అబద్ధాలు చెప్పడంలో ఇద్దరూ ఇద్దరే
ABN , Publish Date - Apr 03 , 2026 | 11:52 AM
ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అబద్ధాలు చెప్పడంలో సమర్థులని, ఈ ఎన్నికల్లో వారిచ్చే హామీలను నమ్మొద్దని రాష్ట్ర ప్రజలను టీవీకే అధ్యక్షుడు విజయ్ హెచ్చరించారు.
మోదీ, స్టాలిన్‌లపై విజయ్ ధ్వజం
తిరుచ్చి తూర్పులో నామినేషన్ దాఖలు
చెన్నై: ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అబద్ధాలు చెప్పడంలో సమర్థులని, ఈ ఎన్నికల్లో వారిచ్చే హామీలను నమ్మొద్దని రాష్ట్ర ప్రజలను టీవీకే అధ్యక్షుడు విజయ్ హెచ్చరించారు. గురువారం తిరుచ్చి తూర్పు నియోజకవర్గంలో నామినేషన్ వేసిన అనంతరం.. సమీపంలోని ఎంజీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. అభిమానులు, టీవీకే కార్యకర్తలు, మహిళలను ‘గ్యాస్ సమస్య ఎలా ఉంది’ అని ప్రశ్నించిన విజయ్..
ఈ సమస్య వల్ల టీ దుకాణాల నుంచి పెద్ద హోటళ్ల వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆరోపించారు. యుద్ధం కారణంగా గ్యాస్ కొరత వస్తోందని ఎవ్వరూ ఊహించలేదని, అయినా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తన కుటుంబంలో తలెత్తే సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీ వెళ్లే స్టాలిన్ రాష్ట్ర హక్కుల కోసం ఎందుకు వెళ్లరని ప్రశ్నించారు. తిరుచ్చికి చెందిన ఓ మంత్రి ఉద్యోగాల పేరిట నమ్మించి సుమారు రూ.12కోట్లు అవినీతికి పాల్పడ్డారని, డీఎంకేలో ఇలాంటివి సహజమేనన్నారు.
టీవీకే పథకాలు జనరంజకం....
తమిళగ వెట్రి కళగం అబద్ధాలు ఎప్పుడూ చెప్పదని, నెరవేర్చగలిగిన పథకాల గురించే ప్రకటిస్తుందని, అందువల్ల ప్రజల మధ్య తమ ఎన్నికల హామీలకు ప్రజాదరణ పెరుగుతోందని విజయ్ పేర్కొన్నారు. అన్నపూర్ణ సూపర్ సిక్స్ పథకం కింద సంవత్సరానికి 6 సిలిండర్లు, 60యేళ్లు నిండిన గృహిణులకు నెల రూ.2వేలు, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక వసతులు, విద్యాశాఖలో ఖాళీ పోస్టుల భర్తీకి తక్షణ చర్యలు చేపడతామని విజయ్ హామీ ఇచ్చారు. తనపట్ల నమ్మకం ఉంచుకుని మెజారిటీ స్థానాల్లో గెలిపించి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని విజయ్ ప్రజలను అభ్యర్ధించారు.
సెంటిమెంట్...
సినీ రంగంలో హీరోగా రాణిస్తూ అలస్యంగా రాజకీయాల్లో ప్రవేశించిన విజయ్ తన తొలి రాజకీయ సభను 2025 సెప్టెంబర్ 13న తిరుచ్చి పాలక్కరైలో నిర్వహించారు. రెండోసారి మరక్కడై గాంధీ మార్కెట్ ప్రాంతంలో విజయ్ పర్యటించారు. ఈ రెండు ప్రాంతాల్లో ఆయన సభలకు జనం పోటెత్తడం, ముఖ్యంగా క్రైస్తవ ఓటర్లు అధికంగా ఉండడంతో తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాన్ని విజయ్ ఎంపిక చేసినట్లు సమాచారం. కాగా, ఈ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఇనికో ఇరుదయరాజ్ (డీఎంకే), మాజీ ఎమ్మెల్యే రాజశేఖర్ (అన్నాడీఎంకే)లతో విజయ్ పోటీ పడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
‘ఆంధ్రజ్యోతి’ చెప్పిందే... జరిగింది!
Read Latest Telangana News and National News