కువైట్‌లో తిరుపతి మహిళ నరకయాతన
ABN , Publish Date - May 20 , 2026 | 06:24 AM
బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లిన తిరుపతి జిల్లాకు చెందిన భాగ్యవతి అనే గిరిజన మహిళ అక్కడ నరకయాతన పడుతోంది.
కాపాడాలంటూ బాధితురాలు సెల్ఫీ వీడియో
ఏజెంట్ అమ్మేశాడంటున్నారని కన్నీరు
చంద్రగిరి, మే 19(ఆంధ్రజ్యోతి): బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లిన తిరుపతి జిల్లాకు చెందిన భాగ్యవతి అనే గిరిజన మహిళ అక్కడ నరకయాతన పడుతోంది. పని చేసే చోట తనను చిత్రహింసలకు గురిచేస్తున్నారని, కాపాడాలంటూ సీఎం చంద్రబాబు, డిప్యూ టీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌లను వేడుకుంది. ఈ మేరకు తన బాధలను చెప్పుకుంటూ, కన్నీటిపర్యంతం అవుతూ ఓ సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో పెట్టింది. ఆమె చెప్పిన వివరాల ప్రకారం.. తిరుపతి జిల్లా తొండవాడ పంచాయతీ గోపాలపురం ఎస్టీ కాలనీకి చెందిన భాగ్యవతికి వేరే ఓ మహిళ ద్వారా పీలేరుకు చెందిన చిన్నబ్బ అనే ఏజెంట్ పరిచయమయ్యాడు. ఆరు నెలల కిందట కువైట్‌లోని ఇంటిలో పని ఇప్పిస్తానని నమ్మబలికాడు. బతుకుదెరువు కోసం చిన్నబ్బ మాటలు నమ్మి.. భాగ్యవతి కువైట్‌కు వెళ్లింది. అక్కడ ఇంటి పనులే కాకుండా కష్టమైన ఇతర పనులు కూడా చేయిస్తున్నారని, చిత్రహింసలకు గురిచేస్తున్నారని బాధితురాలు తన వీడియోలో వాపోయింది. తాను తిరిగి తమ దేశానికి వెళ్లిపోతానంటే.. ఏజెంట్ చిన్నబ్బకు డబ్బులు ఇచ్చామని, తనను అమ్మేశాడని వారు చెబుతున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. తనను రక్షించాలని సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేశ్‌తో పాటు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానీలను వేడుకుంది. కాగా, భాగ్యవతి తల్లిదండ్రులు తులసమ్మ, చెంచయ్యలు చంద్రగిరి పోలీసులకు ఏజెంట్ చిన్నబ్బపై ఫిర్యాదు చేశారు.