సర్వైకల్ క్యాన్సర్‌పై పోరు
ABN , Publish Date - Mar 05 , 2026 | 08:52 AM
మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ ముప్పును తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను ప్రాథమిక వైద్యశాలలు, ప్రభుత్వ వైద్యశాలల్లో ఉచితంగా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ముప్పును తగ్గించేందుకు సర్కారు శ్రీకారం
గతంలో ఎన్నడూలేని విధంగా ప్రభుత్వ వైద్యశాలల్లో హెచ్‌పీవీ వ్యాక్సిన్
ఉమ్మడి జిల్లాలో 34,596 మంది 14 నుంచి 15ఏళ్లలోపు బాలికలు
ఇప్పటికే రాష్ట్రస్థాయిలో వ్యాక్సినేషన్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ఒంగోలు కలెక్టరేట్, మార్చి 4(ఆంధ్రజ్యోతి): మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ (Cervical Cancer) ముప్పును తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను ప్రాథమిక వైద్యశాలలు, ప్రభుత్వ వైద్యశాలల్లో ఉచితంగా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 14 నుంచి 15 ఏళ్ల మధ్య ఉన్న బాలికలకు ఈ వ్యాక్సిన్ వేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ వ్యాక్సిన్ వేయించడం ద్వారా గర్భాశయ క్యాన్సర్ నుంచి దాదాపు 98శాతం మేరకు రక్షణ కల్పిస్తుందని వైద్యులు నిర్ధారించారు. ప్రభావవంతమైన వ్యాక్సిన్‌ను తగిన వయస్సులోనే ఇవ్వాల్సి ఉంటుంది.
శరీర రోగ నిరోధక వ్యవస్థ చిన్న వయస్సులోనే మెరుగ్గా స్పందిస్తుండటంతో ఈ వ్యాక్సిన్ బాలికలకు ఒకే మోతాదుతో సరిపోతుందని వైద్యులు నిర్ధారించడంతో తదనుగుణంగా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించగా ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఆ కార్యక్రమాన్ని ఆరంభించారు. ప్రభుత్వ ఆదేశాలతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈ వ్యాక్సిన్ వేసేందుకు చర్యలు ప్రారంభించారు.
టెన్త్ పరీక్షలలోపే వ్యాక్సినేషన్..
ఇప్పటికే జిల్లాలో 14 నుంచి 15 ఏళ్లలోపు బాలికలు 34,596 మంది ఉన్నట్లు వైద్యాధికారులు ఉన్నట్లు గుర్తించారు. ఈ వ్యాక్సిన్లను కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి పంపుతుండగా తదనుగుణంగా జిల్లాలకు రాష్ట్రస్థాయి నుంచి సరఫరా కానుంది. మన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మరో వారం, పది రోజుల్లో ఈ వ్యాక్సిన్ వేసేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా బాలికలను గుర్తించారు. త్వరలో పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానుండటంతో ఆ లోపు వేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
ఆలోపు జిల్లాకు వ్యాక్సిన్ రాని పక్షంలో పరీక్షలు ముగిసిన అనంతరం బాలికలకు వేయనున్నారు. ఈ వ్యాక్సిన్‌ను బాలికల ఇళ్ల వద్ద కాకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ వైద్యశాలల్లో వేయనున్నారు. ఇప్పటికే బాలికల నివాసం, వారి స్వగ్రామం, వారి వయస్సు తదితర వివరాలన్నింటిని వైద్యశాఖ సేకరించింది. ఈ వ్యాక్సిన్ గర్భాశయ క్యాన్సర్‌ను మాత్రమే కాకుండా కొన్ని ఇతర రకాల గొంతు క్యాన్సర్‌లను కూడా నివారించేందుకు దోహదపడుతుందనే విషయాన్ని విస్తృత ప్రచారం కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలన్నదే మా లక్ష్యం: మంత్రి నారా లోకేశ్
శాసనమండలిలో గందరగోళం.. శ్రీవారి లడ్డూ అంశంపై వాగ్వాదం
Read Latest Telangana News And AP News And Telugu News