Share News

బ్లాక్‌లో వాణిజ్య సిలిండర్లు!

ABN , Publish Date - Apr 03 , 2026 | 05:17 AM

గ్రేటర్‌ హైదరాబాద్‌లో కమర్షియల్‌ సిలిండర్ల ధర మోత మోగుతోంది. కొరతను ఆసరా చేసుకుని కొందరు డిస్ట్రిబ్యూటర్లు చమురు కంపెనీలు నిర్దేశించిన ధరను రూ.3,500 నుంచి 5,000 వరకు పెంచేశారు.

బ్లాక్‌లో వాణిజ్య సిలిండర్లు!

  • ఒక్కోదానిపై రూ.3,500-5,000 వరకు ఎక్కువ వసూలు

  • లబోదిబోమంటున్న హోటళ్లు, రెస్టారెంట్ల వ్యాపారులు

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ హైదరాబాద్‌లో కమర్షియల్‌ సిలిండర్ల ధర మోత మోగుతోంది. కొరతను ఆసరా చేసుకుని కొందరు డిస్ట్రిబ్యూటర్లు చమురు కంపెనీలు నిర్దేశించిన ధరను రూ.3,500 నుంచి 5,000 వరకు పెంచేశారు. దీంతో హోటళ్లు, మెస్‌లు, రెస్టారెంట్ల వ్యాపారులు లబోదిబోమంటున్నారు. కొందరు చేసేదేమీ లేక వ్యాపారాలను మూసివేసే ఆలోచనలో ఉన్నారు. గ్రేటర్‌లోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో వాణిజ్య కనెక్షన్లు సుమారు 40-50 వేల వరకు ఉన్నాయి. ఆయా జిల్లాల్లోని హోటళ్లు, మెస్‌లు, క్యాటరింగ్‌ యూనిట్లు, రెస్టారెంట్లు, టిఫిన్‌ సెంటర్లకు రోజుకు 12 వేల నుంచి 14 వేల సిలిండర్లు అవసరమవుతుంటాయి. అయితే పశ్చిమాసియా యుద్ధంతో గ్యాస్‌ కష్టాలు మొదలయ్యాయి. మరోవైపు మార్చి 1న, మళ్లీ ఏప్రిల్‌ 1న వాణిజ్య సిలిండర్ల ధరను చమురు కంపెనీలు పెంచాయి. గ్రేటర్‌లో మార్చి 1 వరకు రూ.1961.50 ఉన్న 19 కిలోల వాణిజ్య సిలిండర్‌ ధర.. మొదటిసారి రూ.144, రెండోసారి రూ.214.50 పెంచడంతో అన్ని పన్నులతో కలిపి రూ.2,320కి చేరింది. అయినా ఎలాగోలా నెట్టుకుని హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్‌ సెంటర్లను నడిపించాలని భావిస్తున్న వ్యాపారులు, యజమానులకు బ్లాక్‌ మార్కెట్‌ దందా గుబులు పుట్టిస్తోంది. కొంతమంది డిస్ట్రిబ్యూ టర్లు ఒక్కో సిలిండర్‌పై రూ.3,500-5,000 వరకు వసూలు చేస్తుండడంతో వారు బోరుమంటున్నారు. వచ్చే లాభం బ్లాక్‌లో సిలిండర్‌కే సరిపోతోందని సికింద్రాబాద్‌కు చెందిన ఓ మెస్‌ నిర్వాహకుడు తెలిపారు. సంబంధిత అధికారులు బ్లాక్‌ మార్కెట్‌ను అడ్డుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated Date - Apr 03 , 2026 | 05:17 AM