ‘‘రేపటి గురించి ఆలోచించవద్దు. ఒక్క రోజు వికసించి ఎండిపోయే గడ్డిని, ఎప్పుడు మరణిస్తాయో తెలియని పక్షులను సృష్టికర్త పోషిస్తున్నప్పుడు... మీరు వాటికన్నా శ్రేష్టులైన మనుషులు కదా! మిమ్మల్ని పోషించడా?’’ అంటూ వ్యక్తిత్వ నిపుణుడిగా, ఆశావాదిగా... ఊరట కోసం వచ్చిన ప్రజలకు సానుకూల దృక్పథాన్ని ఆయన బోధించాడు. రోమా చక్రవర్తుల పాలనలో అద్దెకు ఇచ్చిన యెరూషలేము దేవాలయం దుస్థితిని, ఆ పరిసరాల్లో యథేచ్ఛగా జరుగుతున్న వ్యాపారాన్ని చూసి ఉగ్రరూపం దాల్చిన ఏసు... కొరడాపట్టి అక్కడివారిని హెచ్చరించాడు. తన తండ్రి మందిరాన్ని వ్యాపార స్థలంగా మార్చడాన్ని సహించనని స్పష్టం చేశాడు.
శాంతి, ప్రేమ, క్షమ పెంచాలని...
ప్రజల్ని నిరంతరం చైతన్యపరుస్తూ, రాజ్యపు దుష్టత్వాన్ని బట్టబయలు చేస్తున్న ఆయనపై దైవదూషణ అభియోగాన్ని అన్యాయంగా మోపింది కయిపా గుంపు. ఏసు శిష్యులలో ఒకడైన ఇస్కారియోతే యూదాకు వెండి నాణాల ఆశ చూపించింది. ఆ తరువాత గవర్నర్ పిలాతు ఆధ్వర్యంలో కనీవినీ ఎరుగని శారీరక, మానసిక హింసకు గురి చేసి, ఏసుకు సిలువ వేయమని ఆయన్ని ఎంతో ప్రేమించిన ప్రజానీకంతోనే చెప్పించింది నాటి ప్రభుత్వం. భూమిపై నైతిక సామ్రాజ్యం స్థాపించాలని, ప్రజల్లో శాంతి, ప్రేమ, క్షమ పెంచాలని ఆశించి... దానికోసం తన జీవితాన్ని ధారపోసిన ఏసు... మరణ శిక్షకు సిద్ధపడ్డాడు తప్ప తప్పించుకొనే ప్రయత్నం చేయలేదు. అన్నిటినీ మౌనంగా భరించాడు. పైగా... ‘‘వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. కనుక వీరిని క్షమించు’’ అని దేవుణ్ణి వేడుకొనేంతగా ప్రజల్ని ఆయన ప్రేమించాడు. ఏసు క్రీస్తు ఒక సామాజిక విప్లవకారుడు, నీతిని, న్యాయాన్ని కాంక్షించిన మానవతావాది.
అరుణ గోగులమండ
ఇవి కూడా చదవండి...
ప్రమాదవశాత్తు సంపులో పడి 8 నెలల పసికందు మృతి
రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్.. యువకుడిపై కత్తులతో దాడి
Read Latest Telangana News And Telugu News