సాయికృష్ణ డెత్ కేసు ఛార్జిషీట్‌లో కీలక ఆధారాలు కోర్టు సమర్పించిన సిట్
ABN , Publish Date - Oct 09 , 2026 | 08:38 AM
విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసును ప్రభుత్వ ఆదేశాలతో నిష్పక్షపాతంగా విచారించామని కోర్టుకు సిట్ వెల్లడించింది.
విజయవాడ, అక్టోబర్ 09: నగరంలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసును ప్రభుత్వ ఆదేశాలతో నిష్పక్షపాతంగా విచారించామని కోర్టుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వెల్లడించింది. శుక్రవారం ఈ కస్టోడియల్ డెత్ కేసులో ఛార్జిషీట్‌లో కీలక ఆధారాలను కోర్టుకు సిట్ సమర్పించింది. సాయి కృష్ణను నాన్ బెయిలబుల్ వారెంట్ (NBW)పై తీసుకొచ్చిన అనంతరం జరిగిన పరిణామాలను ఆధారాలతో సహా కోర్టుకు ఛార్జిషీట్‌లో సిట్ నివేదించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెజవాడలోని గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో వాస్తవాలను వెలికి తీసేందుకు సిట్‌ను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం విదితమే.
సాయికృష్ణ కస్టోడియల్ డెత్ ఛార్జిషీట్‌లో సిట్ పేర్కొన్న అంశాలు..
గాదె సాయి కృష్ణ కస్టోడియల్ టార్చర్ కారణంగా మృతి చెందాడు.
సాయి కృష్ణ మృతి బయటకు రాకుండా ఆ ఆధారాలను ఏడుగురు నిందితులు ధ్వంసం చేశారు.
ఈ కస్టోడియల్ డెత్ కేసులో కీలక ఆధారాలతో సహా 263 డాక్యుమెంట్లను కోర్టుకు సిట్ సమర్పించింది.
86 పేజీల కేసు ఛార్జిషీట్‌లో సీఐ నాగరాజుతో పాటు ఏడుగురు నిందితులు చేసిన నేరాన్ని కోర్టుకు సిట్ సమర్పించింది.
సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో మొత్తం 120 సాక్షులను విచారించిన అనంతరం నిర్ధారణకు వచ్చినట్లు సిట్ వెల్లడించింది.
కృష్ణలంక పోలీసుల చేతిలో హింసకు గురై సాయికృష్ణ మరణించాడు.
సాయికృష్ణను పోలీస్ స్టేషన్‌లో దారుణంగా కొట్టి హింసించారు.
అతడి కస్టోడియల్ డెత్ అనంతరం స్టేషన్ బయట, లోపల ఉన్న అన్ని ఆధారాలు ధ్వంసం చేశారు.
లాకప్ డైరీ, జనరల్ డైరీ, సెంట్రీ బుక్‌లో సాయి కృష్ణకు సంబంధించిన వివరాలు ఏవి నమోదు చేయలేదు.
కృష్ణలంక పీఎస్‌లోని సీసీటీవీ ఫుటేజ్ మాయం చేయడంతోపాటు స్టేషన్‌లో కొత్త పెయింట్లు వేయించారు.
లాకప్‌లో సాయికృష్ణ ఆనవాళ్లను కడిగేయడం వరకు అన్ని ఆధారాలు ధ్వంసం చేశారు.
మార్కాపురం నుంచి NBWపై విజయవాడ తీసుకొచ్చి సాయి కృష్ణ చనిపోయే వరకు ఉన్న అన్ని కీలక ఆధారాలు ధ్వంసం చేశారు.
సాయికృష్ణను నిర్బంధించి హింసించిన వ్యవహారంలో సీఐ నాగరాజుతో పాటు మొత్తం ఏడుగురు కీలకంగా వ్యవహరించారు.
కస్టోడీయల్ టార్చర్ అనంతరం పోలీస్ స్టేషన్‌లో సాయి కృష్ణ ఆరోగ్యం క్షీణించింది. దీంతో అతడిని పాత భవనానికి తరలించారు.
సాయికృష్ణ మరణించాడని నిర్ధారించుకున్న తరువాత అతడి మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి శ్మశానానికి తరలించి.. అర్ధరాత్రి దహనం చేశారు.
ఇప్పటి వరకు సిట్ సుదీర్ఘ విచారణలో ఈ ఏడుగురు నిందితుల కారణంగానే సాయికృష్ణ చనిపోయాడని సిట్ తన నివేదికలో స్పష్టం చేసింది.
ఈ కేసులో విచారణ ఇంకా కొనసాగుతోందని కోర్టుకు సిట్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది.