డెంగ్యూతో జాగ్రత్త..
ABN , Publish Date - May 16 , 2026 | 12:43 PM
దోమలు పుట్టకుండా చూసుకుందాం...దోమలు కుట్టకుండా చూద్దాం... డెంగ్యూను తరిమికొడుదాం... ఇవీ డెంగ్యూ నివారణకు ప్రభుత్వ ప్రచార స్లోగన్స్... ప్రమాదకరమైన డెంగ్యూ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఇటీవల ప్రభుత్వం వాల్‌పోస్టర్లు, కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తోంది.
అప్రమత్తతపై ప్రచారం
నేడు జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం
జగిత్యాల: దోమలు పుట్టకుండా చూసుకుందాం...దోమలు కుట్టకుండా చూద్దాం... డెంగ్యూను తరిమికొడుదాం... ఇవీ డెంగ్యూ నివారణకు ప్రభుత్వ ప్రచార స్లోగన్స్... ప్రమాదకరమైన డెంగ్యూ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఇటీవల ప్రభుత్వం వాల్‌పోస్టర్లు, కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తోంది. ఈ నెల 16వ తేదీన జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం పురస్కరించుకొని ప్రభుత్వం పలు ప్రత్యేక కార్యక్ర మాలను నిర్వహిస్తోంది. ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రచారం నిర్వహించడంపై దృష్టి సారించింది. జగిత్యాల జిల్లాలో 2023 సంవత్సరంలో 110 మంది డెంగ్యూ బాధితులు, 2024 సంవత్సరంలో 292 మంది బాధితులు, 2025 సంవత్సరంలో 27 మంది బాధితులు, 2026 సంవత్సరంలో ఇప్పటివరకు ఇరువురు డెంగ్యూ బాధితులున్నట్లు వైద్యఆరోగ్య శాఖ వర్గాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలో డెంగ్యూ వ్యాధి నియంత్రణ, లక్షణా లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం
దోమకాటుతోనే..
డెంగ్యూకి కారణమయ్యే ప్లేవీ వైరస్‌లు ఆడ ఏడిస్ ఈజిప్టై దోమ కుట్టడం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. ఈ వైరస్‌లలో నాలుగు రకాలున్నాయి. ఒక రకం వైరస్‌తో ఒక సారే డెంగ్యూ వస్తుంది. అయితే ఇతర రకాల వైరస్‌లతో రావొ చ్చు. అంటే ఒకరికి జీవితంలో గరిష్టంగా నాలుగు సార్లు డెంగ్యూ వచ్చే అవకాశముంటుందని వైద్య నిపుణులు అం టున్నారు. రెండోసారి, మూడోసారి మరో రకం వైరస్‌తో జ్వరం వస్తే మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది.
పరీక్షలు, చికిత్స...
డెంగ్యూ లక్షణాలు ఉన్నట్లయితే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి గానీ దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి గానీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. తగిన వైద్య పరీక్షలు చేసుకొని చికిత్స పొందాలి. డెంగ్యూ వ్యాధి నిర్ధారణకు ఎలీసా పరీక్ష ఉత్తమ మైన ప్రామాణికంగా తీసుకుంటారు. బ్రూఫెన్ లాంటి నొప్పి నివారణ మందులు వాడరాదు. ద్రవ పదార్థాలు, ఓఆర్‌ఎస్ లాంటి ద్రావణాలు ఎక్కువగా తాగాలి.
ప్లేట్ లెట్స్ ఎక్కింపు..
డెంగ్యూ జ్వరంలో అందరికీ ప్లేట్ లెట్లు ఎక్కించాల్సిన అవసరం ఉండదు. ప్లేట్ లెట్ల సంఖ్య లక్ష కన్నా తగ్గినప్పుడు డాక్టర్ల పర్యవేక్షణలో ప్లేట్‌లెట్లు ఎక్కిస్తారు. ప్లేట్ లెట్స్ 50 వేల కన్నా పడిపోతే ఆసుపత్రిలో విధిగా చేర్చాల్సి ఉంటుంది. ఒకవేళ ప్లేట్ లెట్స్ 20 వేల కన్నా తగ్గి, రక్తస్రావ లక్షణాలు కనిపిస్తే బయట నుంచి ప్లేట్ లెట్స్ ఎక్కించాల్సి వస్తుందని వైద్యులు అంటున్నారు. అదే 10 వేలకు పడిపోతే రక్తస్రావం ఉన్నా, లేకున్నా ప్లేట్‌లెట్స్ ఎక్కించాలంటున్నారు.
జాగ్రత్తలు పాటిస్తేనే మేలు
ఇంటిలో గానీ, ఇంటి ఆవరణలో గానీ నీళ్ల కుండీలు, డ్రమ్ములు, గోళాలు వంటి ఓవర్ హెడ్ ట్యాంకులు, సంపుల మీద దోమలు గుడ్లు పెట్టకుండా మూ తలు పెట్టాలి.ప్రతి శుక్ర వారం డ్రైడే పాటించాలి. ఇంటి ఆవరణలో నీటి గుంటలు లేకుండా చూ డాలి. సీసాలు, డబ్బాలు, టైర్లలో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. కిటికీలకు తెరలు వాడాలి.
లక్షణాలు: దోమ కుట్టాక 3 నుంచి 14 రోజుల్లోపు ఎప్పుడైనా డెంగ్యూ ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశాలుంటాయి. తొలి, విషమ దశలను బట్టి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు అంటున్నారు. తొలిదశలో హఠాత్తు గా తీవ్ర జ్వరం రావడం, భరించలేనంత తలనొప్పి, కళ్ల వెనకాల నుంచి నొప్పి, కళ్ల ఎర్రబడొచ్చు, ఉబ్బొచ్చు అంటున్నారు. వాంతి, వికారం, ఆకలి మందగించడం, చర్మం మీద ఎర్రటి దద్దుర్లు, దురద కూడా ఉండవచ్చంటున్నారు. సాధారణంగా ఛాతీ మీద మొదలై చేతులు, కాళ్లు, ముఖానికి వ్యాపిస్తుంది. విషమ దశలో పొట్ట ఉబ్బటం, పొట్టలో నొప్పి, ఆయాసం, బీపీ పడిపోవడం, అపస్మారకం, వాంతులు, కాళ్లు చేతులు చల్లబడడం, చికాకు, మగత, చిగుళ్ల వంటి భాగాల నుంచి రక్తం కారడం, చర్మం మీద ఎర్రటి చుక్కల్లాంటి మచ్చలు ఏర్పడడం వంటివి కనిపిస్తాయని వైద్యులు అంటున్నారు.
గతంతో పోలిస్తే కేసులు తగ్గాయి
డాక్టర్ రాజగోపాల్‌రావు, డిప్యూటీ డీఎంహెచ్‌వో, కరీంనగర్
గతంతో పోలిస్తే కరీంనగర్ జిల్లాలో ఈ సంవత్సరం చాలా కేసులు తగ్గాయి. 2024లో 186 కేసులు, 2025 డిసెంబరు నాటికి 97 కేసులు నమోదు అయ్యాయి. 2026 జనవరి నుంచి ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. నీటి నిల్వలు ఉండే ప్రాంతాలు, ఓపెన్ ప్లాట్స్‌ల ను గుర్తించాం. నీరు నిలువ ఉండే చోట గంబూసియా చేపలను వదలడానికి ఇప్పటికే మత్య్సశాఖ అధికారులకు లేఖ రాశాం.ల్యాబ్ టెక్నీషియన్, హెల్త్ అసిస్టెంట్లకు శిక్షణ ఇచ్చాం.
అప్రమత్తతే నివారణ:
డాక్టర్ నీలారపు శ్రీనివాస్, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ, జగిత్యాల
అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల డెంగ్యూ వ్యాధిని నివారించవచ్చును. ఈ నెల 16వ తేదీన జాతీయ డెంగ్యూ దినోత్సవం పురస్కరించుకొని వైద్య ఆరోగ్య శాఖ కరపత్రాలు, వాల్‌పోస్టర్ల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నాం. ముందస్తు జాగ్రత్తలు తీసుకొని డెంగ్యూ వ్యాప్తి చెందకుండా ప్రయత్నాలు చేయాలి.
అప్రమత్తతే నివారణ:
డాక్టర్ నీలారపు శ్రీనివాస్, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ, జగిత్యాల
అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల డెంగ్యూ వ్యాధిని నివారించవచ్చును. ఈ నెల 16వ తేదీన జాతీయ డెంగ్యూ దినోత్సవం పురస్కరించుకొని వైద్య ఆరోగ్య శాఖ కరపత్రాలు, వాల్‌పోస్టర్ల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నాం. ముందస్తు జాగ్రత్తలు తీసుకొని డెంగ్యూ వ్యాప్తి చెందకుండా ప్రయత్నాలు చేయాలి.
ఈ వార్తలు కూడా చదవండి:
త్వరలో అందుబాటులోకి ఆర్టీసీ టూరిజం
గోల్డ్, సిల్వర్ రేట్స్ పతనం.. ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News