అమరావతిని ఎవరూ తాకలేరు
ABN , Publish Date - Apr 03 , 2026 | 05:32 AM
యావద్దేశమంతా ఐదు కోట్ల ఆంధ్రుల కోసం ‘ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, జై అమరావతి’ అని నినదించిందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్ అన్నారు.
రాజధాని పనులు పూర్తి చేస్తాం.. ప్రధాని చేతుల మీదుగానే ప్రారంభిస్తాం
యావద్దేశం ఆంధ్రులకు అండగా నిలబడింది.. ఇందుకు రాష్ట్ర ప్రజలంతా గర్వపడాలి
ఐదేళ్లలో జగన్ ఒక్క ఇల్లు కట్టలేదు.. ఆయన రాజధాని నిర్మిస్తారా?
ప్లాన్ బీ, సీ, డీ అంటే ఎవరు నమ్ముతారు?.. అమరావతి తొలి దశ రెండేళ్లలో పూర్తి
తక్షణమే స్పోర్ట్స్ సిటీ పనులు ప్రారంభం.. విమానాశ్రయంపైనా దృష్టి: లోకేశ్
ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి, స్పీకర్‌తో భేటీ.. బీజేపీ అధ్యక్షుడు నబీన్‌తో కూడా..
రాజధాని బిల్లును ఆమోదించినందుకు కృతజ్ఞతలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): యావద్దేశమంతా ఐదు కోట్ల ఆంధ్రుల కోసం ‘ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, జై అమరావతి’ అని నినదించిందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్ అన్నారు. ఇక ఎవరూ అమరావతిని తాకలేరని స్పష్టంచేశారు. రాజధానిపై అపోహలు తొలగిపోయాయని, 5 కోట్ల ఆంధ్రులు గర్వపడేవిధంగా అమరావతిని అభివృద్థి చేస్తామని ప్రకటించారు. రాజధానితోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనూ అభివృద్థి చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. అమరావతి బిల్లును రాజ్యసభలో ఆమోదించే ఘట్టాన్ని గురువారం సభ గ్యాలరీ నుంచి వీక్షించిన ఆయన.. ప్రధాని మోదీని, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ను, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌ను కలిశారు. బిల్లును ఆమోదించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. సాయంత్రం లోకేశ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతుల, మహిళలు చేసిన పోరాటం ఫలించిందన్నారు. అమరావతిని, ఐదు కోట్ల ఆంధ్రులను కాపాడింది పార్లమెంటేనని అన్నారు. ఎంపీలు, తాను నిలుచుని పార్లమెంటుకు నమస్కరించామని చెప్పారు. పార్లమెంటులో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందిన ఈ రోజు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలిపారు. ‘ఈ రోజు 5 కోట్ల ఆంధ్రులు గెలిచిన రోజు.. అమరావతి రైతులు గెలిచిన రోజు.. అమరావతి మహిళలు గెలిచిన రోజు’గా అభివర్ణించారు. ఆంధ్రులకు గతంలో మద్రాసు, కర్నూలు, హైదరాబాద్ రాజధానులుగా ఉన్నాయన్నారు. 58 ఏళ్లు కష్టపడి, చెమటోడ్చి అటు తెలంగాణ, ఇటు ఆంధ్ర ప్రజలు కలసికట్టుగా హైదరాబాద్‌ను అభివృద్థి చేసుకుంటే.. ఒక చీకటిరోజు పార్లమెంటులో ఎలాంటి చర్చ జరగకుండా టీవీలు కట్టేసి, తలుపులు మూసేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఆమోదం తెలిపిన వెంటనే తాను ఢిల్లీకి వచ్చి రాష్ట్ర ప్రజల తరఫున ప్రధానికి కృతజ్ఞతలు తెలుపడం కర్తవ్యంగా భావించానని చెప్పారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య బలమైన సమన్వయం ఉంటే ఎలాంటి నిర్మాణాత్మకమైన కార్యమైనా సాధించవచ్చని చెప్పేందుకు అమరావతి బిల్లుకు ఆమోదమే నిదర్శనమని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడినందుకు ప్రధానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అమరావతి తొలిదశ పనులు రెండేళ్లలో పూర్తిచేస్తామని, స్పోర్ట్స్ సిటీ పనులు వెంటనే ప్రారంభిస్తామని, విమానాశ్రయం పనులపై దృష్టిసారించామని లోకేశ్ వివరించారు. పోలవరం కూడా సీఎం చెప్పిన నిర్ణీత సమయంలోపే పూర్తవుతుందని తేల్చిచెప్పారు. ఐదేళ్లలో ఒక్క ఇల్లు కట్టలేని జగన్.. రాజధాని నిర్మిస్తారా అని ప్రశ్నించారు. ప్లాన్ బీ, ప్లాన్ సీ, ప్లాన్ డీ అంటే ఎవరు నమ్ముతారని ఎద్దేవాచేశారు. ఇంకా ఏమన్నారంటే..
రాజధానిని తరలిస్తారని చెప్పినా..
2019 ఎన్నికలకు ముందు ప్రజలకు మేం చాలా స్పష్టంగాప్రజలకు చెప్పాం. పొరపాటున ప్రభుత్వం మారితే అమరావతి రాజధానిగా ఉండదు, తరలిస్తారని చెప్పాం. ఆనాటి ప్రతిపక్ష నేత జగన్.. ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, రాజధానిని ఎక్కడకూ తీసుకెళ్లనని చెప్పి ప్రజలను మోసగించారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానిపై అనేక ఆరోపణలు చేసి మూడుముక్కలాట మొదలుపెట్టారు. ఆరోజు శాసనసభలో మా ఎమ్మెల్యేలు పోరాడారు. శాసనమండలిలో మాకు మెజారిటీ ఉంది. దాని సాక్షిగా మేమంతా పోరాడాం.
రైతులను వెంటాడి వేధించారు
జగన్ మూడు ముక్కలాట మొదలెట్టిన రోజు నుంచి.. ప్రజారాజధాని కోసం ఉద్యమం మొదలైంది. పెద్దఎత్తున రైతులు, మహిళలు రోడ్డుపైకి వచ్చి 5 కోట్ల ఆంధ్రుల కోసం పోరాడారు. ఉద్యమించినందుకు వారిని అన్నిరకాలుగా అవమానించారు.. దాడిచేశారు. శాంతియుతంగా వారు అమరావతి నుంచి తిరుమలకు, సింహాచలానికి పాదయాత్ర చేస్తే అనేక ఇబ్బందులు పెట్టారు.. రాజధాని గ్రామాల్లో ప్రజలు స్వస్థలాల్లో తిరగాలంటే ఆధార్ కార్డు చూపించాల్సిన పరిస్థితులు కల్పించారు. ఐదేళ్లు 144 సెక్షన్ పెట్టారు. అక్కడి ప్రజలను వెంటాడి వేధించారు. 5 కోట్ల ఆంధ్రులు అదంతా ప్రత్యక్షంగా చూశారు. ఎన్నికలప్పుడు మేం చాలా స్పష్టంగా.. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అమరావతి, అభివృద్థి వికేంద్రీకరణ చేసి చూపిస్తామని చెప్పాం. అదే నినాదంతో కూటమిగా కలసికట్టుగా పోటీచేశాం. ప్రజలు 94 శాతం స్ట్రైక్ రేటుతో మమ్మల్ని గెలిపించారు. గత పాలకులు ఎక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడతామని మాయమాటలు చెప్పారో.. అక్కడే విశాఖ ప్రజలు మా అభ్యర్థిని అత్యధికంగా 5 లక్షల ఓట్లకు పైగా భారీ మెజారిటీతో గెలిపించారు. విశాఖపట్నంతోపాటు శ్రీకాకుళం, విజయనగరం, హిందూపురం, అనంతపురం, చిత్తూరు జిల్లాల ప్రజలంతా అమరావతికే మద్దతుగా నిలిచారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అమరావతే మా రాజధాని అని తెలుగు ప్రజలు స్పష్టంచేశారు. వైసీపీ టీం-11 అనేక దుష్ప్రచారాలు చేసింది.. ఇప్పుడూ చేస్తోంది. మళ్లీ అధికారంలోకి వస్తే మూడు రాజధానులు చేస్తామని ఇప్పుడు కూడా చెబుతున్నారు. ఇప్పటికే చాలా నష్టపోయాం..
మా భవిష్యత్ ఏమిటని రైతుల్లో కూడా ఆందోళన వచ్చింది. రాష్ట్రానికి ఏకైక శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్థత కల్పించాలని వారంతా కోరారు. అందుకే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి.. తీర్మానం ఆమోదించి పార్లమెంటుకు పంపించాం. ఒక్క పార్టీ తప్ప మొత్తం దేశం ఆంధ్ర రాష్ట్రానికి అండగా నిలబడింది. చాలామంది రాజ్యసభలో మాట్లాడుతూ...అమరావతికి మద్దతివ్వడం ప్రారంభం మాత్రమే.. అందరం ఆంధ్రప్రదేశ్‌కు అండగా నిలబడాలన్నాయి. ఆ పార్టీ మాత్రం వాకౌట్ చేసింది. మొత్తం దేశం ఈరోజు ఆంధ్రులకు అండగా నిలబడింది, ఇందుకు రాష్ట్రప్రజలంతా గర్వపడాలి. మాపై ఉంచి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం, తప్పనిసరిగా అమరావతి పనులు పూర్తిచేస్తాం. మోదీని తీసుకెళ్లి నూతన రాజధానికి రిబ్బన్ కటింగ్ చేయిస్తాం.
ఉపరాష్ట్రపతి, స్పీకర్‌తో భేటీ
అమరావతికి చట్టబద్ధత బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చకు హాజరైన లోకేశ్.. ఉదయం ప్రధాని మోదీని కలిశారు. బిల్లును ఆమోదించాక ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌ను వేర్వేరుగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఆయన వెంట కేంద్ర మంత్రులు కింజారపు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, దగ్గుమళ్ల ప్రసాదరావు, కలిశెట్టి అప్పలనాయుడు, అంబికా లక్ష్మీనారాయణ, బస్తీపాటి నాగరాజు, తెన్నేటి కృష్ణప్రసాద్, మాగుంట శ్రీనివాసులురెడ్డి, శ్రీభరత్, బైరెడ్డి శబరి, సానా సతీశ్, జీఎం హరీశ్, కేశినేని చిన్ని, బీకే పార్థసారథి, బీద మస్తాన్‌రావు, జనసేన ఎంపీలు బాలశౌరి, తంగెళ్ల ఉదయ్, బీజేపీ ఎంపీలు ఆర్.కృష్ణయ్య, పాక సత్యనారాయణ, సీఎం రమేశ్ తదితరులు ఉన్నారు.