Share News

ఇంటి వైద్యం.. నిండు నూరేళ్ల భాగ్యం!

ABN , Publish Date - Sep 23 , 2026 | 10:17 AM

నేటి హైటెక్‌ యుగంలో మారిన జీవనశైలి, మానసిక ఒత్తిళ్లు, ఆహారపు అలవాట్లు మానవాళిని రకరకాల ఆధునిక రుగ్మతల వైపు నెడుతున్నాయి.

ఇంటి వైద్యం.. నిండు నూరేళ్ల భాగ్యం!
National Ayurveda Day 2026

  • నేడు జాతీయ ఆయుర్వేద దినోత్సవం

హైదరాబాద్: నేటి హైటెక్‌ యుగంలో మారిన జీవనశైలి, మానసిక ఒత్తిళ్లు, ఆహారపు అలవాట్లు మానవాళిని రకరకాల ఆధునిక రుగ్మతల వైపు నెడుతున్నాయి. మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం, నిద్రలేమి వంటి సమస్యలు ప్రతి ఇంటా సాధారణమైపోయాయి. ఇలాంటి తరుణంలో వేల ఏళ్ల నాటి మన భారతీయ ప్రాచీన వైద్య విధానం ‘ఆయుర్వేదం’ ప్రాధాన్యం మళ్లీ గుర్తుకొస్తోంది. కేవలం రోగాన్ని నయం చేయడమే కాకుండా... అసలు రోగమే రాకుండా నివారించే ఉత్తమ జీవన విధానాన్ని ఆయుర్వేదం ప్రపంచానికి చాటిచెబుతోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 23న దేశవ్యాప్తంగా ‘జాతీయ ఆయుర్వేద దినోత్సవం’ జరుపుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.


మూడు దోషాల సమతుల్యతే ఆరోగ్యం

ఆయుర్వేదం ప్రకారం మానవ శరీరంలో వాత, పిత్త, కఫ అనే మూడు దోషాలు ఉంటాయి. ఇవి సమతుల్యంగా ఉన్నప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉంటాడని, అసమతుల్యత ఏర్పడినప్పుడు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదం కేవలం వ్యాధులకు చికిత్స అందించడానికే పరిమితం కాకుండా.. వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికీ ప్రాధాన్యం ఇస్తుంది. ప్రస్తుతం మధుమేహం, రక్తపోటు, ఊబకాయం, మానసిక ఒత్తిడి, నిద్రలేమి వంటి జీవనశైలి సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. సకాలంలో భోజనం చేయడం, తగినంత నిద్ర, వ్యాయామం, ప్రకృతి సిద్ధమైన ఆహారం తీసుకోవడం వంటి ఆయుర్వేద జీవన విధాన సూత్రాలు ఆరోగ్య పరిరక్షణకు దోహదపడతాయని చెబుతున్నారు.


city5.2.jpgపాటించాల్సిన చిట్కాలు

  • ఉదయం నిద్ర లేవగానే గోరువెచ్చని నీరు తాగడం

  • రోజూ కాసేపు నడక లేదా యోగా

  • రాత్రి భోజనాన్ని తేలికగా, ముందుగానే తీసుకోవడం

  • స్క్రీన్‌టైమ్‌ను తగ్గించి తగినంత నిద్రపోవడం


జాతీయ వైద్య విధానంగా గుర్తించాలి

మన దేశ సాంప్రదాయ వైద్య పద్ధతులను ప్రపంచ దేశాలు గుర్తించాయి. సామాన్యుల జీవన స్థితిగతులు మెరుగుపడాలంటే ఆయుర్వేదంపై ప్రభుత్వం మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మన సాంప్రదాయ వైద్య పద్ధతి అయిన ఆయుర్వేదాన్ని జాతీయ వైద్య విధానంగా గుర్తించాలలి. జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎర్రగడ్డలోని ఆయుర్వేద వైద్య కళాశాలలో మూడు రోజులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.

  • నిరంజని ఝకోటియా, సీఎంఓ, డా.బూర్గుల రామకృష్ణారావు ఆయుర్వేద ఆస్పత్రి


ఆరోగ్యం కోసం ఆయుర్వేదం

విశ్వ ఆయుర్వేద పరిషత్‌, తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఆయుర్వేదంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించాం. అందులో భాగంగా ఆశావర్కర్లు, స్వయం సహాయక సంఘాలు, పాఠశాలలు, విద్యార్థి సమూహాలను భాగస్వాములను చేస్తూ ఆయుర్వేద ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఆయుర్వేదం వైద్యశాలకే పరిమితం కాకూడదు, ప్రతి గ్రామానికి, సమాజానికి తేవాలి.

  • డా. లక్ష్మీప్రసాద్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, తెలంగాణ, విశ్వ ఆయుర్వేద పరిషత్‌


ఈ వార్తలు కూడా చదవండి:

గణేశ నిమజ్జనం వేళ.. బార్లు, వైన్‌ షాప్‌ల బంద్‌

నీళ్లడిగితే రాజకీయం అంటారా?

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 23 , 2026 | 10:17 AM