నకిలీ వైద్యులున్నారు జాగ్రత్త!
ABN , Publish Date - May 20 , 2026 | 08:12 AM
దగ్గు, దమ్ము, జ్వరం, జలుబు, శరీరపు నొప్పులు.. సమస్య ఏదైనా వెంటనే చికిత్స చేసేస్తారు. స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ విపరీతంగా ఇచ్చేస్తారు.
తెల్లకోటు, మెడలో స్టెత్స్కోప్తో హల్‌చల్
చదివింది ఇంటర్ అయినా క్లినిక్ ఏర్పాటు.. ఏ జబ్బుకైనా వైద్య చికిత్స
యథేచ్ఛగా యాంటీబయాటిక్స్ వినియోగం..
గ్రేటర్‌లో జోరుగా నకిలీ వైద్యం దందా
హైదరాబాద్ సిటీ: దగ్గు, దమ్ము, జ్వరం, జలుబు, శరీరపు నొప్పులు.. సమస్య ఏదైనా వెంటనే చికిత్స చేసేస్తారు. స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ విపరీతంగా ఇచ్చేస్తారు. వాళ్లు వైద్యులేనా అంటే కాకపోవచ్చు. ఎందుకంటే గ్రేటర్‌లో నకిలీ వైద్యులు హల్‌చల్ చేస్తున్నారు. రోగికి అపాయం ఏర్పడినప్పుడు వీరి బాగోతం బయటపడుతోంది. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహించి, అనేక క్లినికల్‌లలో జరుగుతున్న నకిలీ వైద్యుల దందాను బట్టబయలు చేసింది. వివరాలను జిల్లా వైద్యశాఖాధికారులకు అప్పగించింది. అయినప్పటికీ అనేక చోట్ల నకిలీ వైద్యుల దందా కొనసాగుతూనే ఉంది.
వందల కొద్దీ నకిలీ వైద్యులు
హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజిగిరి మేడ్చల్ జిల్లాల్లో 250 మంది వరకు నకిలీ వైద్యులున్నట్లు తెలుస్తోంది. అధికారుల లెక్కల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వందమంది నకిలీ వైద్యులు ఉన్నారు. గతంలో వైద్య ఆరోగ్యశాఖ ఓ జాబితాను సిద్ధం చేసింది. చాలామంది నకిలీ వైద్యులు ఎంబీబీఎస్ డిగ్రీలతోపాటు, ఆయా రంగాల్లో స్పెషలైజేషన్ డిగ్రీలు పెట్టుకొని యథేచ్ఛగా వైద్యం అందిస్తున్నట్లు నిర్ధారించారు. అందులో 30 క్లినిక్‌లపై గతంలో కేసులు కూడా నమోదు అయ్యాయి. ఈ నకిలీ డాక్టర్లు శివారు ప్రాంతాల్లో లెక్కకు మించి క్లినిక్‌లు తెరిచి వైద్యం అందిస్తున్నారు. పాతబస్తీ, దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, వనస్థలిపురం, ఉప్పల్, రామంతాపూర్, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, షాపూర్‌నగర్, బోరబండ, రహ్మత్‌నగర్, మెహిదీటప్నం, అల్వాల్ తదితర ప్రాంతాల్లో నకిలీ డాక్టర్లకు కొదవే లేదు. ఏదైనా ఘటన జరిగిన సమయంలో చర్యలు తీసుకుంటున్నారు. ఆ తర్వాత వాటి గురించి పట్టించుకోవడం లేదనే విమర్శలు ఎక్కువగా చోటు చేసుకున్నాయి.
ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పేరుతో..
ఫస్ట్ ఎయిడ్‌లో శిక్షణ పొందిన వారు సెంటర్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఎవరికైనా గాయాలు ఏర్పడినప్పుడు, ప్రమాదాల్లో దెబ్బలు తగిలినప్పుడు తమ సెంటర్‌లో ప్రాథమిక వైద్యం అందించవచ్చు. కానీ సెంటర్ నిర్వాహకులు తమ పేరు పక్కన డాక్టర్‌ను తగిలించుకుని చికిత్సలు చేస్తున్నారు. పాతబస్తీలో చాలా మంది నకిలీ వైద్యం అందిస్తున్నారు. కొన్నిచోట్ల ఆయుర్వేద, హామియోపతి వైద్యం పేరుతో చికిత్సలు అందిస్తున్నారు.
టీజీఎంసీ విస్తృత తనిఖీలు
తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ) చాలా కాలం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ వైద్యులపై నజర్ పెట్టింది. జిల్లాల వారీగా టీజీఎంసీ సభ్యులు తనిఖీలు నిర్వహించి వారికపై కేసులు నమోదు చేసి జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్యశాఖాధికారి, పోలీసు శాఖ, డ్రగ్స్ నియంత్రణాఽ అథారిటీకి నివేదికలు అందజేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1200 మందికి పైగా నకిలీ వైద్యులున్నట్లు గుర్తించినట్లు టీజీఎంసీ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ శ్రీనివాస్ వివరించారు. ఇప్పటి వరకు 620 మందికిపై కేసులు నమోదు చేసి ఆయా జిల్లా ఉన్నతాధికారులకు నివేదికలు అందజేశామన్నారు.
నకిలీ వైద్యులపై జిల్లాల కలెక్టర్లు, వైద్యశాఖాధికారులు చర్యలు తీసుకోవచ్చునని, ఆయా క్లినిక్‌లను మూసి వేయవచ్చునని ఆయన వివరించారు. చాలా చోట్ల ఇంటర్ ఫెయిల్, పదో తరగతి వరకు చదువుకున్న వారు కూడా వైద్యుల అవతారం ఎత్తినట్లు తాము గుర్తించామన్నారు. ఒకటి నుంచి పది పడకలు వరకు ఏర్పాటు చేసి క్లినిక్‌లు కూడా నిర్వహిస్తున్నట్లు తమ తనిఖీలో బయటపడిందన్నారు. అవగాహన లేకుండా స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్, యాంటీ బయటాటిక్స్ విచ్చలవిడిగా వినియోగిస్తే ఒక్కోసారి ప్రమాదస్థితికి చేరుకుంటారని డాక్టర్ శ్రీనివాస్ పేర్కొంటున్నారు.
ఏకంగా మెడికల్ షాప్ నుంచే..
ఇంటర్ ఫెయిల్ అయిన భూపాల్‌పల్లికి చెందిన నన్నుట మాధవ్ తన స్నేహితురాలి డ్రగ్స్ లైసెన్స్ ఆధారంగా మెడికల్ దుకాణాన్ని నడుపుతున్నారు. మందులు విక్రయించడమే కాకుండా చికిత్సలు కూడా చేస్తున్నట్లు వారాసిగూడ పోలీసులు గుర్తించారు. అర్హత లేకపోయినా మెడికల్ దుకాణానికి వచ్చిన వారికి ఇంజెక్షన్లు ఇస్తున్నట్లు గుర్తించారు. సదరు మెడికల్ దుకాణంపై ఇటీవల పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి మెడికల్ దుకాణంలో వైద్యం అందిస్తున్న మాధవ్‌ను వారాసిగూడ పోలీసులు అరెస్టు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
బీర్ సీసాలో కండోమ్ ప్యాకెట్ కలకలం..
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. బాపట్ల యువకుడి మృతి
Read Latest AP News And Telangana News And International News And Telugu News