Share News

అమరావతి ఇక శాశ్వతం!

ABN , Publish Date - Apr 03 , 2026 | 04:53 AM

ప్రజా రాజధాని అమరావతి, దాని నిర్మాణం కోసం రైతులు చేసిన త్యాగాలు శాశ్వతంగా ఉంటాయని, ఇకపై అమరావతిని ఎవరూ టచ్‌ చేయలేరని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. చరిత్ర ఉన్నంత వరకు అమరావతి ఉంటుందని స్పష్టం చేశారు.

అమరావతి ఇక శాశ్వతం!

  • పార్లమెంటు చట్టం.. తిరుగులేని శాసనం

  • అనేక కుట్రలు దాటుకుని అమరావతికి రక్షణ.. ఇది ప్రజా విజయం

  • అమరావతి రైతుల 1631 రోజుల ఉద్యమం ఓ చరిత్ర

  • బిల్లును వ్యతిరేకించిన దేశంలోని ఒకే ఒక్క దిక్కుమాలిన పార్టీ వైసీపీ

  • ‘చట్టబద్ధత‘ను ఓర్వలేకే జగన్‌ డ్రామాలు

  • వాకౌట్‌ చేసిన ఆ పార్టీని బ్లాకౌట్‌ చేయాలి

  • పార్లమెంటు చట్టం తిరుగులేని శాసనం: సీఎం చంద్రబాబు

అనుకున్నది అనుకున్నట్లుగానే జరిగింది. రాజధాని ‘అమరావతి’కి పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధమైన రక్షణ లభించింది. 2014లో చేసిన రాష్ట్ర విభజన చట్టంలోనే... ‘ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధానిగా అమరావతి ఉంటుంది’ అనే సరికొత్త సవరణను పార్లమెంటు ఆమోదించింది. బుధవారం లోక్‌సభలో ఆమోదం పొందిన బిల్లును గురువారం రాజ్యసభ కూడా ఆమోదించింది. కేసీఆర్‌ అధ్యక్షుడుగా ఉన్న బీఆర్‌ఎస్‌ కూడా ఈ బిల్లును స్వాగతించడం విశేషం. ‘ఆమోదం సంపూర్ణం’ కాగానే రాష్ట్రవ్యాప్తంగా ‘కూటమి’ నేతలు, ప్రజలు సంబరాలు చేసుకున్నారు.

రాష్ట్ర రాజధానికి పార్లమెంటులో చట్టబద్ధత ఓ తిరుగులేని శాసనం. అమరావతి ఇకపై అన్‌స్టాపబుల్‌.. అద్వితీయం.. అజేయం.. అజరామరం. రాజధాని అమరావతి, దాని నిర్మాణం కోసం రైతులు చేసిన త్యాగాలు ఇకపై శాశ్వతంగా ఉంటాయి. ఇది అమరలింగేశ్వరుడు కొలువైన నేల. ప్రసిద్ధ బౌద్ధ స్థూపం ఓవైపు.. కృష్ణమ్మ, దుర్గమ్మ మరోవైపు అండగా ఉన్నారు. ఇంత మంది తోడుగా ఉండగా, అపజయం అనేది ఉండదు.

పార్లమెంటులో అమరావతి బిల్లుకు దేశంలోని అన్ని పార్టీలు మద్దతుగా నిలిచినా.. ఒకే ఒక్క దిక్కుమాలిన పార్టీ వైసీపీ వ్యతిరేకించింది. ప్రజలు, రాష్ట్ర భవిష్యత్తు గురించి వారికి పట్టదు. రాష్ట్రానికి ఆ పార్టీ పీడ విరగడవ్వాలి. అమరావతిని చంపాలనుకున్న వైసీపీకి భవిష్యత్తు లేకుండా చేయాలి. రాజధానికి చట్టబద్ధత కల్పిస్తుంటే సభ నుంచి ఆ పార్టీ ఎంపీలు వాకౌట్‌ చేశారు. ప్రజలు ఆ పార్టీని బ్లాక్‌ ఔట్‌ చేయాలి.

- సీఎం చంద్రబాబు

అమరావతి, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): ప్రజా రాజధాని అమరావతి, దాని నిర్మాణం కోసం రైతులు చేసిన త్యాగాలు శాశ్వతంగా ఉంటాయని, ఇకపై అమరావతిని ఎవరూ టచ్‌ చేయలేరని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. చరిత్ర ఉన్నంత వరకు అమరావతి ఉంటుందని స్పష్టం చేశారు.


రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంటులో చట్టబద్ధత కల్పించడం ద్వారా తిరుగులేని శాసనాన్ని లిఖించారని పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలోని ఉద్దండరాయునిపాలెంలో గురువారం సాయంత్రం నిర్వహించిన ‘అమరావతి విజయోత్సవ సభ’లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అమరావతి బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపిన ఈ రోజు.. ప్రజాస్వామ్య గొప్పతనాన్ని, ప్రజల సంకల్ప బలాన్ని చాటి చెప్పిన రోజు’ అని పేర్కొన్నారు. అనేక కుట్రలను దాటుకుని అమరావతిని రక్షించుకున్నామని, ప్రజా రాజధానిని సాధించుకున్నామన్నారు. రాష్ట్ర రాజధానికి పార్లమెంటు చట్టబద్ధత కల్పించడాన్ని ప్రజా విజయంగా ఆయన అభివర్ణించారు. అమరావతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ధన్యవాదాలు తెలిపారు. అన్ని పార్టీలు అమరావతికి సహకరించి, దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజుగా మార్చాయని ఆనందం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే..


వైసీపీది నీతిమాలిన రాజకీయం

‘‘పార్లమెంటులో అమరావతికి తిరుగులేని శాసనం చేసుకున్నాం. పార్లమెంటులో అమరావతి బిల్లు పెడితే దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు అమరావతికి అండగా నిలబడినా.. ఒకే ఒక్క దిక్కుమాలిన పార్టీ వైసీపీ మాత్రం వ్యతిరేకించింది. ఇంతటి నీతిమాలిన రాజకీయం నా చరిత్రలో చూడలేదు. ఆ పార్టీ నేతలు అమరావతిని శ్మశానం అన్నారు. రాజధానితో మూడు ముక్కలాట ఆడారు. అడ్రస్‌ లేకుండా పోయారు. అమరావతికి చట్టబద్ధత కల్పించడాన్ని ఓర్వలేని జగన్‌.. మావిగన్‌ అంటూ ఓ కొత్త ప్రతిపాదనతో డ్రామాకు తెరలేపారు. తెలుగుజాతి ఆత్మగౌరవం వీరికి పట్టదు. ప్రజలు, రాష్ట్ర భవిష్యత్తు గురించీ పట్టదు. విధ్వంసాలు చేయడం.. విషం చిమ్మడం, ప్రజలను భయబ్రాంతులను చేయడం. అమరావతిని చంపాలనుకున్న ఆ పార్టీకి భవిష్యత్తు లేకుండా చేయాలి. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తుంటే చట్టసభ నుంచి ఆ పార్టీ ఎంపీలు వాకౌట్‌ చేశారు. ప్రజలు ఆ పార్టీని బ్లాక్‌ ఔట్‌ చేయాలి’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.


అమరావతి.. ఆంధ్రుల ఆత్మగౌరవ చిహ్నం

‘‘అమరావతి రైతులు, రైతు కూలీలు, ప్రజల ఐకమత్యం వల్లే ఈ విజయం సాధించుకున్నాం. అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి చిహ్నం అని చాటారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి చీకటి రోజులు దాపురించాయి. ప్రజావేదికతో విధ్వంసాన్ని ప్రారంభించి, అమరావతిని ధ్వంసం చేశారు. దానిని అడ్డుకుంటూ రాజధాని రైతులు, మహిళల వీరత్వం, పోరాటాన్ని ప్రత్యక్షంగా చూశాను. ఉద్యమ శిబిరాలకు నాడు సతీసమేతంగా వచ్చాను. రైతుల ఉద్యమం చూసి భువనేశ్వరి చలించిపోయారు. ఉద్యమానికి సంఘీభావం తెలిపి చేతికున్న రెండు బంగారు గాజులు ఇచ్చారు. భువనేశ్వరి ఒక్కరే కాదు.. రాష్ట్ర ప్రజలు, దేశవిదేశాల్లో ఉన్న చాలా మంది ఉద్యమానికి అండగా నిలిచారు. న్యాయపోరాటం చేసే స్థోమత కూడా రైతులకు లేదు. ఆనాడు నా దగ్గర డబ్బుల్లేవు. దీంతో అమరావతి ఉద్యమం కోసం నేను స్వయంగా జోలె పట్టాను. మీ ఉద్యమంలో పాల్గొనేందుకు ముళ్ల కంచెలు దాటుకుని పవన్‌ కల్యాణ్‌ వచ్చారు. 1631 రోజులు ఉద్యమం ఓ చరిత్ర.. రైతులు చేపట్టిన ‘న్యాయస్థానం టు దేవస్థానం’ కార్యక్రమాన్ని నాటి పాలకులు అడ్డుకున్నారు. మీ ఉద్యమంపై నాటి ప్రభుత్వ దాష్టీకాన్ని చూసి నేనే మిమ్మల్ని యాత్ర ఆపేయమని కోరాను. మూడు ముక్కలాట చూసిన రాష్ట్ర ప్రజలు.. 2024లో కూటమికి అద్భుత విజయం అందించారు. ఇప్పుడు రాజధానికి చట్టబద్ధత కలిగింది. అమరావతి.. తెలుగు జాతి గుండె, జాతి గౌరవం. ప్రపంచంలోనే అమరావతిని ఉత్తమ నగరంగా తీర్చిదిద్ది జాతికి అంకితం చేస్తాను’’ అని సీఎం తెలిపారు.


ప్రపంచం చూసేలా అభివృద్ధి చేస్తాం

‘‘ఓ ప్రాజెక్టుకు ప్రధాని రెండుసార్లు రావడం అమరావతి పనుల విషయంలోనే జరిగింది. అమరావతి నిర్మాణాలు పూర్తయ్యాక మూడోసారి ప్రధాని అమరావతి వస్తారు. ప్రారంభోత్సవాలు చేస్తారు. అమరావతి శంకుస్థాపన రోజున.. పార్లమెంటు వద్ద ఉన్న పవిత్రమైన మట్టిని, పవిత్ర యమునా నది జలాలను ఇక్కడికి తీసుకొచ్చారు. అలాంటి వాటితో పునీతమైన పవిత్ర భూమి ఇది. దేశమంతా అమరావతికి అండగా ఉంటుందని చెప్పడానికే నాడు ప్రధాని వాటిని తీసుకొచ్చారు. అమరావతి అన్‌స్టాపబుల్‌.. అద్వితీయం.. అజేయం.. అజరామరం. 1995 నుంచి 2004 వరకు హైదరాబాద్‌ అభివృద్ధి ఏమిటో ఇప్పుడు ప్రపంచం చూస్తోంది. భవిష్యత్తులో అమరావతి అభివృద్ధిని కూడా ప్రపంచం చూసేలా చేస్తాం’’ అని పేర్కొన్నారు.

ఈ విజయం వెనుక ఎన్నో కన్నీళ్లు: మాధవ్‌

విజయోత్సవ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ మాట్లాడుతూ.. ‘‘అమరావతికి చట్టబద్ధత వెనుక ఎందరో రైతులు, ప్రజల కష్టాలు, కన్నీళ్లు ఉన్నాయి. అరెస్టులు ఎదుర్కొని, ఎన్నో త్యాగాలు చేసి అమరావతిని నిలబెట్టుకున్నారు.’’ అని పేర్కొన్నారు.

ఇక రాజధాని అభివృద్ధి రయ్‌రయ్‌: నాదెండ్ల

పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ.. అమరావతి అభివృద్ధి కోసం ప్రజలంతా ఆశగా ఎదురుచూస్తున్నారని అన్నారు. అమరావతికి చట్టబద్ధతతో ఇక రాజధాని అభివృద్ధి పనులు మరోస్థాయికి వెళ్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - Apr 03 , 2026 | 05:57 AM