హైదరాబాద్‌లో అనుమతుల్లేని ప్రైవేట్ ఆస్పత్రులు.. తనిఖీలు నామమాత్రమే
ABN , Publish Date - Oct 09 , 2026 | 10:20 AM
హైదరాబాద్ నగరంలో చాలా వరకు అనుమతి లేని ప్రైవేట్ ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్‌లు, డయాగ్నోస్టిక్, ఫిజియోథెరపీ సెంటర్లు, క్లినిక్‌లు యథేచ్ఛగా నడుస్తున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా పలు ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు
నామమాత్రంగా తనిఖీలు.. నోటీసులు
మామూళ్ల మత్తులో వైద్యాధికారులు
హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ నగరంలో చాలా వరకు అనుమతి లేని ప్రైవేట్ ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్‌లు, డయాగ్నోస్టిక్, ఫిజియోథెరపీ సెంటర్లు, క్లినిక్‌లు యథేచ్ఛగా నడుస్తున్నాయి. కొన్ని ఆస్పత్రి బోర్డులో చూడడానికి స్పెషలిస్టు వైద్యుల పేర్లు ఉంటాయి. కానీ ఆర్‌ఎంపీలు, నర్సులతో చికిత్స అందిస్తుంటారు. వైద్య పరికరాలు, ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్‌లు, నర్సింగ్ స్టాఫ్, పారామెడికల్ సిబ్బంది తదితరాలు నిబంధనలకు విరుద్ధంగా ఉంటాయి. ఇలాంటి వాటిపై వైద్యాధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు తక్కువ.
నామమాత్రంగా తనిఖీలు నిర్వహించి లోపాలుంటే నోటీసులిచ్చి సరిపెడతారు. లేకుంటే మామూళ్లు పుచ్చుకొని వదిలేస్తారు. ఎల్బీనగర్‌లో రద్దు చేసిన ఫిజియోథెరపీ సెంటర్‌కు తిరిగి లైసెన్స్ ఇవ్వడానికి మూడు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా వైద్యా ఆరోగ్య అధికారిని రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేసి లక్ష తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. దీంతో మరోమారు ప్రైవేట్ ఆస్పత్రుల తీరు, వైద్యాధికారుల అవినీతి తేటతెల్లమవుతోంది. గతంలో హైదరాబాద్ జిల్లా పరిధిలో 242 ఆస్పత్రులకు నోటీసులు ఇచ్చారు. ఇందులో 80 శాతమే అనుమతులు పొందాయి. మిగతా వాటి పరిస్థితి ఏమిటో అధికారులకే తెలియాలి.
నాలుగు గదులుంటే ఆస్పత్రిగా..
నగరం, శివారు ప్రాంతాల్లో ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్‌లు, నర్సింగ్ హోమ్‌లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఓ నాలుగు గదులు ఉంటే చాలు ఏకంగా ఓ మూడు నాలుగు పడకల ఆస్పత్రిగా మార్చేస్తున్నారు. దీనికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఉండదు. వీటికి ఫైర్ సేఫ్టీ నిబంధనలు అసలు కనిపించవు. కేవలం రోగులను జలగలా పీల్చుకోవడం తప్ప. క్యూర్ పరిధిలో దాదాపు మూడున్నర వేలకు పైగా నర్సింగ్‌హోమ్‌లు ఉంటాయి. ఇందులో సగం నర్సింగ్‌హోమ్‌లు మాత్రమే అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాయి.
రద్దు చేస్తే పేర్లు మార్చుకొని..
ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని 626 ఆస్పత్రులకు గతంలో అధికారులు నోటీసులు జారీ చేశారు. వ్యాపార సముదాయ మధ్యలో, ఇరుకు గదుల్లో నిర్వహించడం, సెట్‌బ్యాక్ లేకపోవడం వంటి కారణాలతో చర్యలకు ఉపక్రమించారు. ఓ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరగడంతో అప్పట్లో దానిని రద్దు చేశారు. ఆ తరువాత పేరు మార్చుకుని ఆ ఆస్పత్రి అన్నీ అనుమతులు తెచ్చుకుని యథావిధిగా వైద్య సేవలు అందిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
పండుగ సీజన్.. గోల్డ్ కొనుగోలుదారులకు ఊరట
దసరా రద్దీతో రైళ్లన్నీ ఫుల్.. వెయిటింగ్ లిస్టు కష్టమే
Read Latest AP News And Telangana News And International News And Telugu News