ఉచిత టెస్ట్‌లు ఉత్తదే!
ABN , Publish Date - Sep 03 , 2026 | 12:28 PM
ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, ఎంసీహెచ్, ఏరియా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలన్నీ రోగ నిర్ధారణ కోసం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని టీ-హబ్‌పైనే ఆధారపడ్డాయి.
ప్రభుత్వాస్పత్రిల్లో రోగ నిర్ధారణ పరీక్షలకు రోగం
సంగారెడ్డి టీ-హబ్‌లో నిలిచిన కీలక టెస్టులు
మెదక్ జిల్లా పీహెచ్‌సీల్లో మూలనపడ్డ సెల్ కౌంటర్లు
రసాయనాల కొరతతో తీవ్ర ఇబ్బందులు
ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్న బాధితులు
సంగారెడ్డి, మెదక్ జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత రోగ నిర్ధారణ పరీక్షల వ్యవస్థ పడకేసింది. పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించాల్సిన తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ (టీ-హబ్)తో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్‌సీ) రసాయనాల (రీయేజెంట్స్) కొరత వేధిస్తోంది. దీంతో పలు కీలకమైన రక్త పరీక్షలు నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సంగారెడ్డి/మెదక్: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, ఎంసీహెచ్, ఏరియా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలన్నీ రోగ నిర్ధారణ కోసం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని టీ-హబ్‌పైనే ఆధారపడ్డాయి. ఇక్కడ నిత్యం 134 రకాల పరీక్షలు జరగాల్సి ఉండగా, ప్రస్తుతం సీబీపీ, సీఆర్‌పీ, లిపిడ్ ప్రొఫైల్, ఆర్‌పీఆర్ వంటి అత్యంత కీలకమైన రోగ నిర్ధారణ పరీక్షలు నిలిచిపోయాయి. సీజనల్ వ్యాధులు ముమ్మరంగా ఉన్న సమయంలో ల్యాబ్‌లలో సేవలు నిలిచిపోవడంతో వందలాది మంది రోగులు ప్రైవేటు డయాగ్నోస్టిక్ కేంద్రాలను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారు.
పీహెచ్‌సీల్లో కేవలం ర్యాపిడ్ టెస్ట్‌లే
గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన మెదక్ జిల్లా పీహెచ్‌సీల్లో వైద్య పరీక్షల నిర్వహణ అధ్వానంగా మారింది. లక్షలాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన సెల్ కౌంటర్ యంత్రాలు నిర్వహణ కరువై మూలనపడ్డాయి. మరికొన్ని చోట్ల అసలు యంత్రాలే లేవు. ఉన్న చోట్ల కెమికల్స్ కొరత వేధిస్తోంది. ప్రస్తుతం పీహెచ్‌సీల్లో కేవలం మలేరియా, డెంగీ, హెచ్‌ఐవీ, టైఫాయిడ్ వంటి కొన్ని పరీక్షలను మాత్రమే ర్యాపిడ్ కిట్లతో చేస్తూ సరిపుచ్చుతున్నారు. కంప్లీట్ బ్లడ్ కౌంట్ (సీబీసీ) వంటి ప్రాథమిక పరీక్షలు కూడా ఇక్కడ నిర్వహించడం లేదు.
రిపోర్టుల కోసం తప్పని నిరీక్షణ
మెదక్ జిల్లా వ్యాప్తంగా 98 పల్లె దవాఖనాలు, రెండు బస్తీ, 20 పీహెచ్‌సీలు, ఒక అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. వీటి పరిధిలో రోజూ దాదాపు రెండు వేల మంది ఓపీ సేవలు పొందుతున్నారు. వీరిలో సుమారు వెయ్యి మందికి రక్త నమూనాలు సేకరించి, జిల్లా కేంద్రంలోని టీహబ్‌కు పంపుతున్నారు. ఇంత మందివి జిల్లా కేంద్రానికి చేరుతుండడంతో రిపోర్టులు రావడానికి రెండు నుంచి మూడు రోజుల సమయం పడుతోంది. ప్రాథమిక స్థాయి పరీక్షల కోసం కూడా సుదూర ప్రాంతాల నుంచి మళ్లీ ఆస్పత్రులకు రావలసి రావడంతో అదనపు సమయం, ప్రయాణ ఖర్చులు భారంగా మారుతున్నాయి.
శాశ్వత పరిష్కారం చూపాలి
వైద్య కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు, రసాయనాల కొరత తలెత్తకుండా ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షించాల్సి ఉండగా, వారి అలసత్వం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అత్యవసర చికిత్స అవసరమైన వారు సైతం నివేదికల కోసం రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి టీ-హబ్‌లోనూ, పీహెచ్‌సీల్లోనూ తరచూ ఏర్పడుతున్న కెమికల్స్ కొరత సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, నిరుపయోగంగా ఉన్న యంత్రాలకు వెంటనే మరమ్మతులు చేయించాలని రోగులు కోరుతున్నారు.
రక్త నమూనాలు జిల్లా కేంద్రానికి పంపుతున్నాం
మెదక్ జిల్లాలోని పీహెచ్‌సీల్లో మలేరియా, డెంగీ, హెచ్‌ఐవీ, టైయిపాడ్ వంటి పరీక్షలు ర్యాపిడ్ కిట్ల ద్వారా చేస్తున్నాం. కొన్ని చోట్ల సెల్ కౌంటర్ మిషన్‌లు లేకపోవడంతో రక్త నమూనాలు సేకరించి, జిల్లా కేంద్రంలోని టీహబ్‌కు పంపుతున్నాం. యంత్రాల మరమ్మతులకు కోసం అధికారులు నివేదికలు అందజేశాం. రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్య సేవలు అందిస్తున్నాం.
డా.గణేశ్వర్, మెదక్ డీఎంహెచ్‌వో
ఈ వార్తలు కూడా చదవండి:
రేషన్ బస్తాలో పది శాతానికి మించి నూకలే..
హలధారి.. అయోమయం.. రైతు బీమా ఉన్నట్లా! లేనట్లా.?
Read Latest AP News And Telangana News And International News And Telugu News