భూమ్మీదకు రాకుండానే.. కాలుష్యం కాటు!
ABN , Publish Date - Nov 18 , 2026 | 09:16 AM
కాలుష్యం పుట్టబోయే శిశువులపైనా ప్రభావం చూపుతోంది. వాతావారణ మార్పుల కారణంగా మహిళల హార్మోన్లలో సమతుల్యత దెబ్బతిని నెలలు నిండకుండానే శిశువులకు జన్మనిస్తున్నారు.
నెలలు నిండకుండానే జననం
హార్మోన్లపై వాతావరణ మార్పుల ప్రభావం
ఆలస్య వివాహాలూ కారణమే
మానసిక, పని ఒత్తిళ్లతో సతమతం
ఆధునిక చికిత్సలతో కాస్త ఊరట
హైదరాబాద్ సిటీ: కాలుష్యం పుట్టబోయే శిశువులపైనా ప్రభావం చూపుతోంది. వాతావారణ మార్పుల కారణంగా మహిళల హార్మోన్లలో సమతుల్యత దెబ్బతిని నెలలు నిండకుండానే శిశువులకు జన్మనిస్తున్నారు. ఆరేడు నెలలకే పుట్టిన శిశువులు పురిటిలోనే కన్నుమూస్తున్నారు. హైదరాబాద్ వంటి నగరాల్లో జరిగే వంద ప్రసవాల్లో 15 నుంచి 20 శాతం వరకు నెలల నిండని శిశువులు జన్మిస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. ఆధునిక చికిత్స విధానాలతో 26 నుంచి 32 వారాల్లో జన్మించినా శిశువు ప్రాణాలను కాపాడే అవకాశముందని స్పష్టం చేస్తున్నారు. ఇందుకు శిక్షణ పొందిన వైద్యులు, నర్సులు, వైద్య సంపత్తి, మంచి ఆస్పత్రి కీలకమని పేర్కొంటున్నారు.
గర్భస్థ శిశువుపై ఒత్తిడి ప్రభావం
కాలుష్యంతో పాటు ఉద్యోగ ఒత్తిళ్లు కూడా శిశువుపై ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. కార్పొరేట్ ఆఫీసుల్లో పనిచేసే మహిళా ఉద్యోగులు రాత్రి, పగలు తేడా లేకుండా పని చేస్తూనే ఉంటారని, ప్రాజెక్టుల ఒత్తిడితో సతమతం అవుతారని పేర్కొంటున్నారు. అలాంటి మహిళలు గర్భం దాల్చినప్పుడు శిశువుపై అది ప్రభావం చూపుతుందని వైద్యులు వివరించారు. బ్రెయిన్ స్టిమిలేషన్ వల్ల కణాల ఎదుగుదల మందగిస్తుందని, దీని వల్ల గర్భంలో ఉండే శిశువు ఎదుగుదల మందగిస్తుందని అన్నారు. దీనివల్ల నెలల నిండని శిశువులు, తక్కువ బరువు ఉండే వారు జన్మిస్తారని వివరిస్తున్నారు.
ఈ సమయంలో అప్రమత్తం
32 నుంచి 34 వారాల లోపు, కిలో కంటే తక్కువ బరువు ఉన్నా ప్రత్యేక చికిత్స అందించాలి.
28 నుంచి 32 వారాల లోపు పుట్టే పిల్లలకు నవజాత శిశువు వార్డుల్లో చికిత్స అందించాలి.
34 వారాలు దాటిన తర్వాత జన్మించే శిశువులకు 1.82 కిలోల బరువు ఉంటే ప్రమాదం ఉండదు.
ఆధునిక చికిత్సతో పునర్జన్మ
నెలలు నిండకుండానే జన్మించినా కొందరు శిశువులకు ఆధునిక చికిత్స ప్రాణం పోస్తోంది. 24 నుంచి 37 వారాల మధ్య జన్మించే శిశువును ప్రీమెచ్యుర్ బేబీగా వైద్యులు పరిగణిస్తారు. 34 నుంచి 36 వారాల మధ్య జన్మించే శిశువుకు త్వరగా చికిత్స అందిస్తే ఆరోగ్యవంతులను చేయవచ్చు. అంత కంటే ముందు జన్మించే బిడ్డల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. 500 గ్రాములతో పుట్టినా వారి బరువు పెంచే ఆధునిక సదుపాయాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. వారికి తల్లిగర్భంలో ఉండే వాతావరణాన్నే కల్పించి చికిత్స అందించడం ద్వారా అనారోగ్య సమస్యలు రాకుండా చేయవచ్చని చెబుతున్నారు.
కాలుష్యంతో శిశువులకూ ముప్పే
ప్రస్తుతం 30 నుంచి 40 శాతం మంది గర్భిణులు నెలలు నిండకుండానే శిశువుకు జన్మనిస్తున్నారు. అందుకు కాలుష్యం కూడా ఒక కారణమే. ప్రస్తుతం అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, వైద్య పరికరాలు, వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో నెలలు నిండకుండా తక్కువ బరువుతో పుట్టే పిల్లలను కాపాడే అవకాశముంది. అయితే గోల్డెన్ అవర్ అంటే తొలి గంటలోనే మెరుగైన చికిత్స అందించాలి. మంచి వైద్యం అందిస్తే ప్రాణాలు కాపాడొచ్చు.
డాక్టర్ నితాషా బగ్గ, నవజాత శిశువు, పిల్లల వైద్యురాలు, రెయిన్‌బో చిల్డ్రన్ ఆస్పత్రి, బంజారాహిల్స్
మరిన్ని కారణాలు..
గర్భిణుల గర్భాశయానికి ఇన్‌ఫెక్షన్ సోకితే ప్రసవం త్వరగా జరిగే అవకాశముంది.
తల్లికి బీపీ, కిడ్నీ పనితీరు సరిగా లేకపోయినా, ముఖం వాచినా గర్భిణుల్లో మధుమేహం తీవ్రంగా ఉన్నా శిశువు జననం త్వరగా జరిగే ప్రమాదం.
తక్కువ వయస్సు, ఆలస్య వివాహాలు కూడా కారణమే.
రక్తస్రావం (బ్లీడింగ్) ఎక్కువగా జరిగే గర్భిణులకు తక్కువ బరువుతో బిడ్డ పుట్టే ప్రమాదముంది.
ఈ వార్తలు కూడా చదవండి:
‘తెలంగాణ దర్శిని’కి రూ.11.69 కోట్లు
మావోయిస్టుల భారీ డంప్‌ల స్వాధీనం
Read Latest AP News And Telangana News And International News And Telugu News